సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రయిన్ కన్న త్వరగా దేశంలో హైస్పీడ్ రైలు పరుగులు తీయనుంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ట్రయిన్ 18, ట్రయిన్ 20 అనే హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ హైస్పీడ్ రైళ్ల కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు సజావుగా సాగితే.. ఈ ఏడాదే భారతీయులకు హైస్పీడ్ ట్రయిన్ ప్రయాణం అనుభవంలోకి రానుంది.
రాజధాని, శతాబ్ధిల స్థానంలో..!
దేశవ్యాప్త ప్రయాణికుల మది దోచుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ స్థానంలో ‘ట్రయిన్ 20’, శతాబ్ది స్థానంలో ‘ట్రయిన్ 18’ త్వరలో రాబోతున్నాయని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుధామణి చెప్పారు. ‘ట్రయిన్ 18’ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టంబర్‌లో శతాబ్ది స్థానంలో ప్రయాణం మొదలు పెడుతుందని అన్నారు. ట్రయిన్ 20 మాత్రం పట్టాలెక్కడానికి 2020 దాకా సమయం పడుతుందని అన్నారు.
ప్రపంచ స్థాయి సౌకర్యాలు
‘ట్రయిన్-18, ‘ట్రయిన్ 20’ల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ ఇంజినీర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రయాణికుల కోస ఎల్‌ఈడీ స్క్రీన్లు, జీపీఎస్ సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లకు ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌తో పాటు బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
మేకిన్ ఇండియాలో భాగంగా
‘ట్రయిన్-18, ‘ట్రయిన్ -20’ హైస్పీడ్ రైళ్లను మేకిన్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. ట్రయిన్ 18కు రూ. 2.50 కోట్లు ఖర్చుకాగా, ట్రయిన్ 20 నిర్మాణానికి రూ.5.50 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment