రైల్వే స్టేషన్లలో కొత్త ‘ఫుడ్’ | new food scheme in railway station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్లలో కొత్త ‘ఫుడ్’

Published Tue, Dec 30 2014 10:24 PM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

new food scheme in railway station

సాక్షి, ముంబై: సబర్బన్ రైల్వే స్టేషన్లలో ఉన్న ఫుడ్ స్టాళ్లను కూల్చేయాలని పశ్చిమ రైల్వే యోచిస్తోంది. వీటిస్థానంలో కొత్త హంగులతో నూతన స్టాళ్లను ఏర్పాటుచేయాలని పథకం రూపొందిస్తోంది. అయితే ప్రస్తుతం ఫుడ్ స్టాళ్ల వల్ల రద్దీ సమయంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ మేరకు పశ్చిమ రైల్వేకు చాలాకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో తన పరిధిలోని స్టేషన్లలో ఉన్న ఫుడ్‌స్టాళ్లను తొలగించాలని పరిపాలనా విభాగం నిర్ణయించింది. అయితే వాటిబదులు గుర్తించిన ప్రాంతాల్లో కొత్త స్టాళ్లను నిర్మించాలని యోచిస్తోంది.

పాతస్టాళ్లను తొలగించడం ద్వారా ప్లాట్‌ఫాంలు మరింత విశాలంగా మారి ప్రయాణికులు ప్రశాంతంగా నడిచి వెళ్లేందుకు వీలుపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ స్టాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. కాగా,  మొదటి విడతగా 30 రైల్వేస్టేషన్లలోని పాత స్టాళ్లను తొలగించనున్నారు. దీనికోసం ఆయా స్టేషన్లలో ఉన్న పురాతన స్టాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. వీటిలో చాలా స్టాళ్లు ఏర్పాటుచేసిన గదులు 40 యేళ్ల కిందటే నిర్మించినవని గుర్తించామని ఒక అధికారి తెలిపారు.

వీటిని తొలగించి కొత్త భవనాలను నిర్మించేందుకు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. మున్ముందు స్టేషన్లలో ఆహార పదార్థాల నాణ్యతను కూడా పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్య స్టేషన్లలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జికి 20 మీటర్ల దగ్గర్లో గాని, లేదా  వాటి కిందగాని కొత్త స్టాళ్లను ఏర్పాటుచేయడానికి యోచిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.

కాగా, ప్రస్తుతం స్టేషన్లలో సమోసాలు, భేల్, వడాపావ్ వంటి తినుబండారాలను విక్రయిస్తున్నారు. అలాగే బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లను ఎమ్మార్పీ రేట్లతో విక్రయిస్తున్నారన్నారు. అలాగే  స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆర్వో ప్యూరిఫైర్లను కూడా స్టాళ్లలో ఏర్పాటుచేశారు. ఇవి కాకుండా ప్రయాణికులకు టైంపాస్ కోసం పుస్తకాలు, పేపర్లు అందుబాటులో ఉంటున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement