భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. పాల్వంచ మండల పరిధిలో ఇసుక ట్రాక్టర్ మోటార్ సైకిల్‌ను ఢీకొని ఇరువురు దుర్మరణం పాలవగా, దుమ్ముగూడెం మండలంలో ఒకరు, సత్తుపల్లి మండలంలో రెండు లారీలు ఢీ కొని డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
పాల్వంచ: మోటారు సైకిల్‌పై వెళుతున్న వారిని ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దమ్మపేట సెంటర్‌లో గల భవాని వైన్‌షాప్‌లో ములకలపల్లికి చెందిన గుండుమళ్ల సురేందర్‌రెడ్డి (28), చాపరాలపల్లికి చెందిన నల్లమోతు శివశంకర్ (26) పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి పని ముగించుకుని 12.30 సమయంలో మోటారు సైకిల్‌పై బయలుదేరారు. శ్రీనివాసకాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై ముత్యం రమేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. అనుకోని రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని విలపిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కలచివేసింది. సురేందర్‌రెడ్డికి భార్య, కూతురు ఉన్నారు.
ట్రాక్టర్ల అతివేగమే ప్రాణాలు తీశాయి..
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు అతివేగంగా నడిపిస్తుండటం వల్లే ఈ ప్రమాదం వాటిల్లినట్లు స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళ లైట్లు వేయకుండా, రాంగ్ రూట్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు ట్రాక్టర్లు కన్పించక ప్రమాదం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. ముర్రేడువాగు నుంచి ఇసుక ట్రాక్టర్లలో అక్రమ రవాణాను నియంత్రించడంలో అధికారులు విఫలం కావడంవల్ల ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ములకలపల్లిలో అలుముకున్న విషాదం..
ములకలపల్లి: ఇసుక ట్రాక్టరు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలవ్వడంతో ములకలపల్లిలో విషాదం అలుముకుంది. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలానికి తీసుకురావడంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేందర్‌రెడ్డికి భార్య లీలారాణి, ఏడాది వయసుగల కూతురు ఉన్నారు. శివశంకర్ అవివాహితుడు. చేతికొచ్చిన కొడుకుల మృతితో ఇరువురి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కాగా ఇద్దరి కుటుంబాల్లోనూ ఒక్కరే మగసంతానం.
దుమ్ముగూడెం మండలంలో ఒకరు...
పర్ణశాల: దుమ్ముగూడెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలంలోని తేగడకు చెందిన గంగుల వివేక్ భద్రాచలం సుందరయ్యనగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం మండలంలోని మారాయిగూడెం సమ్మక్క సారలమ్మ ఆలయానికి వివేక్ తన స్నేహితుడు దుర్గాప్రసాద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో రామచంద్రునిపేట గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వివేక్ అక్కడిక్కడే మృతి చెందగా, దుర్గాప్రసాద్‌కు తీవ్ర గాయాలైనాయి. మృతిడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బాలకృష్ణ ఆటో డ్రైవర్ కట్టం బాలుపై సోమవారం కేసు నమోదు చేశారు.
రెండు లారీలు ఢీకొని డ్రైవర్ ..
సత్తుపల్లిరూరల్: రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సత్తుపల్లి ఏఎస్సై బీరెల్లి బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేటలో చెరకులోడ్ చేసుకొని కల్లూరుకు వెళ్తుండగా లారీని.. గ్రానైట్ రాళ్లను అన్‌లోడ్ చేసి కాకినాడ నుంచి కరీంనగర్‌కు వెళుతున్న లారీ బేతుపల్లి గ్రామ శివారులో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. దీంతో కరీంనగర్ జిల్లా జన్నారం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బొద్దుల అంజయ్య(40) మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment