స్కాముల్లేని పదేళ్లు | Prime Minister Narendra Modi lashed out at the Congress | Sakshi
Sakshi News home page

స్కాముల్లేని పదేళ్లు

Published Mon, Feb 26 2024 5:23 AM | Last Updated on Mon, Feb 26 2024 5:23 AM

Prime Minister Narendra Modi lashed out at the Congress - Sakshi

సుదర్శన్‌ సేతును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

ద్వారక: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. కేవలం ఒక్క కుటుంబం బాగు కోసం ఆ పార్టీ మొత్తం శక్తిని ఉపయోగించిందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అన్ని రకాల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కుంభకోణాలకు, అవినీతి వ్యవహారాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. గత పదేళ్లగా దేశంలో స్కామ్‌ల మాటే లేదన్నారు. ప్రధాని మోదీ ఆదివారం తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు.

దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్‌ సేతు’ను ప్రారంభించారు. ఇది బెయిత్‌ ద్వారక ద్వీపాన్ని, ప్రధాన భూభాగంలోని ఓఖాను అనుసంధానిస్తుంది. రూ.48,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ఈ సందర్భంగా మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ద్వారకలో బహిరంగ సభలో ప్రసంగించారు.

కాంగ్రెస్‌ పాలనలో మన దేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని చెప్పారు. తమ హయాంలో ఐదో స్థానానికి చేరిందన్నారు. ప్రజల ఆశలు అంతమైన చోటు నుంచే ‘మోదీ గ్యారంటీ’ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరితోపాటు గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్‌లో నిర్మించిన ‘ఎయిమ్స్‌’లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

మత్తు వ్యసనంపై పోరాడుదాం
దేశంలో మాదక ద్రవ్యాల వ్యసనం పెరిగిపోతుండడం పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు వ్యసనంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. యువతను మత్తు బారి నుంచి కాపాడుకోవాలంటే వారి కుటుంబాల మద్దతు చాలా కీలకమని అన్నారు. కుటుంబం తోడుగా నిలిస్తే వ్యసనం నుంచి యువత సులువుగా బయటపడతారని సూచించారు. డ్రగ్స్‌ రహిత భారత్‌ మన లక్ష్యమని, ఇందుకోసం కుటుంబాలు పూనుకోవాలని, సహకారం అందించాలని కోరారు.

గాయత్రీ పరివార్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అశ్వమేధ యజ్ఞం నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. కుటుంబం బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందని తెలిపారు. కుటుంబ వ్యవస్థ బలహీనపడితే సమాజంలో విలువలు పడిపోతాయన్నారు. ఒక కుటుంబంలో సభ్యులంతా రోజుల తరబడి కలుసుకోకపోతే, మాట్లాడుకోకపోతే ముప్పు ముంచుకొచి్చనట్లేనని స్పష్టం చేశారు. మత్తు రహిత దేశ నిర్మాణం కోసం బలమైన కుటుంబ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.

దేశంలో కోట్లాది మంది యువతను మత్తు వ్యసనం నుంచి తప్పించి, దేశ నిర్మాణ కార్యకలాపాల దిశగా మళ్లించడానికి ఈ అశ్వమేధ యజ్ఞం తోడ్పడుతోందని ప్రశంసించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మత్తు ముప్పు నుంచి వారిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే మత్తు వలలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొద్దామని సూచించారు. యువత సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచి్చందని వెల్లడించారు. అమృత్‌ భారత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 553 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులకు మోదీ సోమవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితమిస్తారు.

దేశం కోసం ఓటేయండి
యువ ఓటర్లకు మోదీ పిలుపు  
‘మన్‌ కీ బాత్‌’కు 3 నెలలు విరామం
 
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి మూడు నెలలు విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. మార్చిలో ఎలక్షన్‌ కోడ్‌ రావచ్చన్నారు. మన్‌ కీ బాత్‌ పేరిట ఆయన ప్రతి నెలా చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగిస్తుండటం తెలిసిందే. తాజాగా 110వ మన్‌ కీబాత్‌లో మోదీ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు ప్రత్యేక సూచన చేశారు.

దేశం కోసం తప్పనిసరిగా తొలి ఓటు ఓటేయండి’’ అన్నారు. ‘‘మన్‌ కీ బాత్‌ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. మూణ్నెల్ల తర్వాత 111వ మన్‌ కీ బాత్‌తో మళ్లీ కలుద్దాం. చెప్పారు. 111 సంఖ్య చాలా శుభప్రదం. దేశ అభివృద్ధి ప్రయాణంలో నారీశక్తి పాత్ర పెరుగుతుండడం సంతోషకరం. వారు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. గ్రామీణ మహిళలు డ్రోన్లు ఎగురవేస్తున్నారు’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement