కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం హల్‌చల్ చేశారు. ఓ కేసుకు సంబంధించి కొందరిని ఎస్సై నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. వారిలో అధికార పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. అధికార పార్టీ వారిని వదిలిపెట్టారు. ఎమ్మెల్యే అనుచరులను మాత్రం స్టేషన్‌లోనే ఉంచారు. వారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్ చేసి చెప్పారు. ‘‘ఎస్సైకి ఫోన్ ఇవ్వండి’’ అని ఎమ్మెల్యే అన్నారు.
ఎమ్మెల్యే సండ్ర, లైన్‌లో ఉన్నారంటూ ఫోన్‌ను ఎస్సైకి ఆ అనుచరులు ఇవ్వబోయారు. ఎస్సై తీసుకోలేదు. ఇదే విషయాన్ని సండ్రకు అనుచరులు చెప్పారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన సండ్ర వెంకటవీరయ్య, వెంటనే సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లారీ యూనియన్ కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతున్నదన్న సమాచారంతో అప్పటికే అక్కడకు ఎస్సై వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లేకపోవడంతో ఆయన సెల్‌కు సండ్ర ఫోన్ చేశారు.
ఎత్తకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఈ స్టేషన్ వ్యవహారాలు చూసేది ఎస్సైనా? అధికార పార్టీ కార్యకర్తలా? ఎమ్మెల్యే ఫోన్‌కు ఎస్సై స్పందించకపోతే ఎలా..? దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకనా..?’’ అంటూ, అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పూచీకత్తుపై అధికార పార్టీ వారిని పంపిస్తారు. మా వాళ్లను మాత్రం పంపించకుండా నిర్బంధిస్తారా..?’’ అంటూ మండిపడ్డారు. దీనిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. పోలీస్ స్టేషన్ నుంచే కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
అసలు విషయం ఏమిటంటే...
సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో నలుగురిని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని వెళ్లారు. టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరిని పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. ఇది, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కోపం తెప్పించింది. ఆయన తన అనుచరులతో స్టేషన్‌కు వచ్చారు.
ఫోన్ సిగ్నల్స్ లేవు..
దీనిపై ఎస్సై నరేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘లారీ యూనియన్ కార్యాలయం వద్ద రాస్తారోకో జరుగుతున్నదని తెలియడంతో నేను అక్కడకు వెళ్లాను. అక్కడ సెల్ సిగ్నల్స్ లేకపోవటంతో నాకు ఎటువంటి ఫోన్ రాలేదు’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment