సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, యాదాద్రి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న రాష్ట్రంలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాల వివరాలను పీఎంవో బుధవారం వెల్లడించింది. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనున్న మోదీ.. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో పలు అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంవో పేర్కొంది. మొత్తం రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు వివరించింది.
ఐటీ సిటీ టూ టెంపుల్ సిటీ
సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఐటి సిటీ హైదరాబాద్‌ను, శ్రీ వేంకటేశ్వర స్వామి నివాసమైన తిరుపతిని కలుపుతుందని పీఎంవో తెలిపింది. ఇది మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభం అవుతున్న రెండో వందే భారత్ రైలు అని తెలిపింది. ఇలావుండగా రూ.720 కోట్లతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సుందరీకరణతో రూపొందించనున్న సికింద్రాబాద్ ఐకానిక్ రైల్వేస్టేషన్ భవనానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
కొత్తగా 13 ఎంఎంటీఎస్ సేవలు!
హైదరాబాద్ – సికింద్రాబాద్ సబర్బన్ విభాగంలో 13 కొత్త మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సరీ్వస్ సేవలకు ప్రధానమంత్రి ఫ్లాగ్–ఆఫ్ చేస్తారు. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుదీకరణ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి దృష్టికి నిదర్శనమని పీఎంఓ తెలిపింది.
రూ.1,365.95 కోట్ల వ్యయంతో పనులు
బీబీనగర్ ఎయిమ్స్‌కు ఉన్న 201.65 ఎకరాల స్థలంలో రూ.1,365.95 కోట్ల వ్యయంతో 750 పడకల ఆస్పత్రి, 20 భవన సముదాయాలు నిర్మించడంతో పాటు ఇతర వసతులు కల్పించనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా విలేకరులకు తెలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రజలకు సైతం వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.
ఎయిమ్స్‌లో 15 రకాల వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందజేస్తామన్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ వెయ్యి మంది వరకు ఓపీడీ సేవలు అందజేస్తున్నామని, 13 సాధారణ బెడ్‌లు, 20 ఐసీయూ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 1,200 శస్త్రచికిత్సలు చేశామని వెల్లడించారు. అత్యాధునిక వైద్యంతో పాటు డయాలసిస్, రేడియోథెరపీ సేవలు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment