మంగళవారం అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
భారత్‌లో, ఆ మాటకొస్తే దక్షిణాసియాలోనే తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు హైదరాబాద్‌లో మంగళవారం అట్టహాసంగా ఆరంభమయింది. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో గురువారం వరకు జరగనున్న ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కలిసి ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన కంపెనీ తయారు చేసిన ‘మిత్ర’ రోబో వేదికపైకి నడుచుకుంటూ రాగా, ఆ రోబో తాలూకు కంప్యూటర్‌పై భారత, అమెరికా చిహ్నాల్ని మోదీ, ఇవాంకా టచ్ చేశారు. దీంతో సదస్సు ప్రారంభమైనట్లు రోబో ప్రకటించింది. అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా సాయంత్రం 4.45గంటల ప్రాంతంలో ఆరంభమైన సదస్సులో కాసేపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. హైదరాబాద్ ప్రాశస్త్యాన్ని తెలిపే వీడియోలతో పాటు భారత ఔన్నత్యాన్ని, మేకిన్ ఇండియా లక్ష్యాలను తెలిపే వీడియోలను ప్రదర్శించారు. చివరిగా, సదస్సులో చర్చించే ముఖ్యాంశాలైన హెల్త్‌కేర్–లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ–ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్‌టైన్‌మెంట్... ఈ నాలుగింటి విశేషాలనూ తెలియజేస్తూ చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వాగతోపన్యాసం చేయగా మోదీ, ఇవాంకా సదస్సును ఆరంభించి మాట్లాడారు. చివరిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వందన సమర్పణతో ఆరంభ కార్యక్రమం ముగిసింది. అనంతరం ‘బీ ద చేంజ్.. విమెన్స్ ఎంట్రప్రెన్యురల్ లీడర్‌షిప్’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఇవాంకా, జాన్ చాంబర్స్ (సిస్కో), మార్కస్ వాలెన్‌బర్గ్ (సెబ్), రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్‌ఆర్‌ఎస్ ఏవియేషన్ వ్యవస్థాపకురాలు షిబోంగ్లీ రిజోయ్స్ పాల్గొన్నారు.
సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి: భారతీయ పురాణాల్లో మహిళను శక్తి అవతారంగా అభివర్ణించారని, సమాజాభివృద్ధికి మహిళా సాధికారత అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలోని నాలుగు అత్యంత పురాతనమైన హైకోర్టులకుగాను మూడింటికి మహిళలే నేతృత్వం వహిస్తున్నారని, అంగారకుడిపైకి రోవర్‌ను పంపిన యాత్రలోనూ మహిళల పాత్రే ప్రధానమని, క్రీడల్లోనూ మహిళలే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మంగళ వారమిక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. దక్షిణాసియాలో తొలిసారి జరుగుతున్న ఈ సదస్సు.. ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు, విద్యా వేత్తలు, మేధావులు, ఇతర ముఖ్యుల్ని ఒకచోటికి చేర్చి, పరిశ్రమలకు కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఇది సిలికాన్ వ్యాలీని, హైదరాబాద్‌ను కలపటమే కాకుండా.. భారత్–అమెరికా బంధాల్ని మరింత దృఢతరం చేస్తుందని వ్యాఖ్యానించారు.
భారత చరిత్రలో చెరగని చోటు
భారతదేశ చరిత్రలో మహిళలకు చెరిగిపోని చోటుందని ప్రధాని అన్నారు. ‘‘క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలోనే వేద విద్యావంతురాలైన గార్గి ఓ మహా మునిని వేదవిద్యలో సవాల్ చేసింది. ఆ కాలంలో ఇది ఊహలకు కూడా అందని విషయం. ఇక రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మీబాయి వారి సామ్రాజ్యాల రక్షణకు ప్రాణాలొడ్డి పోరాడారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ మహిళలది కాదనలేని పాత్ర. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారతీయ సంతతి మహిళలు అమెరికా అంతరిక్ష కార్యక్రమంలోనూ భాగమయ్యారు. ఈ హైదరాబాద్ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జా వంటి క్రీడారత్నాలు భారత్‌కు వన్నెతెచ్చారు. మహిళలకు అట్టడుగు స్థాయి నుంచీ విధాన నిర్ణయాల్లో భాగమివ్వాలనే ఉద్దేశంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడోవంతు స్థానాలు రిజర్వు చేశాం’’ అని వివరించారు. దేశంలో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమల్లో 60 శాతానికి పైగా మహిళలేనంటూ.. గుజరాత్‌లో సహకార ఉద్యమానికి ఊపిరులూదిన లిజ్జత్ పాపడ్ కథ వినిపించారు.
అనాదిగా పారిశ్రామికతత్వం
భారతదేశం పురాతన కాలం నుంచీ ఆవిష్కరణలకు కేంద్రమని, పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించిందని మోదీ చెప్పారు. ‘‘ప్రపంచానికి ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది చరక సంహిత. యోగా మరో ఆవిష్కరణ. ఇప్పుడు ఎందరో పారిశ్రామికవేత్తలు యోగాను, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ డిజిటల్ యుగానికి ఆధారం బైనరీ సిస్టమే. ఈ బైనరీకి సున్నాతోనే పునాది పడింది. దాన్ని కనుగొన్నది ఆర్యభట్ట. పన్ను వ్యవస్థలకు మూలం కౌటిల్యుడి అర్థ శాస్త్రం’’ అని వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ.. ‘‘తన ఆలోచనను సాకారం చేసుకునే నైపుణ్యం, విజ్ఞానంతో పాటు ప్రతికూలంలోనూ అవకాశాల్ని వెదుక్కోవాలి. అంతిమంగా వినియోగదారుడికి మరింత సులువైన పరిష్కారాన్ని అందించాలి’’ అంటూ స్వామి వివేకానందను ఉదహరించారు. భారత్‌లో ఇప్పుడు 80 కోట్ల మందికి పారిశ్రామికవేత్తలుగా మారే సత్తా ఉందని... వీరంతా కలిసి ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలరని చెప్పారాయన. మొబైల్ యూజర్ల సంఖ్య పెరుగుతోందంటూ... ఇది ఉద్యోగాల కల్పనకు సహకరిస్తుందన్నారు.
డిజిటల్‌కు మూలం... ఆధార్
ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఆధారిత డేటాబేస్‌గా నిలుస్తున్న ఆధార్‌ను ప్రధాని ప్రస్తావించారు. ‘‘దీంట్లో ఇపుడు 115 కోట్ల మంది చేరారు. రోజుకు దీని ఆధారంగా 4 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఆధార్ సాయంతో కేంద్ర పథకాల్ని నేరుగా లబ్ధిదారుకే అందిస్తున్నాం. జన్‌ధన్ ఖాతాలతో 68,500 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వీటిలో 53 శాతం ఖాతాలు మహిళలవే’’ అని మోదీ వివరించారు. భీమ్ యాప్ గురించి ప్రస్తావిస్తూ.. మెల్లగా తక్కువ నగదున్న వ్యవస్థలోకి వెళుతున్నామని, ఇపుడు భీమ్‌తో రోజుకు 28 లక్షల లావాదేవీలు సాగుతున్నాయని వివరించారు. గ్రామాలకు విద్యుత్ కనెక్షన్లిచ్చే సౌభాగ్య పథకాన్ని, హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యాలను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆవిష్కరణల కోసమే స్టార్టప్ ఇండియా...
పారిశ్రామికవేత్తల ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికే స్టార్టప్ ఇండియాను ఆరంభించామని ప్రధాని మోదీ చెప్పారు. దీనికోసం 1200 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని, 21 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల్ని సడలించి ఆన్‌లైన్ అనుమతుల్ని ప్రవేశపెట్టామని వివరించారు. ప్రపంచబ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంకింగ్ మెరుగుపడి 100కు చేరటాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీంతో సంతృప్తి చెందడం లేదని, 50వ ర్యాంకుకు చేరుకోవటానికి శ్రమిస్తామన్నారు. ముద్రా రుణాల పథకాన్ని ప్రారంభించాక ఇప్పటిదాకా 4.28 లక్షల కోట్ల రూపాయల్ని 9 కోట్ల మందికి ఇచ్చామని, వారిలో 7 కోట్ల మంది మహిళలేనని ప్రధాని వివరించారు.
పెట్టుబడుల కోసమే సంస్కరణలు
పారదర్శక పాలసీలు, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని చెప్పడం ద్వారా పారిశ్రామికవేత్తల్ని పెంచవచ్చనేది తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే పన్నుల వ్యవస్థను ప్రక్షాళించేందుకు జీఎస్‌టీని తెచ్చామని, దివాలా చట్టాన్ని అమలు చేస్తున్నామని ప్రధాని వివరించారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు చేపట్టిన చర్యల్ని వివరించారు. ఇవన్నీ గుర్తించే మూడీస్ సంస్థ రేటింగ్‌ను పెంచిందని గుర్తుచేశారు. ‘‘చివరిగా భారతీయ యువ పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేదొక్కటే. 2022 నాటికి కొత్త భారతాన్ని సృష్టించాలి. దానికి మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయగలరు. భారత మార్పునకు మీరే సారథులు. రండి!! భారత్‌లో తయారీ చేపట్టండి. ఇక్కడ పెట్టుబడి పెట్టండి. భారత వృద్ధిలో భాగస్వాములు కావాలంటూ మీలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా. దీనికి మా మద్దతుంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment