రైల్వేలో ఎఫ్‌డీఐ కూత...!
న్యూఢిల్లీ: ఒక్కొక్కటిగా కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు తలుపులు తెరుస్తున్న కేంద్రం మరింత దూకుడు పెంచుతోంది. త్వరలోనే రైల్వేలో కూడా ఎఫ్‌డీఐల కూత పెట్టించనుంది. హైస్పీడ్ రైళ్లు, రైల్వే లైన్ల అభివృద్ధి వంటి ఇతరత్రా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చకచకా పావులు కదుపుతోంది. ప్రతిపాదిత నోట్‌ను వాణిజ్య, పరిశ్రమల శాఖ కేబినెట్‌కు ఇప్పటికే పంపిందని, ఈ నెలలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. నిధుల కొరతను ఎదుర్కొంటున్న రైల్వేలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించాలనేది పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) ప్రతిపాదన. అయితే, రైళ్ల నిర్వహణ, భద్రత వంటి విషయాల్లో మాత్రం ఎఫ్‌డీఐలను అనుమతించరాదని డీఐపీపీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. మెట్రోలు ఇతరత్రా మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల్లో తప్ప ప్రస్తుతం రైల్వే రంగంలో విదేశీ పెట్టుబడులపై పూర్తిగా నిషేధం ఉంది.
ప్రతిపాదనల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
పట్టణ ప్రాంత రైల్వే కారిడార్లు, హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలో చేపట్టే ప్రత్యేక సరుకు రవాణా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అదేవిధంగా రైల్వే లైన్లు, రైల్వే సైడింగ్స్‌ను కూడా చేర్చే విధంగా ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ నిర్వచనాన్ని విస్తృతపరచాలని కూడా డీఐపీపీ సూచించింది. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రత్యేక కంపెనీ(స్పెషల్ పర్పస్ వెహికల్-ఎస్‌పీవీ)ల్లో విదేశీ కంపెనీలు 100 శాతం వాటాను దక్కించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌తో పోర్టులు, గనులు, పారిశ్రామిక కేంద్రాల(హబ్)లను కలిపేందుకు వీలుగా నిర్మించే రైల్వే లైన్‌లు ప్రధానంగా ఈ ప్రాజెక్టుల్లోకి వస్తాయి. బొగ్గు ఇతరత్రా గనుల నుంచి పోర్టులకు ముడి ఖనిజాల రవాణా సజావుగా సాగేందుకు ఈ పూర్తిస్థాయి(ఫస్ట్-టు-లాస్ట్ మైల్) రైల్వే లైన్ల అనుసంధానం దోహదం చేయనుంది.
అందుబాటులోకి అత్యాధునిక పరిజ్ఞానం...
పారిశ్రామిక అవసరాల కోసం మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతోపాటు రైల్వే లైన్ల అభివృద్ధిలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చేందుకు ఈ ఎఫ్‌డీఐలు దోహదం చేయనున్నాయి. దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుంది కూడా. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఉత్పాదక వ్యయం ఎగబాకేందుకు కారణమవుతోంది.
పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహంలో సరైన రవాణా సదుపాయాలు చాలా కీలకం. దీనికి రైల్వేలే ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల వాదన. పోర్టులు, భారీస్థాయి గనులకు సమర్ధవంతమైన రైల్వే కనెక్టివిటీ చాలా ముఖ్యం కూడా. రైల్వేలో ఎఫ్‌డీఐలకు అనుమతించే ప్రతిపాదనను విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. అయితే, పీపీపీ ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలనేది వారి అభిప్రాయం.