2030 నాటికి సాధ్యమన్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరినాటికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పరిశ్రమ దేశంలో ఎనిమిది రెట్లు దూసుకెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్ద కాలంలో ఈవీల విక్రయాలు 640 రెట్లు పెరిగాయని అన్నారు. 10 ఏళ్ల క్రితం ఏటా 2,600 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయని, గత ఏడాది ఈ సంఖ్య 16.8 లక్షల యూనిట్లు దాటిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో–2025ను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఏడాదికి 2.5 కోట్ల వాహనాల అపూర్వ అమ్మకాలను చూసిందని, కేవలం నాలుగు సంవత్సరాలలో ఈ పరిశ్రమ 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. పర్యావరణ అనుకూల సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారిస్తోందని మోదీ అన్నారు.
మేక్ ఇన్ ఇండియా చొరవతో..
మొబిలిటీ రంగంలో భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి అత్యుత్తమ గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా చొరవ దేశ ఆటో పరిశ్రమ వృద్ధి అవకాశాలకు ఆజ్యం పోస్తోందని, ఈ రంగం అభివృద్ధిలో భారీ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి తోడ్పడే మొబిలిటీ వ్యవస్థ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారతీయ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడంలో రతన్ టాటా, ఒసాము సుజుకీ సహకారం ఎంతో
ఉందని మోదీ అన్నారు.
టాటా.. 32 కొత్త వాహనాలు
టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో వేదికగా ప్యాసింజర్, కమర్షి యల్ విభాగంలో 32 కొత్త వాహనాలతోపాటు వివిధ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. టాటా సియర్రా ఎస్‌యూవీ, హ్యారియర్ ఈవీతోపాటు అవిన్యా కాన్సెప్ట్ ఈవీ సైతం కొలువుదీరింది. అవిన్యా శ్రేణిలో తొలి మోడల్ 2026లో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.
సుజుకీ ఈ–యాక్సెస్ 95 కిలోమీటర్లు
సుజుకీ తాజాగా భారత్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లో యాక్సెస్ ఎలక్ట్రిక్ వర్షన్‌ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ–యాక్సెస్ ప్రత్యేకత. 3.07 కిలోవాట్ అవర్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 71 కిలోమీటర్లు. చార్జింగ్ పూర్తి కావడానికి 240 వాట్ పోర్టబుల్ చార్జర్‌తో 6 గంటల 42 నిముషాలు, ఫాస్ట్ చార్జర్‌తో 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. పండుగ సీజన్ మార్కెట్లోకి రానుంది. కాగా, యాక్సెస్ 125 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌తోపాటు జిక్సర్ ఎస్‌ఎఫ్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.
ఇక జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ వాహనాలు
విభిన్న రంగాల్లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంత బ్రాండ్‌లో కార్స్, ట్రక్స్, బస్‌ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు చేయనున్నట్టు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. సాంకేతిక భాగస్వామ్యం కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు జిందాల్ చెప్పారు. జేఎస్‌డబ్ల్యూ బ్రాండ్ తొలి వాహనం 2027–2028లో రోడ్లపైకి వస్తుందన్నారు.
మారుతీ ఈ–విటారా రేంజ్ 500 కి.మీ
మారుతీ సుజుకీ ఇండియా నుంచి ఎట్టకేలకు తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ–విటారా కొలువుదీరింది. 49, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా పరుగుతీయనుందని కంపెనీ వెల్లడించింది. ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్స్, లెవెల్–2 అడాస్, ఏడు ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. 300 ఎన్‌ఎం టార్క్ అందించే ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ సైతం ఉంది. ప్రపంచ మార్కెట్‌కు ఈ–విటారా కార్లను మారుతీ సుజుకీ వచ్చే 10 ఏళ్లపాటు ప్రత్యేకంగా సరఫరా చేయనుండడం విశేషం. ఈ–విటారా తయారీ, ప్రత్యేకంగా ఈవీ ప్రొడక్షన్ లైన్ కోసం రూ.2,100 కోట్లకుపైగా పెట్టుబడి చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాటీ టాకేయూచీ వెల్లడించారు. కాగా, ‘ఈ ఫర్ మీ’ పేరుతో పూర్థిస్థాయిలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు మారుతీ శ్రీకారం చుట్టింది. టాప్–100 నగరాల్లోని డీలర్‌షిప్స్ వద్ద ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెస్తారు. ప్రతి 5–10 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. అలాగే 1,000కిపైగా నగరాల్లో ఈవీల కోసం ప్రత్యేకంగా 1,500ల పైచిలుకు సరీ్వస్ సెంటర్లను నెలకొల్పుతారు.
కొత్తగా 1.5 లక్షల మందికి..
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం వెన్నుదన్నుగా నిలిచిందని, తద్వారా పరిశ్రమకు అదనంగా రూ.2.25 లక్షల కోట్ల అమ్మకాలు తోడయ్యాయని నరేంద్ర మోదీ అన్నారు. వాహన రంగంలో కొత్తగా 1.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ఈ పథకం తెచి్చపెట్టిందని వెల్లడించారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై దేశ వ్యయాలను తగ్గించే వ్యవస్థను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణ సౌలభ్యం భారత్‌కు అతిపెద్ద ప్రాధాన్యతగా ఉందని, గత బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. భారత ఆటోమొబైల్ రంగం గత ఏడాది 12% వృద్ధి చెందిందని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో జనవరి 22 వరకు కొనసాగనుంది. ఆటోమొబైల్, విడిభాగాలు, సాంకేతికతల్లో 100కుపైగా నూతన ఆవిష్కరణలకు ఎక్స్‌పో వేదిక కానుంది.
Comments
Please login to add a commentAdd a comment