శ్రీనగర్, కాత్రాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
శ్రీనగర్/కాత్రా: జమ్మూకశ్మీర్ యువత ఇక నిస్సహాయులు కాదని, వారితో సాధికారత మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజాస్వామ్యంపై యువతలో విశ్వాసం పెరిగిందని, ఓటుతో మార్పు వస్తుందని వారంతా నమ్ముతున్నారని తెలిపారు. గురువారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో, రియాసీ జిల్లా కాత్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని పునరుద్ఘాటించారు. తమ పరిపాలనలో ఇక్కడి యువతరం ప్రగతి పథంలో ముందడుగు వేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీర్ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అవన్నీ నెరవేరుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలపై మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మూడు కుటుంబ పార్టీలు సొంత లాభం కోసం ప్రజాస్వామ్యాన్ని, కాశ్మీరియత్‌ను అణచివేశాయని మండిపడ్డారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించకుండా దగా చేశా యని ఆరోపించారు. ఓటు వేసినా, వేయకున్నా ఆ మూ డు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తాయన్న ఆలోచన యువతలో ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
ప్రజాస్వామ్య పండుగ
‘‘జమ్మూకశ్మీర్‌లో గత ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో సాయంత్రం 6 గంటలకే ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి వచ్చేది. ఇంటింటి ప్రచారం అసాధ్యమే. ఇప్పుడు అర్ధరాత్రి దాకా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేవు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. ఓటు ప్రజాస్వామిక హక్కు, ఆ హక్కుతో చుట్టూ ఉన్న సమాజంలో కోరుకున్న మార్పును సాధించుకోవచ్చన్న భరోసా యువతలో ఏర్పడింది. సాధికారత దిశగా ఇదొక గొప్ప ముందడుగు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం.
కుటుంబంలో ఒక మహిళకు ఏటా రూ. 18 వేల చొప్పున ఇస్తాం. ఆరోగ్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతాం. జమ్మూకశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందాన్నలదే మా ఆశయం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు జమ్మూకశ్మీర్ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. నూతన జమ్మూకశ్మీర్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లే ఎన్నికలివి. అందుకే తెలివిగా ఓటు వేయాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షకు చరమగీతం పాడుతాం. ఇప్పుడు మన నినాదం అబ్‌కీ బార్.. బీజేపీ సర్కార్’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment