Best Auspicious Telugu Marriage Dates For 2022 Weddings - Sakshi
Sakshi News home page

శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్‌ వరకు ఆగాల్సిందే! 

Published Thu, Jun 2 2022 3:56 PM | Last Updated on Thu, Jun 2 2022 8:36 PM

Best Auspicious Telugu Marriage Dates For 2022 Weddings - Sakshi

కర్నూలు: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో మధురాను భూతి. వధూవరులకు అతి పెద్ద పండుగ. పిల్లల వివాహాలను వైభవంగా అందరూ మెచ్చుకునేలా చేయాలని తల్లిదండ్రుల ఆరాటం. అందుకే కాస్త ఆలస్యమైనా అన్నీ సవ్యంగా కుదిరాకే పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ట్రెండ్‌ మారింది. సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఆలస్యం అమృతం విషం అన్నట్లు  నిశ్చయం  అయ్యింది మొదలు ఉరుకులు పరుగులతో పెళ్లి కానిచ్చేస్తున్నారు. ఈ ఐదు నెలల్లో జిల్లాలో వేలాది వివాహాలు జరగ్గా.. ఈనెల 23వ తేదీ వరకు మాత్రమే సుముహూర్తాలు ఉండటంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.  

వేల సంఖ్యలో వివాహాలు  
కరోనా దెబ్బతో చాలా మంది  రెండేళ్ల పాటు వివాహాల మాటే ఎత్తలేదు. కొందరు ధైర్యం చేసి పిల్లల పెళ్లి చేద్దామన్నా నిబంధనల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో పెళ్లి బాజాల జోరు హోరెత్తుతోంది. మార్చి నుంచి మే వరకు వేలాది జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ప్రస్తుతానికి ఈ నెల చివరి వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో నాలుగైదు ముహూర్తాలు ఉన్నా.. ఆషాడం, శుక్ర మూఢం కారణంగా డిసెంబర్‌ వరకు ముహూర్తాలే లేవు. డిసెంబర్‌ 1తో శుక్ర మూఢం ముగుస్తుంది. అనంతరం శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో నిశ్చయ తాంబులాలు తీసుకున్న వారు ఆరు నెలల పాటు ఎదురు చూడడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఉన్నారు. దీంతో పాటు నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ఈ నెలలోని ముహూర్తాలకే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే పెళ్లికి తొందర పడుతున్నారు. ఈ క్రమంలోనే కల్యాణ మండపాలు రిజర్వ్‌ చేసుకుంటున్నారు. డెకరేషన్, క్యాటరింగ్‌లకు కూడా అడ్వాన్స్‌లు ఇస్తున్నారు.

చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం)
 
ముహూర్తాల వివరాలు.. 
ఈనెలలో 3, 5, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.   
జూలై నెలలో ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో శుభ ముహూర్తాలు లేవు.  
ఆగస్టులో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. 
సెప్టెంబర్‌లో భాద్రపదం మాసం శుక్రమూఢమి ప్రారంభంతో ముహూర్తాలు లేవు.  
అక్టోబర్, నవంబర్‌ నెలల్లో శుక్ర మూఢమితో మంచిరోజులు లేవు. 
డిసెంబర్‌లో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.  

జోరుగా వ్యాపారం..  
పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ తదితర ‡ప్ర«దాన పట్టణాల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా మొత్తం ఈ నెలలో రోజుకు రూ. 8 నుంచి 10  కోట్లు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంటుంది.  ఫ్లవర్‌ డెకరేటర్స్, భజంత్రీలు, వంట మాస్టర్స్, ఫొటో, వీడియో గ్రాఫర్స్, పురోహితులకు డిమాండ్‌ ఉంది.

ఈ నెల దాటితే ముహూర్తాల్లేవ్‌ 
ఈ నెల 2 నుంచి 23వ తేదీ వరకు బలమైన  ముహూర్తాలు ఉన్నాయి. మరలా ఆగస్టులో కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటితే డిసెంబర్‌ వరకు ఆగాల్సిందే. ఆషాఢ మాసం, శుక్ర మూ«ఢమి  ఉన్నాయి. డిసెంబర్‌ నెల దాటితే వచ్చే సంవత్సరం ఉగాది వరకు ముహూర్తాలు లేవు.  జూన్‌ నెలలో ఉన్న ముహూర్తాలకు అధిక సంఖ్యలో యువ జంటలు ఒక్కటి  కాబోతున్నాయి.
 – పి.చంద్రశేఖర శర్మ, పండితులు, కర్నూలు  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement