Kothagudem Sathupally Railway Line For Coal Is Ready, Modi Will Launch - Sakshi
Sakshi News home page

భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్‌ రెడీ.. 12న మోదీ చేతుల మీదుగా ప్రారంభం?

Published Thu, Nov 3 2022 12:49 PM | Last Updated on Thu, Nov 3 2022 2:59 PM

Kothagudem Sathupally Railway Line For Coal Is Ready, Modi Will launch - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్‌–సత్తుపల్లి రైల్వే కారిడార్‌ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు.

ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్‌ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్‌–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ ఇదే.  

లారీలకు ప్రత్యామ్నాయంగా.. 
సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్‌కాస్ట్‌ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్‌ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది.
చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్‌.. కొరడాతో విన్యాసం

ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు.  

మొత్తం మూడు స్టేషన్లు 
ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్‌ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్‌ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్‌. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్‌ కాస్ట్‌ మైన్స్‌కు సంబంధించి సైడింగ్‌ స్టేషన్‌ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్‌ బ్రిడ్జిలు, 37 మైనర్‌ బ్రిడ్జిలు, 40 ఆర్‌యూబీలు, 7 ఆర్‌ఓబీలు నిర్మించారు. 

రోజుకు ఐదారు రేక్‌ల బొగ్గు తరలింపు 
రోజుకు ఐదారు రేక్‌ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్‌ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్‌ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్‌ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్‌ చేయనున్నారు.  

ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. 
భద్రాచలం రోడ్‌ స్టేషన్‌ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్‌ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్‌ స్టేషన్‌ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్‌ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement