అప్పుడే మేక్‌ఇన్ ఇండియా నినాదానికి సార్థకత
సీఆర్‌ఐ పంప్స్ డీజీఎం తిరుమూర్తి
బెంగళూరు : మేక్ ఇన్ ఇండియా నినాదానికి సార్థకత ఉండాలంటే పారిశ్రామిక రంగానికి పన్ను మినహాయింపు ఇస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సీఆర్‌ఐ పంప్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ తిరుమూర్తి సూచించారు. బెంగళూరులో జరుగుతున్న ‘ఆక్రెక్స్’ ప్రదర్శనలో భాగంగా సీఆర్‌ఐ పంప్స్ రూపొందించిన పర్యావరణ హితకారిణి యంత్రాల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారతదేశంలో వస్తు ఉత్పత్తిని పెంచడం కోసం మేక్ ఇన్ ఇండియాను అమలు చేయడం సంతోకరమని అన్నారు.
అయితే దేశీయంగా అమల్లో ఉన్న పన్నుల విధానాన్ని మార్చకుండా మేక్ ఇన్ ఇండియాను అమలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కొన్ని రంగాల్లో పన్నుపై పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తే బాగుంటుందని కోరారు. వస్తు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యత కూడా స్థానికంగా ఉండేలా చూడాలన్నారు. మోటారు, పైపులు, పంపుల తయారీ రంగంలో ‘చైనా నుంచి నాణ్యత తక్కువగా ఉన్న ముడిపదార్థాలు’ భారత దేశంలోకి అక్రమ మార్గంలో దిగుమతి అవుతున్నాయన్నారు. దీంతో ఈ రంగానికి సంబంధించిన మార్కెట్‌లో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్కెట్‌ను నకిలీ వస్తువులు ముంచెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక రంగానికి పన్ను మినహాయింపులివ్వండి
Published Sat, Feb 28 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement