Sathupally
-
దళిత బంధు తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్
సాక్షి, ఖమ్మం: గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని తెలిపారు. చాలా రాష్ట్రల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్య దేశమా? అని ప్రశ్నించారు. ఎన్నికలులు వస్తుంటాయి, పోతుంటాయని.. పార్టీ ప్రజలకు ఏం చేసిందో గమనించి ఓటు వేయాలన్నారు. దళిత బంధు పథకం తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సత్తుపల్లిలో 70 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దళితుల శ్రేయస్సు గురించి ఎవ్వరూ ఆలోచించలేదన్న కేసీఆర్.. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధుతెచ్చామని తెలిపారు. చదవండి: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే! ‘సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం.. ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. కొందరు ఏవేవో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ గేటు తాకనీయం అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీ ఆయుధం మీ ఓటు. ఓటు వేయడంలో మీదే స్వతంత్ర నిర్ణయం. అహంకారపూరితంగా మాట్లాడేవాళ్లకు బుద్ధి చెప్పండి. డబ్బు, మందు పంచితే ఓట్లు వేసేస్తారా?. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. డబ్బు, అహంకార రాజకీయాలు ఎన్నాళ్లు చెల్లుతాయి. గతంలో కరెంట్ ఏ విధంగా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది. దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ప్రధాని మోదీకి ప్రవేటైజేషన్ తప్ప మరేం తెలీదు. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లు వస్తే ధరణీని తీసేస్తారంట. ధరణి లేకుంటే రైతుబంధు డబ్బులకు ఇబ్బంది పడాల్సిందే. ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. ధరణి ఉండాలా.. వద్దా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. -
భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే కారిడార్‌ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇదే. లారీలకు ప్రత్యామ్నాయంగా.. సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్‌కాస్ట్‌ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు. మొత్తం మూడు స్టేషన్లు ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్స్‌కు సంబంధించి సైడింగ్ స్టేషన్ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్‌యూబీలు, 7 ఆర్ఓబీలు నిర్మించారు. రోజుకు ఐదారు రేక్‌ల బొగ్గు తరలింపు రోజుకు ఐదారు రేక్ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్‌ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్‌ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది. -
ట్రాక్టరే కాదు పొక్లెయినర్ నడపటం కూడా వచ్చు: రేణుకా చౌదరి
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి): ‘సత్తుపల్లి సింగరేణి బాధితులకు ఇళ్లు కట్టిస్తే సరి.. లేకపోతే నాకు ట్రాక్టర్‌తో పాటు పొక్లెయినర్ నడపటం కూడా వచ్చు.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా..’ అని కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకాచౌదరి హెచ్చరించారు. సత్తుపల్లిలో సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ అధ్యక్షతన నియోజకవర్గ ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరికైనా ఏమైనా అయితే రేణుక నుంచి రేవంత్‌రెడ్డి వరకు ఇక్కడకు వస్తామని భరోసా ఇచ్చారు. డబ్బు తీసుకుని ఓట్లు వేయటం వల్లే ఇలాంటి పాలకులు వస్తున్నారని, ఇక సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో విలువైన ఓటుహక్కును దుర్వినియోగం చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా మానవతారాయ్‌ను ఎన్నుకోవాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటుకు యత్నిస్తానని తెలిపారు. ట్రాక్టర్ నడుపుతున్న రేణుకాచౌదరి, పక్కన మానవతారాయ్ తదితరులు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి సింగరేణి నిధుల వినియోగంపై ఇప్పటికే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశానని మానవతారాయ్ తెలిపారు. పదమూడేళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి పేదలకు గజం కూడా పంచలేదని మండిపడ్డారు. సభలో నున్నా రామకృష్ణ, మానుకొండ రాధాకిశోర్, ఎడవల్లి కృష్ణ, మద్ది శ్రీనివాసరెడ్డి, రావి నాగేశ్వరరావు, గాదె చెన్నారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కట్ల రంగారావు, బుక్కా కృష్ణవేణి పాల్గొన్నారు. మట్టి అక్రమాలపై చర్యలు ఉండవా? రఘునాథపాలెం: ఖమ్మం శివారు పువ్వాడనగర్ గుట్టలపై అనుమతికి మించి మట్టి తవ్వినట్లు అధికారులు గుర్తించినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రశ్నించారు. మండలంలోని కోయచెలక రెవెన్యూ పరిధి పువ్వాడనగర్ గుట్ట వద్ద క్వారీని సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈ విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నాయకులు మానుకొండ రాధాకిశోర్, దీపక్‌చౌదరి, మిక్కిలినేని నరేంద్ర, మందా బుచ్చిబాబు, మాధవిరెడ్డి, వాంకుడోత్ దీపక్‌నాయక్, దుంపటి నగేశ్ పాల్గొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఖమ్మంరూరల్: ఇటీవల హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. మండలంలోని తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించి మాట్లాడారు. పోలీసులు ఇకనైనా రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ, కళ్లెం వెంకటరెడ్డి, ధరావత్ రాంమూర్తినాయక్, మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముంచుకొస్తున్న ముహూర్తాల గడువు.. ఎక్కడ చూసినా మంగళవాయిద్యాలే..
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి టౌన్): మొన్నటి దాకా కరోనా ఉధృతి, మంచి ముహుర్తాలు లేక శుభకార్యాలు నిలిచిపోగా.. ఇప్పుడు శుభ ఘడియలు వచ్చేశాయి. అయితే, శనివారంతో పాటు ఆది, సోమవారాల్లో మూడు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మాఘమాసం ఈనెల 21వ తేదీ సోమవారంతో ముగుస్తుండటంతో శుభకార్యాల సందడి జోరందుకుంది. జిల్లాలోని పల్లెలు, పట్టణాలలో ఎక్కడ చూసినా శుభకార్యాల సందడి కనిపిస్తోంది. ముందస్తుగా సంబంధాలు కుదుర్చుకున్న వారు ముమ్మర ఏర్పా ట్లు చేసుకున్నారు. దీంతో బాజాభజంత్రీల మోత మోగుతోంది. శుభఘడియలకు ఈ మూడురోజులు అనుకూలంగా ఉండడంతో వేలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ఏర్పాట్లుచేసుకోగా, శనివారం పలుచోట్ల సందడి కనిపించింది. కోలాహలం.. వివాహాలు ఊపందుకుంటే.. వంట మేస్త్రీలు, క్యాటరింగ్, డెకరేషన్ పనివార్లు, ఫొటోగ్రాఫర్లకు, భజంత్రీల వారికి మళ్లీ పనులు ఊపందుకున్నాయి. పురోహితులు బిజీబిజీ అయిపోయారు. పూలు విక్రయించేవారు తదితర సీజనల్ వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. ఎవరిని కదలించినా ఈ మూడురోజుల తర్వాతేనంటూ సమాధానం వస్తోంది. ఫంక్షన్ హాళ్లు, వస్త్ర దుకాణాలు, కిరాణ, బంగారం దుకాణాలు కళకళలాడుతూ కనిపించాయి. ప్రస్తు తం కరోనా ఆంక్షలు కూడా లేకపోవడంతో బంధుమిత్రులతో సందడి వాతావరణం ఏర్పడింది. ఆహ్వానాలు అధికమే.. చాన్నాళ్ల తర్వాత శుభకార్యాలు ఉండడంతో ఎక్కువ సంఖ్యలో ఫంక్షన్లు పెట్టుకున్నారు. ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలు మొదలు గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు ఇలా వరుస ఆహ్వానాలు అనేకమందికి వచ్చాయి. ఒకే రోజు పలు ఫంక్షన్లు ఉండడంతో ఎటు వెళ్లాలి? అనే తర్జన భర్జన నెలకొందని కొందరంటున్నారు. మొత్తానికి ముహూర్తాలు మళ్లీ అంతా కలిసి హాజరయ్యే హడావిడిని తెచ్చేశాయి. ఈ రెండు రోజులూ ఎక్కువే.. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు ఈ మూడురో జులు చాలా ఎక్కువగా ఉన్నా యి. ముందుగానే బుకింగ్ చేసుకున్నవారి దగ్గరకే వెళ్లాల్సి వస్తోంది. శుభఘడియలు తక్కువగా ఉన్నందున బిజీబిజీ అయ్యాం. శనివారం పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఆది, సోమవారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. – రామడుగు గురుప్రసాదాచార్యులు, పురోహితుడు, సత్తుపల్లి -
ట్రయల్ రన్ సక్సెస్ !
సుజాతనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు రైలు మార్గం నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి దశలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 55.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి సింగరేణి, రైల్వే శాఖల ద్వారా రూ.875 కోట్లు కేటాయించారు. ఈ మేరకు లైన్ పనులు పూర్తికాగా, కొత్తగూడెం నుంచి సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి వరకు పూర్తిస్థాయిలో లైన్ సిద్ధమైంది. దీంతో రైల్వే అధికారులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. భద్రాచలం రోడ్డు నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు గూడ్స్ బోగీలు, ఇంజన్ నడిపించగా ప్రజలు ఆసక్తిగా చూశారు. కాగా, కొవ్వూరు రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యాన 1980 నుంచి రైల్వే లైన్ కోసం అనేక పోరాటాలు చేపట్టగా, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాచలం రోడ్ నుంచి కొవ్వూరు వరకు 150 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించాల్సి ఉండగా... ప్రస్తుతం సత్తుపల్లి వరకు అంటే 55.2 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందులో సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వరకు రైలు పట్టాలు కూడా సిద్ధం కావడంతో ట్రయల్ రన్ చేపట్టారు. కాగా, ఈ ప్రాంతంలో వెలికితీసే బొగ్గును ప్రస్తుతం లారీల ద్వారా తరలిస్తున్నారు. రైల్వేమార్గం అందుబాటులోకి వస్తే బొగ్గు రవాణా సులభతరం అవుతుంది. అలాగే, తెలంగాణ నుంచి ఏపీకి ఈ మార్గంలో వెళ్లే 150 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. -
రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7 కోట్ల విలువైన నకిలీ నోట్లు, రెండు కార్లను ఖమ్మం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన ట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ శనివారం మీడియాకు తెలిపారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెం గ్రామానికి చెందిన షేక్ మదార్ గత 20 ఏళ్లు గా నకిలీ నోట్లు చలామణీ చేస్తున్నాడని, తన వద్ద నకిలీ నోట్లున్నాయని చెబుతూ, అసలు నోట్లకు 5 రెట్ల నకిలీ నోట్లు ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడని వివరించారు. ప్రజల నుంచి డబ్బులు తీసుకున్నాక నకిలీ నోట్లు ఇవ్వకుండా మోసం చేస్తూ.. ఎదురు తిరిగితే కత్తులు, చాకులతో బెదిరించేవాడని తెలిపారు. ఈ తరహా మోసాలు చాలా కాలం గా తన భార్య మస్తాన్‌బీ, కొడుకు రమీజ్, మే నల్లుడు నౌషద్, తోట హన్మంతరావు, అఖిల్, గాయం వెంకటనారాయణ, మోడెం సాయమ్మలతో కలసి చేస్తూ అక్రమంగా సంపాదించాడని సీపీ వివరించారు. భారీగా మోసాలు రూ. 2 వేల నోట్లు రద్దవుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో మదార్ భారీగా నకిలీ 2 వేల రూపాయల నోట్లను నిల్వ చేశాడని, వాటిని బ్లాక్ మనీగా ప్రచారం చేసి వైట్ మనీగా మా ర్చే ప్రయత్నం చేసేవాడన్నారు. ఇతడికి అంతర్రాష్ట్ర ముఠాలతో కూడా సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. -
‘గూగుల్’ అధికార ప్రతినిధిగా..
సాక్షి, సత్తుపల్లి: గూగుల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ నోడ్‌జేఎస్ అధికార ప్రతినిధిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన చీళ్ల భానుప్రకాష్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ ఆన్లైన్లో స్క్రీనింగ్ ద్వారా నాలుగు రౌండ్లలో జరిగిన ఇంటర్వ్యూలలో ఎంపిక జరిగింది. నోడ్‌కోర్ కమిటీ, నోడ్‌జేఎస్ ప్రోగ్రామింగ్ ప్రాసెస్ ప్రాబ్లం సొల్యూషన్స్ నూతన ఆవిష్కరణలు చేయటం వల్ల ఎంపికయ్యాడు. సుమారు 6 నెలలపాటు జరిగిన దశలవారీ ఎంపిక విధానంలో చీళ్ల భానుప్రకాష్ ప్రతిభ చూపటంతో ప్రపంచవ్యాప్తంగా 15 మందితో కూడిన గూగుల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు అధికార ప్రతినిధిగా భారతదేశం నుంచి ఎంపికయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే కాన్ఫరెన్స్, సెమినార్లకు హాజరయ్యేందుకు ట్రావెలింగ్, వసతి సౌకర్యాలతో పాటు రూ.1.50 లక్షలు గౌరవ వేతనంగా అందిస్తారు. నోడ్ జేఎస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్‌లో గూగుల్ సర్వర్‌సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్ కమిటీ సభ్యుడిగా అప్డేట్స్, ఛాలెంజెస్ సొల్యూషన్స్, నూతన ఆవిష్కరణలు చేస్తుంటాడు. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఏడీపీ ఇండియా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌లో అప్లికేషన్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ‘మై ఫస్ట్ రెస్పాండర్’యాప్‌తో.. చీళ్ల భానుప్రకాష్ సత్తుపల్లిలోనే ప్రాథమిక విద్య నుంచి బీఎస్సీ విద్యనభ్యసించాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్ ప్రవేశ పరీక్షల్లో ఆంధ్రా యునివర్సిటీ నుంచి 4వ ర్యాంక్, కాకతీయ యూనివర్సిటీ నుంచి 56వ ర్యాంక్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 52వ ర్యాంక్, పాండిచేరి యూనివర్సిటీ నుంచి 2వ ర్యాంక్ సాధించాడు. 2010 నుంచి 2014 వరకు అరోరా కళాశాలలో ఎంసీఏ పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి గోల్డ్‌మెడల్ సాధించాడు. ఏడీపీ ఇండియా డైరెక్టర్ బత్తుల పోల్‌రెడ్డి ఆర్థిక సహకారంతో ‘మై ఫస్ట్ రెస్పాండర్’యాప్ తయారు చేశాడు. దీంతో ఆర్అండ్బీ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్‌ఎంబీఏ, తుపాన్లు, వరదలు, రోడ్లు ప్రమాదాల లాంటి 15 సమస్యలకు పరిష్కారాలకు ఈ యాప్ ద్వారా తెలియచేయవచ్చు. ఈ యాప్‌తో హైదరాబాద్‌లో జరిగిన ‘నాస్కమ్‌టెక్‌నగరే’ హ్యాథాన్ సదస్సులో రూ.3 లక్షల మొదటి బహుమతిని అందుకున్నాడు. జర్మనీ దేశంలోని ఐర్లాండ్‌లో గల డైరీ మాస్టర్ సంస్థ భానుప్రకాష్‌ను పీహెచ్డీ స్కాలర్ కింద ఎంపిక చేసింది. -
స్వచ్ఛతలో సత్తుపల్లి ర్యాంకెంత..?
సాక్షి, సత్తుపల్లి: కేంద్ర ప్రభుత్వం సత్తుపల్లి స్వచ్ఛతకు పట్టం కట్టింది. బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్–2019 ర్యాంకుల్లో సత్తుపల్లి మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో 65 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 4,041 మున్సిపాలిటీతో పోటీపడి 4వేల మార్కులకు 2214.58 మార్కులు సాధించింది. అదేవిధంగా జాతీయస్థాయిలో ఇల్లెందు(389వ ర్యాంక్), మణుగూరు(953వ ర్యాంక్), కొత్తగూడెం(339వ ర్యాంక్), మధిర(501వ ర్యాంక్), పాల్వంచ(967వ ర్యాంక్) పొందాయి. జనవరిలో సర్వే జరిపిన కేంద్ర ప్రత్యేక బృందాలు.. స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకు కేటాయించేందుకు జనవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్వే సంస్థ మున్సిపాలిటీలో సర్వే నిర్వహించింది. సెల్‌ఫోన్‌తో ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 200 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించింది. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, బహిరంగ మల విసర్జన, తాగునీటి సరఫరా, తడి, పొడి చెత్తల సేకరణ, డంపింగ్ యార్డ్, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మున్సిపాలిటీ : సత్తుపల్లి విస్తీర్ణం : 18.90 చదరపు కిలోమీటర్లు జనాభా : 31,893 వార్డులు : 20 నివాసాలు : 7,202 పారిశుద్ధ్య సిబ్బంది : 115 మంది వాటర్ ట్యాంకర్లు : 2 పారిశుధ్య వాహనాలు : రిక్షాలు–12, ఆటోలు–2, డంపర్బిన్లు–20, డీసీఎం–1, ట్రాక్టర్లు–4 రోజువారీ సేకరించే చెత్త : 14 టన్నులు చాలా సంతోషంగా ఉంది దేశంలోనే సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో ఉత్తమ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది. వరంగల్ రీజియన్‌లో సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో మూడవ స్థానం లభించినందుకు గర్వంగా ఉంది. కౌన్సిలర్లు, ఉద్యోగులపై మరింత బాధ్యత పెరిగింది. ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ ర్యాంక్‌ను సాధించగలిగాం. – దొడ్డాకుల స్వాతి, చైర్పర్సన్, సత్తుపల్లి మున్సిపాలిటీ అందరి కృషితోనే సత్తుపల్లి మున్సిపాలిటీలోని అధికారులు, కార్మికులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఉత్తమ ర్యాంక్ సాధించగలిగాం. ఇదే స్ఫూర్తితో మరింత సుందరంగా సత్తుపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. పట్టణాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి. – చీమా వెంకన్న, కమిషనర్, సత్తుపల్లి మున్సిపాలిటీ -
రైల్వే లైన్ వేగవంతం..
సింగరేణి(కొత్తగూడెం): సత్తుపల్లి–భద్రాచలం రోడ్ (కొత్తగూడెం రుద్రంపూర్) రైల్వే పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులను అధికారులు వేగవంతం చేయనున్నారు. రైల్వే అధికారులు దాదాపు సర్వే పను లు పూర్తి చేశారు. 53 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ లైన్‌కు 50 శాతం భూసేకరణ పనులు పూర్తయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఇంకా మిగిలిన పనులను రైల్వేశాఖ త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిసింది. అయితే సత్తుపల్లి ఏరియాలో బొగ్గు రవాణా రోజు రోజుకు పెరుగుతు న్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని సింగరేణి అధికారులు భావించి రూ.618.55 ఖర్చు చేయటానికి సంసిద్ధపడి దానిలో రూ.156. 38 కోట్లను చెల్లించింది. ఈ రైల్వే లైను పొడవు సుమారు 53.50 కిలోమీటర్లకు రూ.704.31 కోట్లు అవుతుందని అంచనా. వీటిలో 16 జూలై 2018 వరకు సింగరేణి సంస్థ రూ.156.38 కోట్లు చెల్లించింది. ఈ పనులు పూర్తయితే 2020 సంవ త్సరం నాటికి సుమారు 15 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయనున్నట్లు రైల్వే, సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సింగరేణికి బొగ్గు రవాణా ఖర్చు లక్షల్లో ఉంటుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30 వేల టన్నుల బొగ్గు రవాణా ప్రస్తుతం కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్‌ఓసీ–1, 2లలో రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు 800 (చిన్న, పెద్ద) లారీలలో రుద్రంపూర్‌లోని ఆర్‌సీహెచ్‌పీకి వస్తుంది. ఈ రవాణా పక్రియలో ప్రమాదాల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగాయని కార్మికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బొగ్గు లారీల రాకపోకల వలన దుమ్ము, ధూళి వచ్చి పర్యావరణం దెబ్బతినటమే కాకుండా రోడ్డు వెంట నివసించే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అదేవిధంగా శబ్దకాలుష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి వచ్చిన ప్రజలకు నిద్ర ఉండటంలేదని వాపోతున్నారు. ఈ పనులు పూరయ్తితే వీటన్నిటికి ఉపశమనం జరుగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లిలో మరో నాలుగు ఓసీలకు రంగం సిద్ధం సత్తుపల్లిలో జలగం వెంగళరావు ఓసీ–1ను 2006లో సింగరేణి సంస్థ ప్రారంభించి ఏడాదికి సుమారు 50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. ఇదేక్రమంలో 2017లో జేవీఆర్ ఓసీ–2లో ఉత్పత్తిని ప్రారభించింది. దీని జీవితకాలం సుమారు 29 సంవత్సరాలు. సంవత్సరానికి సుమారు ఒక మిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ –3 కొమ్మేపల్లి ప్రాంతంలో మరో మూడేళ్లలో ఇక్కడ కూడా ఓసీ ప్రారంభం కానుంది. అదేవిధంగా కిష్టారం ఓపెన్‌కాస్ట్, ఇవన్నీ కలుపుకొని ఏరియాలో రానున్న మరో నాలుగేళ్లలో 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణాకు సన్నాహాలు చేస్తున్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తిచేసే బొగ్గును లారీల ద్వారా కాకుండా రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేస్తే సంస్థకు లక్షలాది రూపాయల లాభంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పడుతుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందనున్న పలు గ్రామాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాలోని గ్రామాలను కలిపే ఈ రైల్వే మార్గం వల్ల కొత్తగూడెం, చండ్రుగొండ, మద్దుకూరు, అన్నపురెడ్డిపల్లి, లంకపల్లి, మండలాల గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. దీనివలన పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగనుంది. -
మళ్లీ.. ‘సత్తుపల్లి’!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్త జిల్లాను ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాలను ప్రకటించిన సమయంలోనే సత్తుపల్లిని మరో జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేసినా.. జిల్లాగా ప్రకటించని పరిస్థితి. శాసనసభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు కొత్త జిల్లాల ప్రస్తావన తేవడంతో సత్తుపల్లి వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తమ ప్రాంతాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన సందర్భంగా సత్తుపల్లి జిల్లా డిమాండ్ తెరపైకి వచ్చింది. చిన్న ప్రాంతాలను కూడా జిల్లాలుగా చేయడంతో సత్తుపల్లి ప్రాంతాన్ని కూడా జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతు పెరిగింది. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలు కలిపి 5,09,871 మంది జనాభా ఉన్నారు. 3,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 244 గ్రామ పంచాయతీలు, 10 మండలాలతో జిల్లా చేయాలని.. అదనంగా గంగారం, మొద్దులగూడెం, లంకపల్లి, చెన్నూరు, కుర్నవల్లి, పట్వారిగూడెం, వినాయకపురం మండలాలుగా చేయాలని ఆ సమయంలోనే ఉద్యమించారు. ప్రజలకు జిల్లా కేంద్రం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారని ఈ ప్రాంతవాసులు గుర్తు చేస్తున్నారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ప్రకటించారని, అయితే ప్రస్తుతం తమ ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి చాలా దూరం ఉందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెంకు వెళ్లాలంటే 100 కిలోమీటర్ల దూరం ఉంది. సత్తుపల్లి నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మారుమూల ప్రాంతాల నుంచి 110 కిలోమీటర్ల దూరం ఉంది. సత్తుపల్లిని జిల్లా చేస్తే కేవలం 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకే దూరం ఉంటుందనే వాదనను వినిపిస్తున్నారు. అలాగే అశ్వారావుపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే రిలే దీక్షలు.. నారాయణ్‌పేట్, ములుగు జిల్లాల ప్రకటనతో సత్తుపల్లి జిల్లా ప్రతిపాదనపై రాజకీయ పార్టీల స్వరం పెరిగింది. సత్తుపల్లిని జిల్లా చేయాలని 2016, అక్టోబర్ 29 నుంచి 2017, మార్చి 6వ తేదీ వరకు 129 రోజులపాటు 114 ప్రజా సంఘాలు రిలే నిరహార దీక్షలు చేపట్టాయి. సత్తుపల్లిలో 48 గంటల బంద్ పాటించారు. జిల్లా చేయాలని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దీక్షలకు సంఘీభావం తెలపడమే కాకుండా.. అసెంబ్లీలో ప్రస్తావించారు. మళ్లీ జిల్లాల పునర్విభజన చేపడితే సత్తుపల్లిని జిల్లా చేయిస్తామనే హామీతో దీక్షలను విరమించారు. అప్పటి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, జలగం ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు శిబిరాన్ని సందర్శించి.. సంఘీభావం ప్రకటించారు. మళ్లీ తెరపైకి.. రెండోసారి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలోని ములుగు, నారాయణ్పేట్లను జిల్లాలుగా మార్చేందుకు అధికారిక కసరత్తు ప్రారంభించడంతో ఇక సత్తుపల్లి జిల్లాగా రూపాంతరం చెందే అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. సత్తుపల్లి జిల్లా కావాల్సిన ఆవశ్యకతపై అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై ఉండడం.. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి జిల్లా చేసేందుకు అవసరమైన జనాభా, భౌగోళిక పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో జిల్లా అయ్యే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. పాల్వంచ మండల పరిధిలో ఇసుక ట్రాక్టర్ మోటార్ సైకిల్‌ను ఢీకొని ఇరువురు దుర్మరణం పాలవగా, దుమ్ముగూడెం మండలంలో ఒకరు, సత్తుపల్లి మండలంలో రెండు లారీలు ఢీ కొని డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. పాల్వంచ: మోటారు సైకిల్‌పై వెళుతున్న వారిని ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దమ్మపేట సెంటర్లో గల భవాని వైన్‌షాప్‌లో ములకలపల్లికి చెందిన గుండుమళ్ల సురేందర్‌రెడ్డి (28), చాపరాలపల్లికి చెందిన నల్లమోతు శివశంకర్ (26) పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి పని ముగించుకుని 12.30 సమయంలో మోటారు సైకిల్‌పై బయలుదేరారు. శ్రీనివాసకాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై ముత్యం రమేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. అనుకోని రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని విలపిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కలచివేసింది. సురేందర్‌రెడ్డికి భార్య, కూతురు ఉన్నారు. ట్రాక్టర్ల అతివేగమే ప్రాణాలు తీశాయి.. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు అతివేగంగా నడిపిస్తుండటం వల్లే ఈ ప్రమాదం వాటిల్లినట్లు స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళ లైట్లు వేయకుండా, రాంగ్ రూట్లో గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు ట్రాక్టర్లు కన్పించక ప్రమాదం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ముర్రేడువాగు నుంచి ఇసుక ట్రాక్టర్లలో అక్రమ రవాణాను నియంత్రించడంలో అధికారులు విఫలం కావడంవల్ల ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములకలపల్లిలో అలుముకున్న విషాదం.. ములకలపల్లి: ఇసుక ట్రాక్టరు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలవ్వడంతో ములకలపల్లిలో విషాదం అలుముకుంది. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలానికి తీసుకురావడంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేందర్‌రెడ్డికి భార్య లీలారాణి, ఏడాది వయసుగల కూతురు ఉన్నారు. శివశంకర్ అవివాహితుడు. చేతికొచ్చిన కొడుకుల మృతితో ఇరువురి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కాగా ఇద్దరి కుటుంబాల్లోనూ ఒక్కరే మగసంతానం. దుమ్ముగూడెం మండలంలో ఒకరు... పర్ణశాల: దుమ్ముగూడెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలంలోని తేగడకు చెందిన గంగుల వివేక్ భద్రాచలం సుందరయ్యనగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం మండలంలోని మారాయిగూడెం సమ్మక్క సారలమ్మ ఆలయానికి వివేక్ తన స్నేహితుడు దుర్గాప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో రామచంద్రునిపేట గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వివేక్ అక్కడిక్కడే మృతి చెందగా, దుర్గాప్రసాద్‌కు తీవ్ర గాయాలైనాయి. మృతిడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాలకృష్ణ ఆటో డ్రైవర్ కట్టం బాలుపై సోమవారం కేసు నమోదు చేశారు. రెండు లారీలు ఢీకొని డ్రైవర్ .. సత్తుపల్లిరూరల్: రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సత్తుపల్లి ఏఎస్సై బీరెల్లి బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేటలో చెరకులోడ్ చేసుకొని కల్లూరుకు వెళ్తుండగా లారీని.. గ్రానైట్ రాళ్లను అన్లోడ్ చేసి కాకినాడ నుంచి కరీంనగర్‌కు వెళుతున్న లారీ బేతుపల్లి గ్రామ శివారులో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. దీంతో కరీంనగర్ జిల్లా జన్నారం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బొద్దుల అంజయ్య(40) మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..
సత్తుపల్లి: ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.. మీ అందరికి అందుబాటులోనే ఉంటా.. నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..? ఓటమి కొత్తేమీకాదు.. ఎన్నికల్లో అపజయం బాధకలిగించింది.. అయినా ఎవరికి విశ్రాంతి లేదు..’ టీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పిడమర్తి రవి అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రభుత్వ పథకాలన్నీ రాబోయే రోజుల్లో మీ అందరికి అందిస్తామన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి ఎక్కడ ఆయన మాట చెల్లుబాటు కాదన్నారు. రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. అప్పటి వరకు విశ్రమించేదే లేదని.. సత్తుపల్లిలో నివాసం ఉండి టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పటికే ఎస్‌డబ్ల్యూఎఫ్ రూ.25 కోట్లు నిధులు, రూ.10 కోట్లు సింగరేణి షేప్ నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలో పనులు చేపడతామన్నారు. రెండు జోన్లకు నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పటం హాస్యాస్పదంగా ఉందని.. ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన పని చేయకుండా అడగటం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, వెల్ది జగన్మోహన్రావు, జ్యేష్ట అప్పారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, ఎస్కే మోనార్క్ రఫీ, రవీందర్‌రెడ్డి, మారుతి బాబురావు, దొడ్డాకుల గోపాలరావు, వినుకొండ కృష్ణ, మోరంపూడి ప్రభాకర్, ఎస్కె జాని పాల్గొన్నారు. నిరంతరం ప్రజలతోనే ఉంటా పెనుబల్లి: గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజలతోనే ఉంటానని పిడమర్తి రవి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆదివారం మొదటిసారిగా మండలానికి వచ్చిన ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ సమస్యల సాధనకే కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసిన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
‘ప్రజల అభీష్టం మేరకే ఆనాడు పార్టీ మారాను’
సాక్షి, ఖమ్మం : ప్రజల అభీష్టం మేరకే ఆనాడు పార్టీ మారవలసివచ్చిందని ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిడమర్తి రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. త్వరలో టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో సత్తుపల్లిలో సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యకర్తలు ఎన్నికలను నిర్లక్ష్యంగా తీసుకుంటే మరల రాబోయే కేబినేట్లో తను ఉండనని అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల వల్లే సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఆ విధంగా నడుచుకోవాలని సూచించారు. పదవులు కోరుకున్న నాయకులు అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు మట్ట దయానంద్‌తో కూడా చర్చలు జరిపామని చెప్పారు. తాను అవసరం కోసమో, అవకాశాల కోసమో రాజకీయాలను ఏనాడూ తార్పిడి చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలంటే మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే సత్తుపల్లి నియోజకవర్గానికి అధిక ప్రాముఖ్యత ఉందని వ్యాఖ్యానించారు. -
ఫిరాయింపు పార్టీలకు చరమగీతం పాడాలి: సండ్ర
సత్తుపల్లి: రాజకీయ ఫిరాయింపులతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల మీద భారం వేస్తున్న పార్టీలకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. సత్తుపల్లి మండలం రామనగరం గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి టీడీపీ ప్రజాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, కలిసి వచ్చే శక్తులను కలుపుకుని తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. ఎన్నికలకు గడువు ఉన్నా ముందస్తు ఎన్నికలకు ఎందుకు ప్రయత్నిస్తుందో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రాజకీయ సేవ చేసే ప్రజా నాయకులకు పదవీ వ్యామోహం ఉండదు..ప్రజాసేవలోనే రాజకీయ నాయకుడికి తుది శ్వాస విడిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. -
పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సండ్ర హల్చల్
సత్తుపల్లి: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం హల్చల్ చేశారు. ఓ కేసుకు సంబంధించి కొందరిని ఎస్సై నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. వారిలో అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. అధికార పార్టీ వారిని వదిలిపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులను మాత్రం స్టేషన్లోనే ఉంచారు. వారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్ చేసి చెప్పారు. ‘‘ఎస్సైకి ఫోన్ ఇవ్వండి’’ అని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే సండ్ర, లైన్లో ఉన్నారంటూ ఫోన్‌ను ఎస్సైకి ఆ అనుచరులు ఇవ్వబోయారు. ఎస్సై తీసుకోలేదు. ఇదే విషయాన్ని సండ్రకు అనుచరులు చెప్పారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన సండ్ర వెంకటవీరయ్య, వెంటనే సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లారీ యూనియన్ కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతున్నదన్న సమాచారంతో అప్పటికే అక్కడకు ఎస్సై వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై లేకపోవడంతో ఆయన సెల్‌కు సండ్ర ఫోన్ చేశారు. ఎత్తకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఈ స్టేషన్ వ్యవహారాలు చూసేది ఎస్సైనా? అధికార పార్టీ కార్యకర్తలా? ఎమ్మెల్యే ఫోన్‌కు ఎస్సై స్పందించకపోతే ఎలా..? దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకనా..?’’ అంటూ, అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పూచీకత్తుపై అధికార పార్టీ వారిని పంపిస్తారు. మా వాళ్లను మాత్రం పంపించకుండా నిర్బంధిస్తారా..?’’ అంటూ మండిపడ్డారు. దీనిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. పోలీస్ స్టేషన్ నుంచే కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏమిటంటే... సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో నలుగురిని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని వెళ్లారు. టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరిని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఇది, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కోపం తెప్పించింది. ఆయన తన అనుచరులతో స్టేషన్‌కు వచ్చారు. ఫోన్ సిగ్నల్స్ లేవు.. దీనిపై ఎస్సై నరేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘లారీ యూనియన్ కార్యాలయం వద్ద రాస్తారోకో జరుగుతున్నదని తెలియడంతో నేను అక్కడకు వెళ్లాను. అక్కడ సెల్ సిగ్నల్స్ లేకపోవటంతో నాకు ఎటువంటి ఫోన్ రాలేదు’’ అని చెప్పారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
సత్తుపల్లి: అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయటంతో ఓ యువకుడు మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ ఎం.వెంకటనర్సయ్య కథనం ప్రకారం సత్తుపల్లి పట్టణానికి చెందిన కటికల రాజేష్(27) టాటా మోటర్స్ ఖమ్మంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మృతుడు రాజేష్ సత్తుపల్లికి చెందిన అజయ్‌కుమార్‌కు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తానని రూ.20 వేలు తీసుకున్నాడు. సోనాలిక ట్రాక్టర్ ట్రాన్స్‌పోర్టు మేనేజర్ శివారెడ్డికి ఒక ట్రాక్టర్‌కు సంబంధించిన ఫైనాన్స్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. అదేవిధంగా మోటారు సైకిల్ మెకానిక్‌లు అజార్, సుధాకర్ల వద్ద రూ.10 వేలు చొప్పున అప్పు తీసుకున్నాడు. మరో పదిమంది వద్ద రుణాలు ఇప్పిస్తానని అప్పు చేసినట్లు తెలిసింది. సత్తుపల్లి నుంచి ఖమ్మంకు మకాం మార్చాడు. సోమవారం రాజేష్ సత్తుపల్లి వచ్చాడని అప్పులు ఇచ్చినవాళ్లు తెలుసుకొని డబ్బులు చెల్లించాలని పట్టుపట్టడంతో వాగ్వాదం జరిగింది. 100కు ఫోన్.. మృతుడు తల్లి విమలాదేవి 100కు ఫోన్ చేసి మా ఇంటి వద్ద గొడవ జరుగుతుందని చెప్పటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజేష్ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోవటంతో కంగారుపడిన తల్లి దండ్రులు రాజేష్‌తో మాట్లాడించే ప్రయత్నం చేస్తుండగానే తలుపు తీయకుండా గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి బిగించుకుంటున్నాడు. కిటికిలో నుంచి గమనించి రాజేష్‌ను కాపాడేందుకు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లే సరికే అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళుతుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రాజేష్ మృతికి అప్పులు ఇచ్చిన వారు బలవంతం చేయటమే కారణం అంటూ తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ టోకరా
సత్తుపల్లి: ఓపెన్‌కాస్టులో భూమిని కోల్పోతే.. బదులుగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. పునరావాసం కింద ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తిస్తుంది.. ఇళ్ల స్థలంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తారు. ఇదంతా నూతన భూ సేకరణ చట్టంలోనే ఉంది. ఉద్యోగం ఇవ్వనిపక్షంలో బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చు. తీర్పు మేరకు సింగరేణి యాజమాన్యం చేపట్టనున్న ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయి. దీంతో యాజమాన్యం దిగొచ్చి డిమాండ్లు తీరుస్తుంది. 200 గజాల స్థలం రూ.3లక్షలకు తీసుకుంటే.. పైన చెప్పినవన్నీ వర్తిస్తాయంటూ.. ఓ రియల్టర్ మాయమాటలతో నమ్మించగా.. అక్షరాల రూ.2.04కోట్లు బాధితులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదంతా సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘అవార్డు ఎంక్వైరీ’లో వెలుగు చూసింది. ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన కొడుకు భవిష్యత్ కోసం రిటైర్మెంట్ సొమ్ములో నుంచి రూ.3లక్షలు చెల్లించి.. 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొడుకుకు ఉద్యోగం వస్తుందనే ఆశతో స్థలం కొన్నట్లు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. కిష్టారం ఓపెన్‌కాస్టులో.. ఓపెన్ కాస్టు వల్ల సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం గ్రామం మొత్తం కనుమరుగవుతోంది. ఐదారేళ్ల నుంచి భూ సేకరణపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగా పలు దఫాలుగా గ్రామసభలు నిర్వహించారు. కిష్టారం ఓపెన్‌కాస్టులో జగన్నాథపురం రెవెన్యూలోని పట్టా భూమి 91.08 ఎకరాలు, అసైన్డ్ భూమి 178 ఎకరాలు, ఇళ్ల స్థలాలు 21 ఎకరాలు పోతున్నాయి. దీంతో 154 మంది నిర్వాసితులవుతున్నారు. రూ.37.50లక్షల పెట్టుబడి..రూ.2.04కోట్లు రాబడి.. జగన్నాథపురంలోని సర్వే నంబర్ 65లో గల 3.15 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.37.50లక్షలకు 2015, సెప్టెంబర్‌లో చిలుకూరి జగన్మోహన్రెడ్డి వద్ద నుంచి ఖమ్మంకు చెందిన ఎస్కే.నాగుల్‌మీరా 1.27 ఎకరాలు, అలవాల నాగబ్రహ్మాచారి 35 కుంటలు, అబ్దుల్ మజీద్ 35 కుంటల చొప్పున కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తర్వాత ఆ భూమిని 200 గజాల చొప్పున 68 ప్లాట్లుగా విభజించి.. ఒక్కో ప్లాటు రూ.3లక్షల చొప్పున అమ్మేశారు. మొత్తం 68 ప్లాట్లు అమ్మి.. రూ.2.04కోట్లు సొమ్ము చేసుకున్నారు. కాగితాలపై వేసిన లేఅవుట్ అంతా కాగితాలపైనే.. జగన్నాథపురం సర్వే నంబర్ 65లోని 3.17 ఎకరాల వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా బదలాయించకుండా.. ఎటువంటి లే అవుట్ లేకుండానే అంతా కాగితాలపైనే ప్లాన్లు చూపించి.. భూమిని అమ్మినట్లు బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అందులో జామాయిల్ తోట ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. అదీకాక ఊరికి 2 కిలోమీటర్ల దూరం.. చెరువుకు ఆనుకొని ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినట్లు చూపించి.. టోకరా వేసినట్లు బాధితులు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నారు. జగన్నాథపురం గ్రామం 200 గజాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులకు చూపించి.. మా భూమిని నమోదు చేసుకోవాల్సిందిగా పత్రాలను అందించారు. అయితే అది వాస్తవంగా వ్యవసాయ భూమి కావడంతో పరిహారం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.12లక్షల నుంచి రూ.15లక్షలు ఇచ్చే అవకాశం ఉంది. 200 గజాలకు పరిహారం కేవలం రూ.50వేల నుంచి రూ.62వేల వరకే వస్తుంది. అయితే రూ.3లక్షల చొప్పున కొనుగోలు చేసిన తాము 200 గజాల ప్లాటుకు రూ.2.38లక్షల నుంచి రూ.2.50లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వ్యవసాయ భూమిగానే పరిగణిస్తాం.. జగన్నాథపురం సర్వే నంబర్ 65లోని 3.17 ఎకరాలను వ్యవసాయ భూమిగానే పరిగణిస్తున్నాం. అందులో 200 గజాల చొప్పున ప్లాట్లు చేసి.. విక్రయించినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేశాం. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. చెరువు సమీపంలో ఉన్న ఆ భూమిలో జామాయిల్ తోట ఉంది. వ్యవసాయ భూమికి వచ్చిన పరిహారమే దీనికి అందుతుంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు వర్తించవు. 200 గజాల చొప్పున కొన్నట్లు ఇప్పటికే 20 మంది వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నారు. 3.17 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – టీఏవీ.నాగలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ -
సత్తుపల్లి బంద్ సంపూర్ణం
సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: నూతన భూ సేకరణ చట్టం ప్రకారం సింగరేణి భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపు మేరకు గురువారం చేపట్టిన సత్తుపల్లి పట్టణ బంద్ విజయవంతమైంది. తెల్లవారుజాము నుంచే అఖిలపక్షం నాయకులు ద్విచక్ర వాహనాలపై ప్రదర్శనగా తిరుగుతూ దుకాణాలను మూసివేయిం చారు. అలాగే పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, బ్యాంకులు కూడా బంద్ మూసివేశారు. అనంతరం సింగరేణి భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షల శిబిరం నుంచి రింగ్ సెంటర్ వరకు నిర్వాసిత రైతులు, అఖిల పక్షం నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్టాడారు. న్యాయమైన పరిహారం చెల్లించాలని రెండేళ్లుగా భూ నిర్వాసితులు అధికారులను కోరుతున్నా పట్టించుకోకుండా నూతన భూసేకరణ చట్టం అమల్లోకి రావడానికి 48 గంటల ముందు కలెక్టర్ అవార్డు జారీ చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ జారీ చేసిన అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం, సింగరేణి భూ నిర్వాసిత రైతులు ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ల నర్సింహారావు, గాదిరెడ్డి రాంబాబురెడ్డి, దండు ఆదినారాయణ, అమర్లపూడి రాము, మోరంపూడి పాండు, రావుల రాజబాబు, చిత్తలూరి ప్రసాద్, కూసంపూడి రవీంద్ర, వందనపు భాస్కర్‌రావు, తడికమళ్ల యోబు, అయూబ్‌పాషా,నారాయణవరపు శ్రీనివాస్, కంభంపాటి మల్లికార్జున్, వెల్ది జగన్మోహన్రావు, ఎండీ ఫయాజ్, ఏ.శరత్, సంధ్య, తన్నీరు జమలయ్య, వెల్ది ప్రసాద్, డీఎన్ చారి, పింగళి శ్యామేలు పాల్గొన్నారు.