Suburban railway station
-
కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో..
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని నగరవాసులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు పచ్చజెండా లభించినా టెండర్ల ప్రక్రియ దశలోనే ఉంది. సుమారు రూ. 15,700 కోట్ల ఖర్చుతో అతి భారీ ప్రాజెక్టు అయిన సబర్బన్ రైల్వే యోజనకు ఆరంభంలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్ధీని తగ్గించడంతో పాటు నగర శివార్లను సులభంగా కలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. నాలుగు ప్రాంతాలకు అనుసంధానం.. ► సబర్బన్ రైల్వే ప్రాజెక్టు పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్లో చేపట్టారు. మొత్తం 148.17 కిలోమీటర్ల దూరంలో నాలుగు ప్రత్యేక కారిడార్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ► బెంగళూరు–దేవనహళ్లి (41.40 కి.మీ.), బైయ్యప్పనహళ్లి–చిక్కబాణవర (25.01 కి.మీ.), కెంగేరి–బెంగళూరు కంటోన్మెంట్ (35.52 కి.మీ.), హీలలిగే– రాజనుకుంటే (46.24 కి.మీ.) రూట్లతో నగరవాసుల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ► ఈ ప్రాజెక్టులో మొత్తం 62 స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 101.7 ఎకరాల భూమి అవసరం. ఈ భూమి స్వాధీనం కోసం రూ. 1,419 కోట్ల ఖర్చు అవుతుంది. కేటాయింపులు ఈ విధంగా.. ప్రాజెక్టు నిధులను 20 శాతం చొప్పున కేంద్ర రాష్ట్రాలు భరించి, మిగతా 60 శాతాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. కర్ణాటక ప్రభుత్వం రూ. 5,087 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3,242 కోట్లు ఇస్తాయి. రుణం ద్వారా రూ. 7,438 కోట్లను తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ దశలో ఉంది. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఆకర్షణీయ హామీగా మారిందే తప్ప సాకారం అయ్యేదెన్నడు అనే ప్రశ్న వినిపిస్తోంది. చదవండి: భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం! -
రైల్వే స్టేషన్లలో కొత్త ‘ఫుడ్’
సాక్షి, ముంబై: సబర్బన్ రైల్వే స్టేషన్లలో ఉన్న ఫుడ్ స్టాళ్లను కూల్చేయాలని పశ్చిమ రైల్వే యోచిస్తోంది. వీటిస్థానంలో కొత్త హంగులతో నూతన స్టాళ్లను ఏర్పాటుచేయాలని పథకం రూపొందిస్తోంది. అయితే ప్రస్తుతం ఫుడ్ స్టాళ్ల వల్ల రద్దీ సమయంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ మేరకు పశ్చిమ రైల్వేకు చాలాకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో తన పరిధిలోని స్టేషన్లలో ఉన్న ఫుడ్‌స్టాళ్లను తొలగించాలని పరిపాలనా విభాగం నిర్ణయించింది. అయితే వాటిబదులు గుర్తించిన ప్రాంతాల్లో కొత్త స్టాళ్లను నిర్మించాలని యోచిస్తోంది. పాతస్టాళ్లను తొలగించడం ద్వారా ప్లాట్‌ఫాంలు మరింత విశాలంగా మారి ప్రయాణికులు ప్రశాంతంగా నడిచి వెళ్లేందుకు వీలుపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ స్టాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. కాగా, మొదటి విడతగా 30 రైల్వేస్టేషన్లలోని పాత స్టాళ్లను తొలగించనున్నారు. దీనికోసం ఆయా స్టేషన్లలో ఉన్న పురాతన స్టాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. వీటిలో చాలా స్టాళ్లు ఏర్పాటుచేసిన గదులు 40 యేళ్ల కిందటే నిర్మించినవని గుర్తించామని ఒక అధికారి తెలిపారు. వీటిని తొలగించి కొత్త భవనాలను నిర్మించేందుకు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. మున్ముందు స్టేషన్లలో ఆహార పదార్థాల నాణ్యతను కూడా పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్య స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జికి 20 మీటర్ల దగ్గర్లో గాని, లేదా వాటి కిందగాని కొత్త స్టాళ్లను ఏర్పాటుచేయడానికి యోచిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం స్టేషన్లలో సమోసాలు, భేల్, వడాపావ్ వంటి తినుబండారాలను విక్రయిస్తున్నారు. అలాగే బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లను ఎమ్మార్పీ రేట్లతో విక్రయిస్తున్నారన్నారు. అలాగే స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆర్వో ప్యూరిఫైర్లను కూడా స్టాళ్లలో ఏర్పాటుచేశారు. ఇవి కాకుండా ప్రయాణికులకు టైంపాస్ కోసం పుస్తకాలు, పేపర్లు అందుబాటులో ఉంటున్నాయని వివరించారు.