high-speed trains
-
త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రయిన్ కన్న త్వరగా దేశంలో హైస్పీడ్ రైలు పరుగులు తీయనుంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ట్రయిన్ 18, ట్రయిన్ 20 అనే హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ హైస్పీడ్ రైళ్ల కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు సజావుగా సాగితే.. ఈ ఏడాదే భారతీయులకు హైస్పీడ్ ట్రయిన్ ప్రయాణం అనుభవంలోకి రానుంది. రాజధాని, శతాబ్ధిల స్థానంలో..! దేశవ్యాప్త ప్రయాణికుల మది దోచుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ స్థానంలో ‘ట్రయిన్ 20’, శతాబ్ది స్థానంలో ‘ట్రయిన్ 18’ త్వరలో రాబోతున్నాయని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుధామణి చెప్పారు. ‘ట్రయిన్ 18’ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టంబర్లో శతాబ్ది స్థానంలో ప్రయాణం మొదలు పెడుతుందని అన్నారు. ట్రయిన్ 20 మాత్రం పట్టాలెక్కడానికి 2020 దాకా సమయం పడుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ‘ట్రయిన్-18, ‘ట్రయిన్ 20’ల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ ఇంజినీర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రయాణికుల కోస ఎల్ఈడీ స్క్రీన్లు, జీపీఎస్ సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లకు ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌తో పాటు బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా ‘ట్రయిన్-18, ‘ట్రయిన్ -20’ హైస్పీడ్ రైళ్లను మేకిన్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. ట్రయిన్ 18కు రూ. 2.50 కోట్లు ఖర్చుకాగా, ట్రయిన్ 20 నిర్మాణానికి రూ.5.50 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. -
‘సబర్బన్’ పనులకు కేంద్రం ఆమోదం
► బెంగళూరు-మైసూరు మధ్య రైల్వే పనులు ► కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడి ► వివిధ అభివృద్ధి పనుకుల శంకుస్థాపన ► తీరిన కన్నడిగుల కల ► సిటీ రైల్వే స్టేషన్‌కు క్రాంతివీర సంగూళి రాయణ్ణ పేరు బెంగళూరు (బనశంకరి) : బెంగళూరు-మైసూరు ఉపనగర మధ్య సబర్బన్ రైల్వే పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేసిందని కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. నగరంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలహంక- పెనుకొండ, అరిసికెరె-తుమకూరు, హుబ్లీ- చిక్కజాజూరు డబ్లింగ్ పనులు, కొప్పళ రైల్వేస్టేషన్ రోడ్డు ప్లైఓవర్ పనులకు ఆయన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులతో శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ పేరును లాంఛనంగా ‘క్రాంతివీర సంగొళ్లిరాయణ్ణ స్టేషన్’గా మార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రాంతివీర సంగూళ్లి రాయణ్ణ పేరును నగర రైల్వే స్టేషన్‌కు పెట్టాలన్న కన్నడిగుల కోరిక నెరవేరిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో ముందుంజలో ఉంటుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందన్నారు. సబర్బన్ రైల్వేతో పాటు మెట్రోరైల్వే సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య దాదాపుగా తగ్గిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేశ్‌ప్రభు మాట్లాడుతూ... బెంగళూరు-మైసూరు, బెంగళూరు-హుబ్లీ మధ్య సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రారంభించే ఆలోచన ఉందని వెల్లడించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బెంగళూరు నుంచి హుబ్లీ, మైసూరు మధ్య సెమీ హై స్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటుచేయడం వల్ల ఆయా ప్రాంతాల నుంచి ప్రతి రోజు బెంగళూరుకు వచ్చే ప్రజలకు ఉపయుక్తంగా ఉండటమే కాకుండా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యను కూడా తీరుతుందన్నారు. కేంద్ర ఎరువులు రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... బెంగళూరు- హుబ్లీ రైల్వే డబ్లింగ్ పనులను మూడేళ్లలోగా పూర్తి చేస్తే రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. పనులు పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణం 7 గంటల నుంచి నాలుగన్నర గంటకు తగ్గుతుందన్నారు. -
స్పీడ్ పెరగాలి
నగరం నుంచి వేగంగా నడిచే రైళ్లు అవసరం విశాఖ, హైదరాబాద్, చెన్నై, తిరుపతిలకు నాన్‌స్టాప్‌లు కావాలి స్పీడ్ రైళ్లకు ఫుల్ డిమాండ్ డబ్బు కన్నా టైమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్న ప్రయాణికులు విమానాలు, బస్సుల వైపు మొగ్గు చూపుతున్న జనం విజయవాడ : రాష్ట్ర విభజన తర్వాత నగరానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలో నగరానికి రాకపోకలు సాగించే ప్రముఖుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరం నుంచి ఢిల్లీకి, ఇతర ముఖ్య పట్టణాలకు వేగవంతమైన రైళ్లు నడపాల్సిన అవసరం ఏర్పడింది. చార్జీలు భారమైనప్పటికీ వేగంగా వెళ్లే రైళ్లకే ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. చార్జీల గురించి పట్టించుకోకుండా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇప్పటివరకు కొత్త రైళ్లు కోరుకున్న రైల్వే డివిజనల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వేగవంతమైన రైళ్లు సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దురంతో వంటి రైళ్లు అవసరం ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు దురంతో ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు విశాఖపట్నంలో ప్రారంభమైతే విజయవాడలో ఆగుతుంది. ఇక్కడ సిబ్బంది మాత్రమే మారతారు. ప్రయాణికులు ఎక్కే అవకాశం లేదు. విజయవాడలో బయలుదేరితే హైదరాబాద్‌లోనే ఆగుతుంది. దీంతో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రైలు టికెట్లకు తీవ్ర డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి రైళ్లను విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం నగరం ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఆరు గంటల సమయం పడుతోంది. నాలుగు గంటల్లో హైదరాబాద్, చెన్నై, తిరుపతిలకు వెళ్లే విధంగా విజయవాడ నుంచి నాన్‌స్టాప్ రైళ్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైళ్లు గంటకు 50 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో నడుస్తున్నాయని, దీనిని 110 కిలోమీటర్లకు పెంచితే నగరం నుంచి చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలకు ప్రయాణికులను నాలుగు గంటల్లో తీసుకెళ్ల వచ్చని చెబుతున్నారు. ప్రయాణ సమయం తగ్గిన కొద్దీ ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుందని ఓ అధికారి తెలిపారు. గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కొన్ని బస్సులు కూడా హైదరాబాద్‌కు 4.30 గంటల్లోనే చేరుతున్నాయని, రైళ్లు మాత్రం ఆరు గంటలకు వెళ్తున్నాయని, దీని వల్ల ఎక్కువ మంది బస్సులకే వెళ్తున్నారని పేర్కొన్నారు. విమానాలకూ పెరిగిన ప్రయాణికులు.. ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగింది. దశాబ్దన్నర క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం నడిపేందుకు ప్రయాణికులు ఉండరని భయపడేవారు. ప్రస్తుతం రోజూ ఢిల్లీకి రెండు, బెంగళూరుకు రెండు, హైదరాబాద్‌కు మూడు సర్వీసులు, విశాఖపట్నం, తిరుపతిలకు ఒక్కో విమాన సర్వీసులను నడుపుతున్నారు. ఢిల్లీకి రెండు గంటలు, బెంగళూరుకు 70 నిమిషాలు, హైదరాబాద్‌కు 55 నిమిషాల్లో ప్రయాణికులు చేరుతున్నారు. దీంతో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సర్వీసులకు 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. రైలు కన్నా చార్జీ ఎక్కువ అయినప్పటికీ సమయం కలిసి వస్తోందని రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతోపాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా విమానాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో స్పీడ్ రైళ్లు వస్తే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. రానున్న రైల్వే బడ్జెట్లో ఎన్ని రైళ్లు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే. -
రైల్వే జోన్‌గా మంగళూరు
రైల్వే మంత్రి సదానందగౌడ సాంకేతికతతో భద్రత చార్జీల పెంపుతోనే అభివృద్ధి జులైలో మధ్యంతర రైల్వే బడ్జెట్ త్వరలో బుల్లెట్, హై స్పీడ్ రైళ్లు సాక్షి, బెంగళూరు : మంగళూరును రైల్వే జోన్‌గా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. దీని వల్ల కర్ణాటకలోని తీరప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా సొంత జిల్లా అయిన మంగళూరుకు శనివారం ఆయన విచ్చేశారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ... రోజురోజుకు రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందన్నారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా నూతన రైలు మార్గాల నిర్మాణం, ప్రయాణికులకు సౌకర్యాల పెంపు, రైల్వే శాఖలో వివిధ విభాగాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి చాలా నిధులు అవసరమన్నారు. అందువల్ల రైల్వే శాఖలో అభివృద్ధి జరగాలంటే టికెట్టు చార్జీలను సమయానికి తగ్గట్టు పెంచక తప్పదన్నారు. అయితే ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాతే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, జులైలో మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నామని సదానంద తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ప్రజలకు బుల్లెట్, హై స్పీడ్ రైళ్లను అందుబాటలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. -
రైల్వేలో ఎఫ్‌డీఐ కూత...!
న్యూఢిల్లీ: ఒక్కొక్కటిగా కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు తలుపులు తెరుస్తున్న కేంద్రం మరింత దూకుడు పెంచుతోంది. త్వరలోనే రైల్వేలో కూడా ఎఫ్‌డీఐల కూత పెట్టించనుంది. హైస్పీడ్ రైళ్లు, రైల్వే లైన్ల అభివృద్ధి వంటి ఇతరత్రా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చకచకా పావులు కదుపుతోంది. ప్రతిపాదిత నోట్‌ను వాణిజ్య, పరిశ్రమల శాఖ కేబినెట్‌కు ఇప్పటికే పంపిందని, ఈ నెలలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. నిధుల కొరతను ఎదుర్కొంటున్న రైల్వేలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించాలనేది పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) ప్రతిపాదన. అయితే, రైళ్ల నిర్వహణ, భద్రత వంటి విషయాల్లో మాత్రం ఎఫ్‌డీఐలను అనుమతించరాదని డీఐపీపీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. మెట్రోలు ఇతరత్రా మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్లో తప్ప ప్రస్తుతం రైల్వే రంగంలో విదేశీ పెట్టుబడులపై పూర్తిగా నిషేధం ఉంది. ప్రతిపాదనల్లో ఇతర ముఖ్యాంశాలివీ... పట్టణ ప్రాంత రైల్వే కారిడార్లు, హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో చేపట్టే ప్రత్యేక సరుకు రవాణా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అదేవిధంగా రైల్వే లైన్లు, రైల్వే సైడింగ్స్‌ను కూడా చేర్చే విధంగా ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్’ నిర్వచనాన్ని విస్తృతపరచాలని కూడా డీఐపీపీ సూచించింది. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రత్యేక కంపెనీ(స్పెషల్ పర్పస్ వెహికల్-ఎస్పీవీ)ల్లో విదేశీ కంపెనీలు 100 శాతం వాటాను దక్కించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌తో పోర్టులు, గనులు, పారిశ్రామిక కేంద్రాల(హబ్)లను కలిపేందుకు వీలుగా నిర్మించే రైల్వే లైన్లు ప్రధానంగా ఈ ప్రాజెక్టుల్లోకి వస్తాయి. బొగ్గు ఇతరత్రా గనుల నుంచి పోర్టులకు ముడి ఖనిజాల రవాణా సజావుగా సాగేందుకు ఈ పూర్తిస్థాయి(ఫస్ట్-టు-లాస్ట్ మైల్) రైల్వే లైన్ల అనుసంధానం దోహదం చేయనుంది. అందుబాటులోకి అత్యాధునిక పరిజ్ఞానం... పారిశ్రామిక అవసరాల కోసం మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతోపాటు రైల్వే లైన్ల అభివృద్ధిలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చేందుకు ఈ ఎఫ్‌డీఐలు దోహదం చేయనున్నాయి. దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుంది కూడా. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఉత్పాదక వ్యయం ఎగబాకేందుకు కారణమవుతోంది. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహంలో సరైన రవాణా సదుపాయాలు చాలా కీలకం. దీనికి రైల్వేలే ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల వాదన. పోర్టులు, భారీస్థాయి గనులకు సమర్ధవంతమైన రైల్వే కనెక్టివిటీ చాలా ముఖ్యం కూడా. రైల్వేలో ఎఫ్‌డీఐలకు అనుమతించే ప్రతిపాదనను విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. అయితే, పీపీపీ ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలనేది వారి అభిప్రాయం. -
హైస్పీడ్ రైళ్లపై ప్రజాభిప్రాయం కోరిన పశ్చిమరైల్వే
దాదర్, న్యూస్‌లైన్: కొత్తగా కొనుగోలు చేసిన హైస్పీడ్ రైళ్లపై తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ప్రయాణికులను.... పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) కోరింది. వీటిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాత వాటినన్నింటినీ పరిశీలించి ఇకపై కొనుగోలు చేయనున్న రైళ్లను వారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్ తెలిపారు. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేసిన రెండు హైస్పీడ్ రైళ్లను డబ్ల్యూఆర్ ఇటీవల కొనుగోలు చేసింది. 12 బోగీలు కలిగిన ఈ రెండు రైళ్లను నవంబర్‌లో స్వాధీనం చేసుకుంది. ఒక్కో రైలు కొనుగోలు కోసం రూ.30 కోట్లను వెచ్చించినట్లు ప్రస్తుతం వీటిని స్థానిక రైలు యార్డులో ఉంచామన్నారు. రాత్రి వేళల్లో వీటిని ప్రయోగాత్మకంగా నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెస్టర్న్ రైల్వే పరిధిలో రాకపోకలు సాగిస్తున్న 75 లక్షల మంది ప్రయాణికులకు రద్దీ నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందన్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) రెండో దశలో భాగంగా 72 హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఈ రైళ్లలోని సీట్లు, హ్యాండిళ్లు తలుపులు, కిటికీలను ఎంతో అందంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దారు.