పెళ్లిబాట
అఫ్జల్‌గంజ్: నగరవాసులు పెళ్లిబాట పట్టారు. గురు, శుక్ర, శనివారాల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు సిటిజనులు ఊర్లకు బయలుదేరారు. దీంతో బుధవారం ఉదయం నుంచీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. బస్సులు, రైళ్లు నిండిపోయాయి. ఎంజీబీఎస్‌లో రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రధాన ప్రాంతాలకు అదనపు బస్సు సర్వీసులను నడిపారు. సీమాంధ్రకు 150, తెలంగాణ ప్రాంతంలో 100 అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. బుధవారం ఒక్కరోజే రెగ్యులర్ బస్సుల్లో 1,24,600 మంది ప్రయాణికులు, 250 అదనపు బస్సుల్లో 5, 250 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు.
కిక్కిరిసిన రైళ్లు
సికింద్రాబాద్: శుభముహూర్తాలు...పెళ్లిళ్ల నేపథ్యంలో నగరం నుంచి బయలుదేరే రైళ్లు కిక్కిరిసిపోయాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నర్సాపూర్ మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో రద్దీ కనిపించింది. టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.