సుస్థిరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడంలో ఇదో ముందడుగు
దేశం 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణకు చేరువవుతోంది
తెలంగాణ, జమ్మూకశ్మీర్, ఒడిశాల్లో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్‌ను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో గణనీయ అభివృద్ధి సాకారం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. చర్లపల్లి స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌరశక్తితో నడిచే కార్యకలాపాలతో సహా సుస్థిరమైన మౌలిక ఆధునిక సౌకర్యాలను సృష్టించడంలో ఇది ఒక ముందడుగు అని అన్నారు.
ఈ కొత్త టెర్మినల్ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలలోని ప్రస్తుత స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్‌లు ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారాన్ని సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ ఉద్ఘాటించారు. సమష్టిగా ఈ వృద్ధిని మరింతగా వేగవంతం చేసేందుకు తాను నిశ్చయించుకున్నానని ప్రధాని అన్నారు.
చర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్‌తో పాటు జమ్మూ రైల్వే డివిజన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభంతో పర్యాటకం మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది’’ అని అన్నారు.
త్వరలోనే తొలి బుల్లెట్ రైలు
‘‘ఇవాళ ప్రజలు ఎక్కువదూరాలను తక్కువ సమయంలో పూర్తిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే మేం పనిచేస్తున్నాం. వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూశాక నాకెంతో సంతోషం కలిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు.
రాబోయే రోజుల్లో రైల్వేల ప్రయాణం ఓ గుర్తుండిపోయే మధురస్మృతిగా నిలిచిపోయేలా చేస్తాం. దేశంలో 2014లో 74 ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 150కి పైగా పెంచాం. 5 నగరాల నుంచి 21 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాం. దేశం కలిసికట్టుగా, అంచెలంచెలుగా ముందుకు సాగుతోందనడానికి ఇలాంటి కార్యక్రమం ఒక నిదర్శనం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment