
ఏప్రిల్ 19న కట్రా– శ్రీనగర్ రైలు సేవలు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రఖ్యాత చినాబ్ నది వంతెనను సందర్శించనున్న మోదీ
శ్రీనగర్: పర్వతమయ కశ్మీర్ లోయలో వచ్చే నెలలో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 19వ తేదీన కట్రా–శ్రీనగర్ రైలు సేవలను ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. నూతన రైలు సర్వీస్ ప్రారంభోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు కొత్త మార్గంలో వందేభారత్ రైలును నడపాలని అధికారులు నిర్ణయించారు.
నూతన సర్వీస్‌ను ప్రధాని మోదీ స్వయంగా వచ్చి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతకుముందు చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెనను మోదీ పరిశీలించనున్నారు. తర్వాత కట్రాలో రైలు సేవలను ప్రారంభించి అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, స్థానిక బీజేపీ నేతలు తదితరులు పాల్గొంటారు. రైలును కొంతకాలం కట్రా, శ్రీనగర్/బారాముల్లా స్టేషన్ల మధ్య నడుపుతారు. జమ్మూ రైల్వేస్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక ఆగస్ట్ నెల నుంచి జమ్మూ దాకా ఈ రైలు సేవలను విస్తరిస్తారు.
అప్పటి నుంచి రైలు సేవలు జమ్మూ–శ్రీనగర్/ బారాముల్లా మార్గంలో కొనసాగనున్నాయి. ఇంతవరకు ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు నేరుగా ఒక్క రైలు సర్వీస్ కూడా లేదు. దశాబ్దాలుగా కశ్మీర్ లోయ ప్రాంతం భారత్‌తో రైలు మార్గాన అనుసంధానమై లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు గరిష్టంగా సంగల్దాన్–బారాముల్లా సెక్షన్ దాకా మాత్రమే రాగలవు. సుదూర సర్వీస్ రైళ్లు అయితే కట్రా వరకే రాగలవు. తాజా విస్తరణతో కశ్మీర్ లోయ ప్రాంతవాసులు కూడా తొలిసారిగా రైలు సేవలను అందుకోనున్నారు.