ట్రయల్ రన్ విజయవంతం
ఈ ఎక్స్‌ప్రెస్‌కు అనేక ప్రత్యేకతలు
త్వరలోనే ప్రధాని మోదీ పచ్చ జెండా
శ్రీనగర్: కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్‌లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది.
ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్‌లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు.
కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్‌లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్‌బీఆర్‌ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్‌లో పూర్తి చేసింది.
వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు
కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు.
వాక్యూమ్ సిస్టమ్‌కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్‌పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది.
అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు.
యూఎస్‌బీఆర్‌ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్‌పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ.
Comments
Please login to add a commentAdd a comment