దాదర్, న్యూస్‌లైన్: కొత్తగా కొనుగోలు చేసిన హైస్పీడ్ రైళ్లపై తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ప్రయాణికులను.... పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) కోరింది. వీటిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాత వాటినన్నింటినీ పరిశీలించి ఇకపై కొనుగోలు చేయనున్న రైళ్లను వారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్ తెలిపారు. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేసిన రెండు హైస్పీడ్ రైళ్లను డబ్ల్యూఆర్ ఇటీవల కొనుగోలు చేసింది. 12 బోగీలు కలిగిన ఈ రెండు రైళ్లను నవంబర్‌లో స్వాధీనం చేసుకుంది.
ఒక్కో రైలు కొనుగోలు కోసం రూ.30 కోట్లను వెచ్చించినట్లు ప్రస్తుతం వీటిని స్థానిక రైలు యార్డులో ఉంచామన్నారు. రాత్రి వేళల్లో వీటిని ప్రయోగాత్మకంగా నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెస్టర్న్ రైల్వే పరిధిలో రాకపోకలు సాగిస్తున్న 75 లక్షల మంది ప్రయాణికులకు రద్దీ నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందన్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) రెండో దశలో భాగంగా 72 హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఈ రైళ్లలోని సీట్లు, హ్యాండిళ్లు తలుపులు, కిటికీలను ఎంతో అందంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దారు.
హైస్పీడ్ రైళ్లపై ప్రజాభిప్రాయం కోరిన పశ్చిమరైల్వే
Published Sat, Nov 30 2013 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement