స్టార్టప్‌ ఇండియాను  వాడుకోండి.. | Narendra Modi Interacts with Global CEOs | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌ ఇండియాను  వాడుకోండి..

Published Fri, Sep 27 2019 12:44 AM | Last Updated on Fri, Sep 27 2019 5:12 AM

Narendra Modi Interacts with Global CEOs - Sakshi

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో షెల్‌ సీఈఓ బెన్‌ వాన్‌ బీర్డన్, వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మెక్‌మిలన్,  కోకకోలా చైర్మన్‌–సీఈఓ జేమ్స్‌ క్విన్సీ, ఐబీఎం చైర్మన్‌–సీఈఓ గినీ రోమెటీ (వరుసగా ఎడమ నుంచి)

న్యూయార్క్‌: ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లకు ‘స్టార్టప్‌ ఇండియా’ను ఒక పరిష్కార వేదికగా ఉపయోగించుకోవాలని గ్లోబల్, అమెరికా దిగ్గజ సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా పోషకాహారం, వర్థాల నిర్వహణ వంటి అంశాల్లో నెలకొన్న సవాళ్లకు స్టార్టప్‌ ఇండియా నుంచి వస్తున్న నవకల్పనలు చేదోడునందిస్తాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో పొల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్న మోదీ... బుధవారమిక్కడ 20 రంగాలకు చెందిన 42 మంది గ్లోబల్‌ సీఈఓలతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఇప్పుడు రాజకీయ స్థిరత్వం కొనసాగుతోంది. స్థిరమైన పన్నుల విధానం, అభివృద్ధి కాంక్షతో కూడిన సర్కారు కొలువైఉంది. వృద్ధికి ఊతమిచ్చే చర్యలను చేపడుతున్నాం. పర్యాటకాభివృద్ధి, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణతో పాటు చిన్న,మధ్యతరహా వ్యాపార సంస్థలకు దన్నుగా నిలుస్తున్నాం. ప్రధానంగా రైతులు, వ్యవసాయ రంగాల్లో మరిన్ని అవకాశాలను సృష్టించే సంస్థలను ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ వివరించారు. భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వివరించడంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచేందుకు చేపట్టే చర్యలపై కార్పొరేట్‌ దిగ్గజాలతో మోదీ సమాలోచనలు జరిపారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ట్వీట్‌ చేసింది. 

5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యం... 
భారత్‌ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కీలకమైన పాలసీ చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ సీఈఓలకు తెలియజేశారు. భారత్‌ వృద్థి పథంపై ప్రపంచ కార్పొరేట్‌ రంగం చాలా సానుకూల దృక్పథంతో ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రావీష్‌ కుమార్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) కల్పించడంలో భారత్‌ చర్యలను గ్లోబల్‌ సీఈఓలు ప్రశంసించారు. మోదీ సర్కారు అమలు చేసిన చాలా సంస్కరణలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయని కూడా సీఈఓలు మోదీకి కితాబిచ్చాని పీఎంఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ‘భారత్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం. మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తాం’ అని కార్పొరేట్‌ దిగ్గజాలు స్పష్టం చేసినట్లు తెలిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, అందరికీ ఆర్థిక ఫలాలు, పర్యావరణానుకూల ఇంధనాలు వంటి రంగాలకు చేయూతనందించే విషయంలో కీలక సూచనలను కూడా ఇచ్చారని పేర్కొంది. 
ఎవరెవరు పాల్గొన్నారంటే... 

గ్లోబల్‌ సీఈఓల రౌండ్‌టేబుల్‌లో ఐబీఎం చైర్మన్, సీఈఓ గినీ రోమెటీ; వాల్‌మార్ట్‌ ప్రెసిడెంట్, సీఈఓ డగ్లస్‌ మెక్‌మిలన్‌; కోకకోలా చైర్మన్, సీఈఓ జేమ్స్‌ క్విన్సీ; లాక్‌హీడ్‌ మార్టిన్‌ సీఈఓ మారిలిన్‌ హ్యూసన్‌; జేపీ మోర్గాన్‌ చైర్మన్, సీఈఓ జేమీ డైమన్‌; అమెరికన్‌ టవర్‌ కార్పొరేషన్‌ సీఈఓ, ఇండియా–యూఎస్‌ సీఈఓ ఫోరం కో–చెయిర్‌ జేమ్స్‌ టైక్లెట్‌; మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు యాపిల్, గూగుల్, మారియట్, వీసా, 3ఎం, వార్‌బర్గ్‌ పింకస్, ఏకామ్, రేథియాన్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా–మెరిల్‌ లించ్, పెప్సీ కంపెనీలకు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న కంపెనీల మొత్తం విలువ(నెట్‌వర్త్‌) 16.4 ట్రిలియన్‌ డాలర్లు కాగా, భారత్‌లో వాటి కార్యకలాపాల విలువ 50 బిలియన్‌ డాలర్లుగా అంచనా. 

భారత్‌ అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీ విజన్‌ చాలా గొప్పగా ఉంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా చేపట్టిన వ్యాపార సానుకూల విధానాలు, ఇతరత్రా సంస్కరణలను మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు మేం కూడా మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. భారత్‌ గురించి మా క్లయింట్లు, కస్టమర్ల నుంచి వస్తున్న సానుకూలతను చూస్తుంటే... కచ్చితంగా దేశం పురోగమిస్తుందన్న విశ్వాసం కలుగుతోంది. –  బ్రియాన్‌ మోనిహన్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సీఈఓ 

భారత్‌ మాకు ప్రపంచంలో ఐదో ముఖ్య మార్కెట్‌గా ఉంది. రానున్న కాలంలో ఇది మూడో స్థానానికి చేరే అవకాశం ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ విషయంలో మోదీ ప్రభుత్వ వృద్ధి ఎజెండాకు మద్దతుగా నిలుస్తాం. – జేమ్స్‌ క్విన్సీ, కోకకోలా చైర్మన్, సీఈఓ 

ఇన్వెస్టర్లను భారత్‌కు ఆహ్వానించే విధంగా ప్రధాని మోదీ... సమర్థవంతంగా, హృదయపూర్వకంగా ప్రసంగించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మకత.. ఈ నాలుగు అంశాలు(ఫోర్‌ డీ) పెట్టుబడుల విషయంలో భారత్‌కున్న బలానికి నిదర్శనం అంటూ ప్రధాని చాలా సమర్థంగా తన వాణిని వినిపించారు. ఈ విషయాన్ని మేం ఎప్పుడో విశ్వసించాం. అంతేకాదు మా కంపెనీ వృద్ధికి భారత్‌ చాలా కీలకం కూడా. అందుకే ఇక్కడ పెట్టుబడులను కొనసాగిస్తాం. – బెన్‌ వాన్‌ బీర్డన్, షెల్‌ సీఈఓ

ప్రధాని నరేంద్ర మోదీతో రౌండ్‌టేబుల్‌ భేటీ అత్యద్భుతంగా జరిగింది. భారత్‌ విషయంలో చాలా ఆశావహ దృక్పథంతో ఈ సమావేశానికి హాజరయ్యా. భేటీ తర్వాత ఆశావాదం మరింత పెరిగింది. ప్రతిఒక్కరి సలహాలు, సూచనలను ఎంతో సుహృద్భావంతో మోదీ విన్నారు. వ్యాపార సానుకూలతకు చేస్తున్న చర్యలు ఇరువర్గాలకూ మేలు చేకూరుస్తాయి. ఆయన ఒక నిజమైన నాయకుడు. – గినీ రోమెటీ, ఐబీఎం సీఈఓ

సీఈఓలతో చర్చలకు ప్రధాని మోదీ అత్యంత ఆసక్తి కనబరిచారు. సమావేశం చాలా బాగా జరిగింది. భారత్‌ అనుసరిస్తున్న వృద్ధి ప్రోత్సాహక విధానాలను అభినందిస్తున్నా. భారత్‌లో ప్రాజెక్టుల విషయంలో మేం చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాం. పెట్టుబడులకు చాలా అనుకూల వాతావరణం నెలకొందని భావిస్తున్నా. – మారిలిన్‌ హ్యూసన్,లాక్‌హీడ్‌ మార్టిన్‌ సీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement