సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి టౌన్): మొన్నటి దాకా కరోనా ఉధృతి, మంచి ముహుర్తాలు లేక శుభకార్యాలు నిలిచిపోగా.. ఇప్పుడు శుభ ఘడియలు వచ్చేశాయి. అయితే, శనివారంతో పాటు ఆది, సోమవారాల్లో మూడు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మాఘమాసం ఈనెల 21వ తేదీ సోమవారంతో ముగుస్తుండటంతో శుభకార్యాల సందడి జోరందుకుంది. జిల్లాలోని పల్లెలు, పట్టణాలలో ఎక్కడ చూసినా శుభకార్యాల సందడి కనిపిస్తోంది. ముందస్తుగా సంబంధాలు కుదుర్చుకున్న వారు ముమ్మర ఏర్పా ట్లు చేసుకున్నారు. దీంతో బాజాభజంత్రీల మోత మోగుతోంది. శుభఘడియలకు ఈ మూడురోజులు అనుకూలంగా ఉండడంతో వేలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ఏర్పాట్లుచేసుకోగా, శనివారం పలుచోట్ల సందడి కనిపించింది.
కోలాహలం..
వివాహాలు ఊపందుకుంటే.. వంట మేస్త్రీలు, క్యాటరింగ్, డెకరేషన్ పనివార్లు, ఫొటోగ్రాఫర్లకు, భజంత్రీల వారికి మళ్లీ పనులు ఊపందుకున్నాయి. పురోహితులు బిజీబిజీ అయిపోయారు. పూలు విక్రయించేవారు తదితర సీజనల్ వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. ఎవరిని కదలించినా ఈ మూడురోజుల తర్వాతేనంటూ సమాధానం వస్తోంది. ఫంక్షన్ హాళ్లు, వస్త్ర దుకాణాలు, కిరాణ, బంగారం దుకాణాలు కళకళలాడుతూ కనిపించాయి. ప్రస్తు తం కరోనా ఆంక్షలు కూడా లేకపోవడంతో బంధుమిత్రులతో సందడి వాతావరణం ఏర్పడింది.
ఆహ్వానాలు అధికమే..
చాన్నాళ్ల తర్వాత శుభకార్యాలు ఉండడంతో ఎక్కువ సంఖ్యలో ఫంక్షన్లు పెట్టుకున్నారు. ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలు మొదలు గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు ఇలా వరుస ఆహ్వానాలు అనేకమందికి వచ్చాయి. ఒకే రోజు పలు ఫంక్షన్లు ఉండడంతో ఎటు వెళ్లాలి? అనే తర్జన భర్జన నెలకొందని కొందరంటున్నారు. మొత్తానికి ముహూర్తాలు మళ్లీ అంతా కలిసి హాజరయ్యే హడావిడిని తెచ్చేశాయి.
ఈ రెండు రోజులూ ఎక్కువే..
పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు ఈ మూడురో జులు చాలా ఎక్కువగా ఉన్నా యి. ముందుగానే బుకింగ్ చేసుకున్నవారి దగ్గరకే వెళ్లాల్సి వస్తోంది. శుభఘడియలు తక్కువగా ఉన్నందున బిజీబిజీ అయ్యాం. శనివారం పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఆది, సోమవారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది.
– రామడుగు గురుప్రసాదాచార్యులు, పురోహితుడు, సత్తుపల్లి
Comments
Please login to add a commentAdd a comment