తగ్గిపోయిన నాన్ ఏసీ రైళ్లు
తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్న ప్రయాణికులు
చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ముఖం చాటేస్తున్న వైనం
దాదర్: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్ కూల్‌గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్ క్లాస్ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్‌లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు.
ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్ రైళ్లను ఫాస్ట్ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్–చర్చిగేట్ స్టేషన్ల మధ్య, భాయిందర్–చర్చిగేట్ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్–విరార్ (డౌన్) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment