సృజనాత్మక యువతరం కోసం!
జనవరి 16న ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ యాక్షన్ ప్లాన్ ఆవిష్కరణ
♦ నూతన ఆవిష్కరణల కోసం యువతకు ప్రోత్సాహం, రుణ సహకారం
♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: యువ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సంపూర్ణ సహకారం అందించే దిశగా ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ పథకానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను 2016, జనవరి 16న ఆవిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. ఈ పథకం ఐటీకో లేక ఏ కొంతమందికో, లేక ఏ కొన్ని నగరాలకో పరిమితం కాదని, దేశవ్యాప్తంగా నలుమూలలా ఉన్న యువతకు తమ వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సాధనంగా నిలుస్తుందని అన్నారు. దీనికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను కోరారు. మనదేశ పరిస్థితులకు తగ్గట్టు సమాజంలోని అత్యంత దిగువస్థాయిలో ఉన్న యువతకూ ప్రయోజనం కలిగేలా దీని విధివిధానాలు రూపొందాయన్నారు. ప్రతినెలా ఇచ్చే రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో మోదీ ఆదివారం ఈ విషయాలు తెలిపారు.
గత పంద్రాగస్టున తాను ‘‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ గురించి సూచనప్రాయంగా చెప్పానని, తర్వాత ‘భారత్ స్టార్టప్ రాజధానిగా కాగలదా? రాష్ట్రాల్లోని యువతలోని సృజనాత్మకతకు స్టార్టప్‌ల రూపంలో వ్యాపార అవకాశాలను అందించగలమా?’ వంటి వాటిపై అధ్యయనం జరిగిందన్నారు. ‘జనవరి 16న ఈ పథకానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను మీ ముందుంచుతాం. దీన్ని దేశంలోని అన్ని ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ వర్సిటీ, ఎన్‌ఐటీలతో అనుసంధానిస్తాం. లైవ్ కనెక్టివిటీ ద్వారా యువత ఎక్కడున్నా వారిని ప్రత్యక్షంగా అనుసంధానిస్తాం. స్టార్టప్‌లకు బ్యాంక్‌లు రుణాలు అందించేలా చూస్తాం.
ఇతర ప్రయోజనాలూ కల్పిస్తాం’ అని తెలిపారు. దీన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు సూచనలివ్వాలని ప్రజలను కోరారు. ఓ పేదకూలీకి సహకరించేలా యువత ఏదైనా ఆవిష్కరిస్తే, దానిని స్టార్ట్ అప్‌గా భావిస్తానని, అలాంటివారికి రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకులను కోరతానని తెలిపారు. తెలివితేటలు నగర యువతకే పరిమితం కాదని, భారత యువతీయువకులందరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు.
వికలాంగులు కాదు.. దివ్యాంగులు
వికలాంగులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ.. ‘వారిలో అత్యద్భుతమైన సామర్థ్యాలు ఉంటాయి. సాధారణ వ్యక్తుల్లో లేని ప్రత్యేక సామర్థ్యాలు వారిలో ఉంటాయి. అందుకే వారిని వికలాంగులు అనకుండా దివ్యాంగులు అనాలి. అదే పేరుకు ప్రాచుర్యం కల్పించాలి’ అన్నారు. స్వామి వివేకానంద జయంతి రోజైన జనవరి 12న ప్రారంభమై జనవరి 16 వరకు రాయిపూర్(ఛత్తీస్‌గఢ్)లో జాతీయ యువజనోత్సవం ‘భారతీయ యువతలో అభివృద్ధి నైపుణ్యాలు, సామరస్యం’గా జరుగుతాయని తెలిపారు. దీనిపై అభిప్రాయాలను నరేంద్ర మోదీ యాప్ ద్వారా తనతో పంచుకోవచ్చన్నారు. దేశప్రజలకు క్రిస్మస్, కొత్త శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక పండుగ ముగియకముందే మరో పండుగ రావడం భారత్ ప్రత్యేకత అన్నారు. ‘ఒక్కోసారి మన దేశానిది పర్వదిన ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనిపిస్తుంద’న్నారు.
ఆ మేస్త్రీది గొప్ప ఆదర్శం
మధ్యప్రదేశ్‌లో ఉచితంగా టాయిలెట్లు నిర్మించి ఇస్తున్న ఒక మేస్త్రీని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భోజ్‌పుర గ్రామానికి చెందిన 65 ఏళ్ల దిలీప్ సింగ్ మాలవీయ తన గ్రామస్తులకు టాయిలెట్ల అవసరాన్ని వివరించి, వారికి ఉచితంగా నిర్మించి ఇస్తున్నాడు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని మాత్రం వారిని కొనక్కోమని చెప్పి, తన పనికి డబ్బులు తీసుకోకుండా నిర్మించి ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన100 మరుగుదొడ్లను నిర్మించాడు. ఇదే విషయాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ‘దిలీప్ సింగ్ మామూలు మేస్త్రీనే. కానీ ఆయన పని ఆదర్శనీయమైనది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు’ అన్నారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు..
► నరేంద్ర దీ యాప్‌ను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని నాతో అనుసంధానం కావచ్చు. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేయవచ్చు. అనేక విషయాలను నేను యాప్‌లో షేర్ చేస్తుంటాను.
► మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో చూపుతున్న శ్రద్ధను వాటి నిర్వహణలో చూపడం లేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయుల విగ్రహాలను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దండి.
► ఎల్పీజీ సబ్సీడీలో ప్రత్యేక నగదు బదిలీ పథకం ద్వారా 15 కోట్ల మంది లబ్ధి పొందారు. ఈ పహల్ పథకం గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించింది.
► పార్లమెంట్లో జరిగిన ఇటీవలి రాజ్యాంగదినోత్సవ చర్చలో పౌరుల హక్కుల విషయంపై విసృ్తతంగా చర్చించారు. అలాగే, పౌరుల విధులు, బాధ్యతల గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంది.