అందుకోసం అనుక్షణం తాపత్రయ పడతారు
విద్వేషంతో నిండిన వాళ్లు ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టరు
రాహుల్‌పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు
అహ్మదాబాద్: పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. విద్వేషాన్ని నింపుకున్న వాళ్లు దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టరని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రూ.8,000 కోట్ల పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
తర్వాత దేశంలోనే తొలి వందేభారత్ మెట్రో సర్వీస్ అయిన భుజ్–అహ్మదాబాద్ ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రారంభించారు. దీంతోపాటు ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాహుల్, కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కొందరు ప్రతికూలత, విద్వేషంతో భారత్‌ను విడగొట్టేందుకు దేశ ఐక్యత, సమత్రలను లక్ష్యంగా చేసుకుంటారు.
ఇండియా, గుజరాత్‌ల పరువు తీసేందుకు దొరికే ఏ ఒక్క అవకాశాన్నీ వీళ్లు చేజార్చుకోరు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక తొలి 100 రోజుల్లో పాలనపై విపక్షాలు దారుణంగా విమర్శించాయి. నేను మాత్రం అభివృద్ధి అజెండా అమలుపైనే దృష్టిపెట్టా. నేను జీవిస్తే మీ కోసమే జీవితాన్ని ధారపోస్తా. పోరాడితే మీ కోసమే పోరాడతా. చనిపోవాల్సి వస్తే మీ కోసమే ప్రాణాలప్పిస్తా’’ అని వేలాది మంది సభకులనుద్దేశించి అన్నారు.
తొలి భారత్ మెట్రో పేరు మార్పు
మెట్రో నగరాల మధ్య తిరిగే దేశంలో తొలి మెట్రో ‘వందే మెట్రో’ పేరును ప్రారంభోత్సవానికి కొద్దిసేపటి ముందు కేంద్రం ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా మార్చింది. సోమవారం సాయంత్రం ఈ రైలును మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కి.మీ. ప్రయాణించి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు టికెట్ ధర రూ.455గా నిర్ణయించారు.
మరో మెట్రోలో ప్రధాని ప్రయాణం
అహ్మదాబాద్, గాంధీనగర్‌లను కలిపే రెండో దశ మెట్రోను మోదీ ప్రారంభించారు. అందులో గాంధీనగర్ సెక్టార్1 స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీకి వెళ్లారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కొందరు విద్యార్థులు ప్రయాణించారు. రూ.5,384 కోట్ల వ్యయంతో ఫేజ్2 పనులు చేపట్టారు.
భారత సౌర విప్లవం ఒక సువర్ణాధ్యాయం
గాంధీనగర్‌లో నాలుగో ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడి దారుల సదస్సు, ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ‘‘వెయ్యేళ్ల ప్రగతికి భారత్ పునాదులు వేసుకుంటోంది. అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవడమే గాక, అక్కడే కొనసాగాలని లక్షిస్తోంది. మూడో దఫా పాలన తొలి 100 రోజుల్లో మా ప్రాధమ్యాలను గమనిస్తే దేశం వేగం, విస్తృతి అర్ధమవుతాయి’’ అని పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. ‘‘సౌర, పవన, అణు, జల విద్యుదుత్పత్తి ద్వారా భారత్ ఇంధన అవసరాలు తీర్చుకోనుంది. దేశ 21వ శతాబ్ద చరిత్రలో సౌరవిప్లవ అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో రాస్తారు’’ అన్నారు. గాంధీనగర్‌లో వవోల్ ప్రాంతంలోని షాలిన్–2 సొసైటీలో ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనా’ పథక లబ్ధిదారులతో మోదీ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment