make in India
-
భారత్‌లో తయారీ.. విదేశాలకు రూ.85వేల కోట్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు!
దేశీయంగా తయారీ, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్- PLI) పథకం మంచి సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. 14 రంగాలకు వర్తిస్తోన్న ఈ స్కీమ్‌లో భాగమైన స్మార్ట్ ఫోన్ రంగం గణనీయమైన ఫలితాలు సాధించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి (2021-2022) భారత్‌లో తయారు చేసిన సుమారు రూ. 85 వేల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (icea) ప్రకటించింది. ఎక్స్పోర్ట్ చేసిన స్మార్ట్ ఫోన్లు గత ఆర్ధిక సంవత్సరం కంటే ఎక్కువగా రెట్టింపు అయ్యాయని సూచించింది. ఫోన్లను యూఏఈ, అమెరికా, నెథర్లాండ్స్, యూకే, ఇటలీ దేశాలకు పంపించినట్లు ఐసీఈఏ డేటా తెలిపింది. ఈ సందర్భంగా ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మోహింద్రో మాట్లాడుతూ.. దేశీయంగా 40 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్ల తయారీని అధిగమించినట్లు చెప్పారు. 25 శాతం అంటే 10 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను విదేశాలకు తరలించినట్లు చెప్పారు. ఇక ఉత్పత్తి చేసిన 97 శాతం ఫోన్లను దేశీయంగా అమ్మకాలు జరిగాయని.. తద్వారా భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫోన్ల తయారీ దేశంగా అవతరించిందని అన్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భారత్ ఈ ఏడాది ముగిసే సమయానికి రూ.1లక్షల కోట్ల విలువైన ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. పలు నివేదికల ప్రకారం..చైనాలో సప్లయ్ చైన్ సమస్యల కారణంగా కంటే భారత్, వియాత్నం దేశాల్లో స్మార్ట్ ఫోన్ తయారీ లబ్ధిదారులుగా అవతరించినట్లు అంచనా. చదవండి👉 భారత్‌లో ఐఫోన్ల తయారీ.. యాపిల్ అంచనాలు తలకిందులవుతున్నాయా? -
దేశీయంగా 100 యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల మేకిన్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్‌లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి. -
బడ్జెట్ 2021: స్మార్ట్ఫోన్లపై ఉత్కంఠ!
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఊతం ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. కేంద్రం కూడా అన్ని బడ్జెట్ల కంటే ఇది ప్రత్యేకమని పేర్కొంది. అన్ని రంగాలు కూడా ఈ బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం కూడా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆశిస్తున్నారు. (చదవండి: బడ్జెట్ 2021–22.. ఫోకస్) గతంలో "మేకిన్ ఇండియా" ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నేపథ్యంలో దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సెల్యులార్ హ్యాండ్సెట్లపై కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచారు. అయితే, ఇండస్ట్రీ బాడీ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసిఇఎ) మొబైల్ పరిశ్రమపై విధించిన వస్తు, సేవల పన్ను(జీఎస్టి)ను తగ్గించాలనే డిమాండ్‌ను మళ్లీ కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. గత ఏడాది మార్చిలో మొబైల్ పరిశ్రమపై 50శాతం పన్నును అధికంగా విధించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతికి కోసం మరింత ప్రోత్సాహం ఇస్తుందని వారు భావిస్తున్నారు. ప్రతి భారతీయుడికి స్మార్ట్‌ఫోన్ అందించాలంటే మొబైల్ ఫోన్లపై విధించిన జీఎస్టిని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించడం అత్యవసరం అని ఐసీఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ ఒక ప్రకటనలో చెప్పారు. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోసం రూ.500 కోట్లు, మొబైల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్లు బడ్జెట్ లో కేటాయించాలని ఐసీఇఎ కేంద్రానికి సిఫారసు చేసింది. మరోవైపు మొబైల్ ఫోన్, కాంపోనెంట్ తయారీదారులు ఎగుమతి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు మొబైల్ భాగాలపై తక్కువ జీఎస్టీని విధించాలని కోరుకుంటున్నారు. "సబ్ $200 ఎంట్రీ లెవల్(రూ.15,000) మొబైల్ ఫోన్ విభాగంలో స్వదేశీ హ్యాండ్సెట్ తయారీదారులు ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉండటానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది" అని ఐసీఇఎ తెలిపింది. -
త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రయిన్ కన్న త్వరగా దేశంలో హైస్పీడ్ రైలు పరుగులు తీయనుంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ట్రయిన్ 18, ట్రయిన్ 20 అనే హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ హైస్పీడ్ రైళ్ల కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు సజావుగా సాగితే.. ఈ ఏడాదే భారతీయులకు హైస్పీడ్ ట్రయిన్ ప్రయాణం అనుభవంలోకి రానుంది. రాజధాని, శతాబ్ధిల స్థానంలో..! దేశవ్యాప్త ప్రయాణికుల మది దోచుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ స్థానంలో ‘ట్రయిన్ 20’, శతాబ్ది స్థానంలో ‘ట్రయిన్ 18’ త్వరలో రాబోతున్నాయని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ సుధామణి చెప్పారు. ‘ట్రయిన్ 18’ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టంబర్లో శతాబ్ది స్థానంలో ప్రయాణం మొదలు పెడుతుందని అన్నారు. ట్రయిన్ 20 మాత్రం పట్టాలెక్కడానికి 2020 దాకా సమయం పడుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ‘ట్రయిన్-18, ‘ట్రయిన్ 20’ల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ ఇంజినీర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రయాణికుల కోస ఎల్ఈడీ స్క్రీన్లు, జీపీఎస్ సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లకు ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌తో పాటు బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా ‘ట్రయిన్-18, ‘ట్రయిన్ -20’ హైస్పీడ్ రైళ్లను మేకిన్ ఇండియాలో భాగంగా అభివృద్ధి చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. ట్రయిన్ 18కు రూ. 2.50 కోట్లు ఖర్చుకాగా, ట్రయిన్ 20 నిర్మాణానికి రూ.5.50 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. -
మహిళ మాకు ఆది'శక్తి'
భారత్‌లో, ఆ మాటకొస్తే దక్షిణాసియాలోనే తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు హైదరాబాద్‌లో మంగళవారం అట్టహాసంగా ఆరంభమయింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో గురువారం వరకు జరగనున్న ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కలిసి ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో వేదికపైకి నడుచుకుంటూ రాగా, ఆ రోబో తాలూకు కంప్యూటర్‌పై భారత, అమెరికా చిహ్నాల్ని మోదీ, ఇవాంకా టచ్ చేశారు. దీంతో సదస్సు ప్రారంభమైనట్లు రోబో ప్రకటించింది. అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా సాయంత్రం 4.45గంటల ప్రాంతంలో ఆరంభమైన సదస్సులో కాసేపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. హైదరాబాద్ ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియోలతో పాటు భారత ఔన్నత్యాన్ని, మేకిన్ ఇండియా లక్ష్యాలను తెలిపే వీడియోలను ప్రదర్శించారు. చివరిగా, సదస్సులో చర్చించే ముఖ్యాంశాలైన హెల్త్‌కేర్–లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ–ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ–ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్టైన్మెంట్... ఈ నాలుగింటి విశేషాలనూ తెలియజేస్తూ చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. చివరిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వందన సమర్పణతో ఆరంభ కార్యక్రమం ముగిసింది. అనంతరం ‘బీ ద చేంజ్.. విమెన్స్ ఎంట్రప్రెన్యురల్ లీడర్షిప్’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఇవాంకా, జాన్ చాంబర్స్ (సిస్కో), మార్కస్ వాలెన్‌బర్గ్ (సెబ్), రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ వ్యవస్థాపకురాలు షిబోంగ్లీ రిజోయ్స్ పాల్గొన్నారు. సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి: భారతీయ పురాణాల్లో మహిళను శక్తి అవతారంగా అభివర్ణించారని, సమాజాభివృద్ధికి మహిళా సాధికారత అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలోని నాలుగు అత్యంత పురాతనమైన హైకోర్టులకుగాను మూడింటికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారని, అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన యాత్రలోనూ మహిళల పాత్రే ప్రధానమని, క్రీడల్లోనూ మహిళలే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మంగళ వారమిక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. దక్షిణాసియాలో తొలిసారి జరుగుతున్న ఈ సదస్సు.. ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యా వేత్తలు, మేధావులు, ఇతర ముఖ్యుల్ని ఒకచోటికి చేర్చి, పరిశ్రమలకు కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇది సిలికాన్ వ్యాలీని, హైదరాబాద్‌ను కలపటమే కాకుండా.. భారత్–అమెరికా బంధాల్ని మరింత దృఢతరం చేస్తుందని వ్యాఖ్యానించారు. భారత చరిత్రలో చెరగని చోటు భారతదేశ చరిత్రలో మహిళలకు చెరిగిపోని చోటుందని ప్రధాని అన్నారు. ‘‘క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే వేద విద్యావంతురాలైన గార్గి ఓ మహా మునిని వేదవిద్యలో సవాల్ చేసింది. ఆ కాలంలో ఇది ఊహలకు కూడా అందని విషయం. ఇక రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మీబాయి వారి సామ్రాజ్యాల రక్షణకు ప్రాణాలొడ్డి పోరాడారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ మహిళలది కాదనలేని పాత్ర. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారతీయ సంతతి మహిళలు అమెరికా అంతరిక్ష కార్యక్రమంలోనూ భాగమయ్యారు. ఈ హైదరాబాద్ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జా వంటి క్రీడారత్నాలు భారత్‌కు వన్నెతెచ్చారు. మహిళలకు అట్టడుగు స్థాయి నుంచీ విధాన నిర్ణయాల్లో భాగమివ్వాలనే ఉద్దేశంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడోవంతు స్థానాలు రిజర్వు చేశాం’’ అని వివరించారు. దేశంలో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల్లో 60 శాతానికి పైగా మహిళలేనంటూ.. గుజరాత్లో సహకార ఉద్యమానికి ఊపిరులూదిన లిజ్జత్ పాపడ్ కథ వినిపించారు. అనాదిగా పారిశ్రామికతత్వం భారతదేశం పురాతన కాలం నుంచీ ఆవిష్కరణలకు కేంద్రమని, పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించిందని మోదీ చెప్పారు. ‘‘ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది చరక సంహిత. యోగా మరో ఆవిష్కరణ. ఇప్పుడు ఎందరో పారిశ్రామికవేత్తలు యోగాను, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ డిజిటల్ యుగానికి ఆధారం బైనరీ సిస్టమే. ఈ బైనరీకి సున్నాతోనే పునాది పడింది. దాన్ని కనుగొన్నది ఆర్యభట్ట. పన్ను వ్యవస్థలకు మూలం కౌటిల్యుడి అర్థ శాస్త్రం’’ అని వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ.. ‘‘తన ఆలోచనను సాకారం చేసుకునే నైపుణ్యం, విజ్ఞానంతో పాటు ప్రతికూలంలోనూ అవకాశాల్ని వెదుక్కోవాలి. అంతిమంగా వినియోగదారుడికి మరింత సులువైన పరిష్కారాన్ని అందించాలి’’ అంటూ స్వామి వివేకానందను ఉదహరించారు. భారత్‌లో ఇప్పుడు 80 కోట్ల మందికి పారిశ్రామికవేత్తలుగా మారే సత్తా ఉందని... వీరంతా కలిసి ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలరని చెప్పారాయన. మొబైల్ యూజర్ల సంఖ్య పెరుగుతోందంటూ... ఇది ఉద్యోగాల కల్పనకు సహకరిస్తుందన్నారు. డిజిటల్‌కు మూలం... ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఆధారిత డేటాబేస్‌గా నిలుస్తున్న ఆధార్‌ను ప్రధాని ప్రస్తావించారు. ‘‘దీంట్లో ఇపుడు 115 కోట్ల మంది చేరారు. రోజుకు దీని ఆధారంగా 4 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఆధార్ సాయంతో కేంద్ర పథకాల్ని నేరుగా లబ్ధిదారుకే అందిస్తున్నాం. జన్‌ధన్ ఖాతాలతో 68,500 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వీటిలో 53 శాతం ఖాతాలు మహిళలవే’’ అని మోదీ వివరించారు. భీమ్ యాప్ గురించి ప్రస్తావిస్తూ.. మెల్లగా తక్కువ నగదున్న వ్యవస్థలోకి వెళుతున్నామని, ఇపుడు భీమ్‌తో రోజుకు 28 లక్షల లావాదేవీలు సాగుతున్నాయని వివరించారు. గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లిచ్చే సౌభాగ్య పథకాన్ని, హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యాలను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆవిష్కరణల కోసమే స్టార్టప్ ఇండియా... పారిశ్రామికవేత్తల ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికే స్టార్టప్ ఇండియాను ఆరంభించామని ప్రధాని మోదీ చెప్పారు. దీనికోసం 1200 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని, 21 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల్ని సడలించి ఆన్లైన్ అనుమతుల్ని ప్రవేశపెట్టామని వివరించారు. ప్రపంచబ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంకింగ్ మెరుగుపడి 100కు చేరటాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీంతో సంతృప్తి చెందడం లేదని, 50వ ర్యాంకుకు చేరుకోవటానికి శ్రమిస్తామన్నారు. ముద్రా రుణాల పథకాన్ని ప్రారంభించాక ఇప్పటిదాకా 4.28 లక్షల కోట్ల రూపాయల్ని 9 కోట్ల మందికి ఇచ్చామని, వారిలో 7 కోట్ల మంది మహిళలేనని ప్రధాని వివరించారు. పెట్టుబడుల కోసమే సంస్కరణలు పారదర్శక పాలసీలు, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చెప్పడం ద్వారా పారిశ్రామికవేత్తల్ని పెంచవచ్చనేది తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే పన్నుల వ్యవస్థను ప్రక్షాళించేందుకు జీఎస్టీని తెచ్చామని, దివాలా చట్టాన్ని అమలు చేస్తున్నామని ప్రధాని వివరించారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు చేపట్టిన చర్యల్ని వివరించారు. ఇవన్నీ గుర్తించే మూడీస్ సంస్థ రేటింగ్‌ను పెంచిందని గుర్తుచేశారు. ‘‘చివరిగా భారతీయ యువ పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేదొక్కటే. 2022 నాటికి కొత్త భారతాన్ని సృష్టించాలి. దానికి మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయగలరు. భారత మార్పునకు మీరే సారథులు. రండి!! భారత్‌లో తయారీ చేపట్టండి. ఇక్కడ పెట్టుబడి పెట్టండి. భారత వృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మీలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. దీనికి మా మద్దతుంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. -
జాతి నిర్మాతలుండగా సింగపూర్ పాఠాలెందుకు?
సందర్భం ప్రపంచీకరణ వలన ఏర్పడిన భ్రష్టత్వాన్ని రూపుమాపితే తప్ప మేకిన్ ఇండియా సాధ్యంకాదు. జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్లు గొప్పదేశాలే కావచ్చు కానీ మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ కోసం కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఉన్న నిర్మాణాలను పునరుద్ధరించండి. భారత ప్రధాని మోదీ ఇచ్చిన ‘మేకిన్ ఇండియా’ అనే నినా దం మా అందర్నీ పులకింప జేసింది. కానీ సృష్టించడం అనేది ఒక రోజు లోనో, ఒక నెలలోనో, ఒక ఏడాదిలోనో సాధ్యమయ్యేది కాదు. కొన్ని సంవత్సరాల్లోనై నా సాధించేది కాదు. కనీసం ఐదేళ్లలో కూడా పరిపూ ర్ణంగా నూతన వ్యవస్థను సృష్టించలేం. కొన్ని దశాబ్దాలు కూడా కాదు. శతాబ్దాల తరబడి అనేకానేక తరాలు ఎడతెగకుండా జాతి పురోభివృద్ధికి అంకితమైతేనే నూతన సృష్టి సాధ్యమవుతుంది. మేకిన్ ఇండియా అనే నినాదం సార్థకమౌతుంది. భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సరిగ్గా దీనినే సాధించాలని కలగ న్నాడు. కేవలం కలగని ఊరుకోలేదు. తన కలల పునా దులపై భావిభారత పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి కార్యరూపం ఇచ్చాడు. ఓ సందర్భంలో నెహ్రూని ఒక పొలిటికల్ రిపోర్టర్ ఒక ప్రశ్న వేశాడు. ‘దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి కదా మీరు చెబుతున్న ఐఐటీ అనే నినాదం ఏవిధంగా దీనికి భిన్నంగా ఉంటుం ద’ని అడిగాడు. నెహ్రూ దార్శనికుడిలా సమాధానం చెప్పాడు.‘దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశా లలు లేవని కాదు. అవి కేవలం బ్రిటిష్ సామ్రాజ్య వాదులు వేసిన కట్టడాలకు కాపలాదారులను మాత్రమే తయారు చేయగలవు. కానీ మనదేశ ప్రజల అవసరా లకు అనుగుణమైనటువంటి టెక్నాలజీని సృష్టించేవి కాదు. బ్రిటిష్ వారు తమ అవసరాల నిమిత్తం నిర్మాణా లు చేసిన మాట వాస్తవమే. దానికి మేం కృతజ్ఞులం. కానీ ఈనాడు దేశం స్వతంత్రమైంది. ప్రజలు ప్రజల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచ వలసిన అవసరం వున్నది. కాబట్టి భారత ప్రజల అవస రాలను శోధించే తరాన్ని సృష్టించవలసిన ఆవశ్యకత మనపై ఉన్నది. ఇది కొత్తతరం చేయవలసిన పని... అటువంటి ఫలవంతమైన తరాన్ని నేను చూడదల్చుకు న్నాను. అన్ని దేశాల్లో ఇలాంటి తరమే తమ దేశం యొ క్క నిర్మాణంలో కీలక భాగస్వామి అవుతోంది. ఆ తరం తో నా దేశస్తులు కూడా భుజం భుజం కలిపి ప్రపంచ సౌభాగ్యానికి కార్యోన్ముఖులైతే నేను గర్విస్తాను.’ ఆనా టికే ఆరుపదులు దాటిన దేశ ప్రధానియొక్క కల ఇది. అటువంటి కలను భారతీయుల ముంగిళ్లలోకి తె చ్చేందుకు నెహ్రూ ఐఐటీలను ప్రవేశపెట్టాడు. ‘ఈ దేశం దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది. తిండిలేక తిప్పలు పడుతున్నారు. ప్రపంచ విజ్ఞానం అభివృద్ధికి కావాల్సిన స్తోమత ఈ దేశానికి ఉన్నదా?’ అని అడిగాడా విలేకరి. ‘నా దేశం తన దేశాన్ని ఎంత ప్రేమిస్తుందో ప్రపంచం లోని అణగారిన వర్గాలను, పీడిత వర్గాన్ని కూడా అంతే ప్రేమిస్తుంది... ప్రపంచ దేశాలన్నీ మమ్మల్ని ఆదుకుం టాయ’నే విశ్వాసం కూడా నెహ్రూ వ్యక్తం చేశారు. దాని ప్రకారమే ఖరగ్‌పూర్ ఐఐటికి కెనడా సహాయం చేసింది. చెన్నై ఐఐటీకి వెస్ట్ జర్మనీ సాయపడింది. బాంబే ఐఐటి ని సోవియట్ యూనియన్ నిర్మించింది. కాన్పూర్ ఐఐటీకి అమెరికా సహాయం అందజేసింది. ఈ నాలుగు ఐఐటీలకు ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు సహాయం చేశాయి. కాబట్టి మేకిన్ ఇండియాకు పునాదిని తొలి ప్రధాని పండిట్ నెహ్రూనే వేశారు. దానినే ప్రస్తుత ప్రధాని మోదీ పునరుద్ధరిస్తేచాలు. దేశం సంతోషిస్తుంది. గత 60 ఏళ్ళలో ఐఐటీలు అసాధారణ విజయాల ను సాధించాయి. ప్రపంచంలోనే మూడవ, నాల్గవ ర్యాంకులు వచ్చాయి. దేశంలో వున్న ఐఐటీ విద్యార్థులు నాసా డెరైక్టర్స్ అయ్యారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీని నిర్మించారు. కానీ ప్రపంచీకరణ ఫలితాలు అన్ని దేశాల ను ఏవిధంగా నిర్వీర్యంగా తయారు చేశాయో, ఐఐటీల ను సైతం అంతే మోతాదులో బలహీన పరిచాయి. ఐఎం ఎఫ్ ఆదేశానుసారం ఐఐటికి యిచ్చిన ధనసాయంపై ఆంక్షలు విధించారు. ఎన్నో ఖాళీలను భర్తీ చేయలేదు. విద్యార్థులు నిస్పృహతో సర్వీస్ సెక్టార్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చా ల్సిన వారు సర్వీస్ సెక్టార్‌లోకి అనివా ర్యంగా వచ్చారు. దేశంలో అపరిమితమైన మేధస్సు వుంది. మేకిన్ ఇండియా సక్సెస్ కోసం కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఉన్న నిర్మాణాలను పునరుద్ధరించండి. ఐఐటీలు అన్నింటికీ నిధులు సమకూర్చండి. ఇవి కాకుండా దేశ వ్యాప్తంగా వున్న ఎన్ఐటీలను పరిపూర్ణం చేయండి. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి. వారిలోపల ఇన్నో వేషన్ అనే భావనకు అంకురార్పణ చేయండి. అది ప్రాథమిక దశనుంచి విశ్వవిద్యాలయాల వరకు జరగాలి.. విద్యార్థి జాతి నిర్మాత. నూతన భావాల సృష్టికర్త. భవిష్యత్ భారతావని ఆవిష్కర్త. అతనికి ప్రభుత్వాలకు మధ్యన దళారులు అవసరం లేదు. ప్రభుత్వమే దృఢ సంకల్పంతో వీటిని నిర్వహిస్తే అందరి ఆశలు ఫలిస్తాయి. జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్లు గొప్ప దేశాలే కావచ్చు కానీ మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన తొలి ప్రధానులే మన దేశ భవిష్యత్తుకి పునా దులు వేశారు. దాన్ని పరిపుష్టం చేసుకోవడం మాత్రమే ఇప్పుడు జరగాల్సింది. అందుకు జాతియావత్తూ పునరంకితం కావాలి. అదే మా లక్ష్యం. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
పారిశ్రామిక రంగానికి పన్ను మినహాయింపులివ్వండి
అప్పుడే మేక్ఇన్ ఇండియా నినాదానికి సార్థకత సీఆర్ఐ పంప్స్ డీజీఎం తిరుమూర్తి బెంగళూరు : మేక్ ఇన్ ఇండియా నినాదానికి సార్థకత ఉండాలంటే పారిశ్రామిక రంగానికి పన్ను మినహాయింపు ఇస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సీఆర్ఐ పంప్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ తిరుమూర్తి సూచించారు. బెంగళూరులో జరుగుతున్న ‘ఆక్రెక్స్’ ప్రదర్శనలో భాగంగా సీఆర్ఐ పంప్స్ రూపొందించిన పర్యావరణ హితకారిణి యంత్రాల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారతదేశంలో వస్తు ఉత్పత్తిని పెంచడం కోసం మేక్ ఇన్ ఇండియాను అమలు చేయడం సంతోకరమని అన్నారు. అయితే దేశీయంగా అమల్లో ఉన్న పన్నుల విధానాన్ని మార్చకుండా మేక్ ఇన్ ఇండియాను అమలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కొన్ని రంగాల్లో పన్నుపై పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తే బాగుంటుందని కోరారు. వస్తు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యత కూడా స్థానికంగా ఉండేలా చూడాలన్నారు. మోటారు, పైపులు, పంపుల తయారీ రంగంలో ‘చైనా నుంచి నాణ్యత తక్కువగా ఉన్న ముడిపదార్థాలు’ భారత దేశంలోకి అక్రమ మార్గంలో దిగుమతి అవుతున్నాయన్నారు. దీంతో ఈ రంగానికి సంబంధించిన మార్కెట్లో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్కెట్‌ను నకిలీ వస్తువులు ముంచెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.