రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పషీ్టకరణ
మూడు నూతన వందేభారత్ రైళ్లు ప్రారంభం
న్యూఢిల్లీ: సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టంచేశారు.
మూడు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్‌కోయిల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇండియన్ రైల్వే ఒక గ్యారంటీగా మారాలన్నదే తమ ధ్యేయమని, అది నేరవేరేదాకా తమ కృషి ఆగదని స్పష్టంచేశారు. భారత రైల్వే శాఖ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం తమ ప్రభుత్వ అంకితభావానికి ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దార్శనికతకు ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఒక బలమైన మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు గుర్తుచేశారు. మన రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నామని, హై–టెక్ సేవలతో అనుసంధానిస్తున్నామని వివరించారు.
దక్షిణాది అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం
‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన ఆశయ సాధనకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన ప్రగతి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాదిన నిపుణులకు, వనరులకు, అవకాశాలకు కొదవ లేదని చెప్పారు. సౌత్ ఇండియా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో రైళ్ల సంఖ్యను పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రెట్లు పెంచామని వివరించారు. రైల్వే ట్రాకులు మెరుగుపరుస్తున్నామని, విద్యుదీకరణ వేగం పుంజుకుందని, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, ప్రయాణికులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment