చుక్కా రామయ్య
సందర్భం
ప్రపంచీకరణ వలన ఏర్పడిన భ్రష్టత్వాన్ని రూపుమాపితే తప్ప మేకిన్ ఇండియా సాధ్యంకాదు. జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్‌లు గొప్పదేశాలే కావచ్చు కానీ మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ కోసం కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఉన్న నిర్మాణాలను పునరుద్ధరించండి.
భారత ప్రధాని మోదీ ఇచ్చిన ‘మేకిన్ ఇండియా’ అనే నినా దం మా అందర్నీ పులకింప జేసింది. కానీ సృష్టించడం అనేది ఒక రోజు లోనో, ఒక నెలలోనో, ఒక ఏడాదిలోనో సాధ్యమయ్యేది కాదు. కొన్ని సంవత్సరాల్లోనై నా సాధించేది కాదు. కనీసం ఐదేళ్లలో కూడా పరిపూ ర్ణంగా నూతన వ్యవస్థను సృష్టించలేం. కొన్ని దశాబ్దాలు కూడా కాదు. శతాబ్దాల తరబడి అనేకానేక తరాలు ఎడతెగకుండా జాతి పురోభివృద్ధికి అంకితమైతేనే నూతన సృష్టి సాధ్యమవుతుంది. మేకిన్ ఇండియా అనే నినాదం సార్థకమౌతుంది. భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సరిగ్గా దీనినే సాధించాలని కలగ న్నాడు. కేవలం కలగని ఊరుకోలేదు. తన కలల పునా దులపై భావిభారత పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి కార్యరూపం ఇచ్చాడు.
ఓ సందర్భంలో నెహ్రూని ఒక పొలిటికల్ రిపోర్టర్ ఒక ప్రశ్న వేశాడు. ‘దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి కదా మీరు చెబుతున్న ఐఐటీ అనే నినాదం ఏవిధంగా దీనికి భిన్నంగా ఉంటుం ద’ని అడిగాడు. నెహ్రూ దార్శనికుడిలా సమాధానం చెప్పాడు.‘దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశా లలు లేవని కాదు. అవి కేవలం బ్రిటిష్ సామ్రాజ్య వాదులు వేసిన కట్టడాలకు కాపలాదారులను మాత్రమే తయారు చేయగలవు. కానీ మనదేశ ప్రజల అవసరా లకు అనుగుణమైనటువంటి టెక్నాలజీని సృష్టించేవి కాదు. బ్రిటిష్ వారు తమ అవసరాల నిమిత్తం నిర్మాణా లు చేసిన మాట వాస్తవమే. దానికి మేం కృతజ్ఞులం. కానీ ఈనాడు దేశం స్వతంత్రమైంది. ప్రజలు ప్రజల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచ వలసిన అవసరం వున్నది. కాబట్టి భారత ప్రజల అవస రాలను శోధించే తరాన్ని సృష్టించవలసిన ఆవశ్యకత మనపై ఉన్నది. ఇది కొత్తతరం చేయవలసిన పని... అటువంటి ఫలవంతమైన తరాన్ని నేను చూడదల్చుకు న్నాను. అన్ని దేశాల్లో ఇలాంటి తరమే తమ దేశం యొ క్క నిర్మాణంలో కీలక భాగస్వామి అవుతోంది. ఆ తరం తో నా దేశస్తులు కూడా భుజం భుజం కలిపి ప్రపంచ సౌభాగ్యానికి కార్యోన్ముఖులైతే నేను గర్విస్తాను.’ ఆనా టికే ఆరుపదులు దాటిన దేశ ప్రధానియొక్క కల ఇది.
అటువంటి కలను భారతీయుల ముంగిళ్లలోకి తె చ్చేందుకు నెహ్రూ ఐఐటీలను ప్రవేశపెట్టాడు. ‘ఈ దేశం దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది. తిండిలేక తిప్పలు పడుతున్నారు. ప్రపంచ విజ్ఞానం అభివృద్ధికి కావాల్సిన స్తోమత ఈ దేశానికి ఉన్నదా?’ అని అడిగాడా విలేకరి. ‘నా దేశం తన దేశాన్ని ఎంత ప్రేమిస్తుందో ప్రపంచం లోని అణగారిన వర్గాలను, పీడిత వర్గాన్ని కూడా అంతే ప్రేమిస్తుంది... ప్రపంచ దేశాలన్నీ మమ్మల్ని ఆదుకుం టాయ’నే విశ్వాసం కూడా నెహ్రూ వ్యక్తం చేశారు. దాని ప్రకారమే ఖరగ్‌పూర్ ఐఐటికి కెనడా సహాయం చేసింది. చెన్నై ఐఐటీకి వెస్ట్ జర్మనీ సాయపడింది. బాంబే ఐఐటి ని సోవియట్ యూనియన్ నిర్మించింది. కాన్పూర్ ఐఐటీకి అమెరికా సహాయం అందజేసింది. ఈ నాలుగు ఐఐటీలకు ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు సహాయం చేశాయి. కాబట్టి మేకిన్ ఇండియాకు పునాదిని తొలి ప్రధాని పండిట్ నెహ్రూనే వేశారు. దానినే ప్రస్తుత ప్రధాని మోదీ పునరుద్ధరిస్తేచాలు. దేశం సంతోషిస్తుంది.
గత 60 ఏళ్ళలో ఐఐటీలు అసాధారణ విజయాల ను సాధించాయి. ప్రపంచంలోనే మూడవ, నాల్గవ ర్యాంకులు వచ్చాయి. దేశంలో వున్న ఐఐటీ విద్యార్థులు నాసా డెరైక్టర్స్ అయ్యారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీని నిర్మించారు. కానీ ప్రపంచీకరణ ఫలితాలు అన్ని దేశాల ను ఏవిధంగా నిర్వీర్యంగా తయారు చేశాయో, ఐఐటీల ను సైతం అంతే మోతాదులో బలహీన పరిచాయి. ఐఎం ఎఫ్ ఆదేశానుసారం ఐఐటికి యిచ్చిన ధనసాయంపై ఆంక్షలు విధించారు. ఎన్నో ఖాళీలను భర్తీ చేయలేదు. విద్యార్థులు నిస్పృహతో సర్వీస్ సెక్టార్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చా ల్సిన వారు సర్వీస్ సెక్టార్‌లోకి అనివా ర్యంగా వచ్చారు.
దేశంలో అపరిమితమైన మేధస్సు వుంది. మేకిన్ ఇండియా సక్సెస్ కోసం కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఉన్న నిర్మాణాలను పునరుద్ధరించండి. ఐఐటీలు అన్నింటికీ నిధులు సమకూర్చండి. ఇవి కాకుండా దేశ వ్యాప్తంగా వున్న ఎన్‌ఐటీలను పరిపూర్ణం చేయండి. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి. వారిలోపల ఇన్నో వేషన్ అనే భావనకు అంకురార్పణ చేయండి. అది ప్రాథమిక దశనుంచి విశ్వవిద్యాలయాల వరకు జరగాలి.. విద్యార్థి జాతి నిర్మాత. నూతన భావాల సృష్టికర్త. భవిష్యత్ భారతావని ఆవిష్కర్త. అతనికి ప్రభుత్వాలకు మధ్యన దళారులు అవసరం లేదు. ప్రభుత్వమే దృఢ సంకల్పంతో వీటిని నిర్వహిస్తే అందరి ఆశలు ఫలిస్తాయి. జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్‌లు గొప్ప దేశాలే కావచ్చు కానీ మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన తొలి ప్రధానులే మన దేశ భవిష్యత్తుకి పునా దులు వేశారు. దాన్ని పరిపుష్టం చేసుకోవడం మాత్రమే ఇప్పుడు జరగాల్సింది. అందుకు జాతియావత్తూ పునరంకితం కావాలి. అదే మా లక్ష్యం.
(వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)