Good muhurtalu
-
Lok sabha elections 2024: ముహూర్తం మించిపోయింది...
నవ్సారి(గుజరాత్): ‘గురువారం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలు. దివ్యమైన ముహూర్తం. సరిగ్గా ఈ సమయానికి ఏది ప్రారంభించినా విజయం ఖాయం’ఇది పూజారి జిగర్ జానీ చెప్పిన మాట. ముహూర్త బలాన్ని బలంగా నమ్మే గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నవ్సారి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేయాలనుకున్నారు. సీఎం భూపేంద్ర పటేల్ తదితర ప్రముఖులు వెంటరాగా నవ్‌సారిలోని పార్టీ కార్యాలయం నుంచి గురువారం ఉదయం రోడ్ షోతో కలెక్టరేట్‌కు బయలుదేరారు. కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో అనుకున్న సమయానికి ఆయన కాన్వాయ్ కలెక్టరాఫీసుకు చేరుకోలేకపోయింది. విజయ ముహూర్తం మించిపోవడంతో పాటిల్ నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు. మళ్లీ అదే పూజారి నిర్ణయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం అదే 12.39 గంటలకు పాటిల్ నామినేషన్ దాఖలు చేస్తారని సన్నిహితులు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై దాదాపు 6.89 లక్షల ఓట్ల తేడాతో పాటిల్ ఘన విజయం సాధించారు. -
శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్ వరకు ఆగాల్సిందే!
కర్నూలు: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో మధురాను భూతి. వధూవరులకు అతి పెద్ద పండుగ. పిల్లల వివాహాలను వైభవంగా అందరూ మెచ్చుకునేలా చేయాలని తల్లిదండ్రుల ఆరాటం. అందుకే కాస్త ఆలస్యమైనా అన్నీ సవ్యంగా కుదిరాకే పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ట్రెండ్ మారింది. సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఆలస్యం అమృతం విషం అన్నట్లు నిశ్చయం అయ్యింది మొదలు ఉరుకులు పరుగులతో పెళ్లి కానిచ్చేస్తున్నారు. ఈ ఐదు నెలల్లో జిల్లాలో వేలాది వివాహాలు జరగ్గా.. ఈనెల 23వ తేదీ వరకు మాత్రమే సుముహూర్తాలు ఉండటంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. వేల సంఖ్యలో వివాహాలు కరోనా దెబ్బతో చాలా మంది రెండేళ్ల పాటు వివాహాల మాటే ఎత్తలేదు. కొందరు ధైర్యం చేసి పిల్లల పెళ్లి చేద్దామన్నా నిబంధనల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో పెళ్లి బాజాల జోరు హోరెత్తుతోంది. మార్చి నుంచి మే వరకు వేలాది జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ప్రస్తుతానికి ఈ నెల చివరి వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో నాలుగైదు ముహూర్తాలు ఉన్నా.. ఆషాడం, శుక్ర మూఢం కారణంగా డిసెంబర్ వరకు ముహూర్తాలే లేవు. డిసెంబర్ 1తో శుక్ర మూఢం ముగుస్తుంది. అనంతరం శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో నిశ్చయ తాంబులాలు తీసుకున్న వారు ఆరు నెలల పాటు ఎదురు చూడడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఉన్నారు. దీంతో పాటు నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఈ నెలలోని ముహూర్తాలకే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే పెళ్లికి తొందర పడుతున్నారు. ఈ క్రమంలోనే కల్యాణ మండపాలు రిజర్వ్ చేసుకుంటున్నారు. డెకరేషన్, క్యాటరింగ్‌లకు కూడా అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం) ముహూర్తాల వివరాలు.. ►ఈనెలలో 3, 5, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ►జూలై నెలలో ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో శుభ ముహూర్తాలు లేవు. ►ఆగస్టులో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ►సెప్టెంబర్‌లో భాద్రపదం మాసం శుక్రమూఢమి ప్రారంభంతో ముహూర్తాలు లేవు. ►అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్ర మూఢమితో మంచిరోజులు లేవు. ►డిసెంబర్లో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. జోరుగా వ్యాపారం.. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర ‡ప్ర«దాన పట్టణాల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా మొత్తం ఈ నెలలో రోజుకు రూ. 8 నుంచి 10 కోట్లు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. ఫ్లవర్ డెకరేటర్స్, భజంత్రీలు, వంట మాస్టర్స్, ఫొటో, వీడియో గ్రాఫర్స్, పురోహితులకు డిమాండ్ ఉంది. ఈ నెల దాటితే ముహూర్తాల్లేవ్ ఈ నెల 2 నుంచి 23వ తేదీ వరకు బలమైన ముహూర్తాలు ఉన్నాయి. మరలా ఆగస్టులో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటితే డిసెంబర్ వరకు ఆగాల్సిందే. ఆషాఢ మాసం, శుక్ర మూ«ఢమి ఉన్నాయి. డిసెంబర్ నెల దాటితే వచ్చే సంవత్సరం ఉగాది వరకు ముహూర్తాలు లేవు. జూన్ నెలలో ఉన్న ముహూర్తాలకు అధిక సంఖ్యలో యువ జంటలు ఒక్కటి కాబోతున్నాయి. – పి.చంద్రశేఖర శర్మ, పండితులు, కర్నూలు -
ముంచుకొస్తున్న ముహూర్తాల గడువు.. ఎక్కడ చూసినా మంగళవాయిద్యాలే..
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి టౌన్): మొన్నటి దాకా కరోనా ఉధృతి, మంచి ముహుర్తాలు లేక శుభకార్యాలు నిలిచిపోగా.. ఇప్పుడు శుభ ఘడియలు వచ్చేశాయి. అయితే, శనివారంతో పాటు ఆది, సోమవారాల్లో మూడు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మాఘమాసం ఈనెల 21వ తేదీ సోమవారంతో ముగుస్తుండటంతో శుభకార్యాల సందడి జోరందుకుంది. జిల్లాలోని పల్లెలు, పట్టణాలలో ఎక్కడ చూసినా శుభకార్యాల సందడి కనిపిస్తోంది. ముందస్తుగా సంబంధాలు కుదుర్చుకున్న వారు ముమ్మర ఏర్పా ట్లు చేసుకున్నారు. దీంతో బాజాభజంత్రీల మోత మోగుతోంది. శుభఘడియలకు ఈ మూడురోజులు అనుకూలంగా ఉండడంతో వేలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ఏర్పాట్లుచేసుకోగా, శనివారం పలుచోట్ల సందడి కనిపించింది. కోలాహలం.. వివాహాలు ఊపందుకుంటే.. వంట మేస్త్రీలు, క్యాటరింగ్, డెకరేషన్ పనివార్లు, ఫొటోగ్రాఫర్లకు, భజంత్రీల వారికి మళ్లీ పనులు ఊపందుకున్నాయి. పురోహితులు బిజీబిజీ అయిపోయారు. పూలు విక్రయించేవారు తదితర సీజనల్ వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. ఎవరిని కదలించినా ఈ మూడురోజుల తర్వాతేనంటూ సమాధానం వస్తోంది. ఫంక్షన్ హాళ్లు, వస్త్ర దుకాణాలు, కిరాణ, బంగారం దుకాణాలు కళకళలాడుతూ కనిపించాయి. ప్రస్తు తం కరోనా ఆంక్షలు కూడా లేకపోవడంతో బంధుమిత్రులతో సందడి వాతావరణం ఏర్పడింది. ఆహ్వానాలు అధికమే.. చాన్నాళ్ల తర్వాత శుభకార్యాలు ఉండడంతో ఎక్కువ సంఖ్యలో ఫంక్షన్లు పెట్టుకున్నారు. ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనలు మొదలు గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు ఇలా వరుస ఆహ్వానాలు అనేకమందికి వచ్చాయి. ఒకే రోజు పలు ఫంక్షన్లు ఉండడంతో ఎటు వెళ్లాలి? అనే తర్జన భర్జన నెలకొందని కొందరంటున్నారు. మొత్తానికి ముహూర్తాలు మళ్లీ అంతా కలిసి హాజరయ్యే హడావిడిని తెచ్చేశాయి. ఈ రెండు రోజులూ ఎక్కువే.. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు ఈ మూడురో జులు చాలా ఎక్కువగా ఉన్నా యి. ముందుగానే బుకింగ్ చేసుకున్నవారి దగ్గరకే వెళ్లాల్సి వస్తోంది. శుభఘడియలు తక్కువగా ఉన్నందున బిజీబిజీ అయ్యాం. శనివారం పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఆది, సోమవారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. – రామడుగు గురుప్రసాదాచార్యులు, పురోహితుడు, సత్తుపల్లి -
ఇంకో రెండు నెలలు.. నో పెళ్లిళ్లు!
శుభ ముహూర్తాల సందడి ముగిసింది. పెళ్లి బాజాభజంత్రీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొద్ది నెలలుగా పెళ్లిళ్లు, ఇతర శుభ ముహూర్తాలతో సందడిగా గడిచిన రోజులు శనివారంతో ముగిశాయి. మరో రెండు నెలలు ఎక్కడి బాజాలు అక్కడే మూగబోనున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ : జ్యేష్ఠ మాసం చివరకు చేరుకుంది. శుభ ముహూర్తాల సందడి ముగింపునకు వచ్చింది. ఈ నెలలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. జిల్లాలో ఈ నెల 27న అధిక సంఖ్యలో వివాహాలు జరగ్గా... 28న సైతం పలు నూతన జంటలు ఒక్కటయ్యాయి. ఈ తేదీలు దాటాక సుమారు రెండు నెలలకు పైగా శుభముహూర్తాలు లేవు. శనివారం నుంచి ఎదురు అమావాస్య ప్రారంభం కాగా... వచ్చే నెల 9 నుంచి శుక్రమూఢ్యం ప్రవేశించనుంది. ఈ మూఢ్యం అక్టోబర్ 19 వరకు ఉంటుంది. ఈ రోజుల్లో హిందూ సంప్రదాయాల ప్రకారం ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త పెళ్లైన ఆడపిల్లలు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చి సుమారు 70రోజుల పాటు అక్కడే ఉంటారు. శుభ కార్యక్రమాలకు బ్రేక్ ఎదురు అమావాస్య, 70 రోజుల పాటు శుక్రమూఢ్యం వరుసగా రావటంతో జిల్లాలో శుభ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం మంచి రోజుల్లో పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు తదితర కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయితే మూఢ్యం ప్రభావంతో ఇటువంటి కార్యక్రమాలకు బ్రేక్ పడనున్నట్టు పురోహితులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రెండు నెలల పాటు బీజీగా గడిపిన పురోహితులకు సైతం కాస్త విరామం లభించనుంది. ఇదిలా ఉండగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అవసరమయ్యే వస్తు కొనుగోళ్లు నిలిచిపోనుండటంతో మార్కెట్లో సందడి తగ్గనుంది. అక్టోబర్ 19 తరువాతే... జేష్ట్య మాసంలో చివరి ముహూర్తాలు దాటాకా ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసాల్లో శుక్రమూఢం కారణంగా ముహూర్తాల్లేవు. అక్టోబర్ 19 తరువాతనే మరల శుభ మూహర్తాల సందడి ప్రారంభం కానుంది. అప్పుడే వివాహాది శుభ కార్యక్రమాలతో పాటు, అన్ని కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. అరుదైన ముహూర్తాలు జేష్ట్యమాసం ముగింపు సమయం వచ్చేసింది. 28వ తేదీ ముహూర్తాలు దాటాకా ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసాల్లో శుక్రమూఢం కారణంగా ముహూర్తాల్లేవు. హిందూ సంప్రదాయం ప్రకారం సుమారు 80 రోజుల పాటు ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించరు. మళ్లీ అక్టోబర్ 19 నుంచి శుభ ముహూర్తాల సందడి ప్రారంభం కానుంది. – పవన్, పురోహితులు -
ఒక్క రోజే 5వేల పెళ్లిళ్లు!
న్యూఢిల్లీ: మంచి ముహూర్తాలు ఉండటంతో దేశ రాజధానిలో సోమవారం ఒక్క రోజే 5వేల వరకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే, అక్కడక్కడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. పెళ్లిళ్ల నేపథ్యంలోనే పోలీసు శాఖ అదనంగా వెయ్యి మందికి పైగా సిబ్బందిని విధుల్లో ఉంచింది. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా రూట్లలో ఉన్న రద్దీని వాహనదారులకు తెలియజేస్తూ సూచనలిచ్చింది. సిబ్బంది మోటారు సైకిళ్లపై తిరుగుతూ రాకపోకలను క్రమబద్ధీకరించారు. అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో క్రేన్లను కూడా అందుబాటులో ఉంచారు. -
ఒకే ముహూర్తాన 131 పెళ్లిల్లు
సాక్షి, ఆసిఫాబాద్: ఒకే ముహూర్తాన 131 జంటలు మూడు ముడులు, ఏడు అడుగుల బంధంతో ఏకమయ్యాయి. ఇందులో 91 ఆదివాసీ జంటలున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం గ్రౌండ్ వేది కైంది. బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ వర్గాల యువతీ యువకుల వివాహాలను ఘనంగా జరిపించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన జంటలకు కోనేరు ట్రస్టు ద్వారా ఉచితంగా పుస్తె మట్టెలు, వస్త్రాలు, ఫ్యాను, బీరువా తదితర సామగ్రిని కోనప్ప అందజేశారు. జంటలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తామన్నారు. -
ఓరుగల్లుకు పెళ్లికళ
నేటి నుంచి మోగనున్న బాజా పోచమ్మమైదాన్ : జిల్లాకు పెళ్లి కళొచ్చింది.. మాఘమాసం శుభ ముహూర్తాలను మోసుకొచ్చింది.. నెల రోజుల విరామం తర్వాత మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ముహూర్తాలు ఖరారు చేసుకున్న వారు పెళ్లి పనులకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే వస్త్ర, బంగారు షాపుల్లో సందడి నెలకొంది. పెళ్లిళ్ల కోసం జిల్లాలోని కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. డిసెంబర్ 18వ తేదీతో ముగిసిన పెళ్లి ముహూర్తాలు మళ్లీ మూడం ముగిశాక గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఈనెల 25న వసంత పంచమి కావడంతో మంచి ముహూర్తం అని పండితులు చెబుతున్నారు. బలమైన ముహూర్తం కావడంతో ఆ రోజు వందల సంఖ్యలో జిల్లాలో వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. గురువారం రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో నగరంలో కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫొటో, వీడియో, పురోహితులకు, టెంట్‌హౌస్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు చిన్న, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాళ్లు, ట్రావెల్స్, ఫ్లవర్ డెకరేషన్ ట్రూప్స్, సన్నాయి బృందాలను ముందుగానే రిజర్వు చే సుకుంటున్నారు. చిన్న, పెద్దపెద్ద హోటళ్ల రూమ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. నగరంలో 70కి పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీ అయ్యాయి. ముచ్చటైన వేదికలు పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలోని కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు వేదికలుగా నిలుస్తున్నాయి. నగరంలో మరికొందరు పెద్ద గ్రౌండ్లను ఎంచుకుంటున్నారు. అపురూపమైన సెట్టింగ్‌లు, ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. సెట్టింగ్‌లు వేసేందుకు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల నుంచి ఆర్ట్ డెరైక్టర్లను రప్పిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, స్క్రీన్లు ఏర్పాటు చేసి వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాలులో ఉన్న వారు ఎంతో క్లోజ్‌గా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పుష్య మాసం ముగిసిన తరువాత మళ్లీ ఇప్పుడే పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. మాగ, ఫాల్గుణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ కొత్త పంచాంగంలోనే ముహూర్తాలు ఉన్నాయి. ఈనెల 25న వసంత పంచమి కావడంతో ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. - శివశ్రీ బోగీశ్వరశాస్త్రి, శ్రీపంచముఖ వీరేశ్వరాలయం అర్చకుడు, వరంగల్ మళ్లీ మార్చి 29 నుంచి... మార్చి 15 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ మార్చి 29 నుంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పంచాంగ ంలో ముహూర్తాలు ఉన్నాయి. -
పెళ్లిబాట
అఫ్జల్‌గంజ్: నగరవాసులు పెళ్లిబాట పట్టారు. గురు, శుక్ర, శనివారాల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు సిటిజనులు ఊర్లకు బయలుదేరారు. దీంతో బుధవారం ఉదయం నుంచీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. బస్సులు, రైళ్లు నిండిపోయాయి. ఎంజీబీఎస్‌లో రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రధాన ప్రాంతాలకు అదనపు బస్సు సర్వీసులను నడిపారు. సీమాంధ్రకు 150, తెలంగాణ ప్రాంతంలో 100 అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. బుధవారం ఒక్కరోజే రెగ్యులర్ బస్సుల్లో 1,24,600 మంది ప్రయాణికులు, 250 అదనపు బస్సుల్లో 5, 250 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. కిక్కిరిసిన రైళ్లు సికింద్రాబాద్: శుభముహూర్తాలు...పెళ్లిళ్ల నేపథ్యంలో నగరం నుంచి బయలుదేరే రైళ్లు కిక్కిరిసిపోయాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నర్సాపూర్ మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో రద్దీ కనిపించింది. టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.