సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్త జిల్లాను ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాలను ప్రకటించిన సమయంలోనే సత్తుపల్లిని మరో జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేసినా.. జిల్లాగా ప్రకటించని పరిస్థితి. శాసనసభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు కొత్త జిల్లాల ప్రస్తావన తేవడంతో సత్తుపల్లి వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తమ ప్రాంతాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన సందర్భంగా సత్తుపల్లి జిల్లా డిమాండ్ తెరపైకి వచ్చింది. చిన్న ప్రాంతాలను కూడా జిల్లాలుగా చేయడంతో సత్తుపల్లి ప్రాంతాన్ని కూడా జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతు పెరిగింది. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలు కలిపి 5,09,871 మంది జనాభా ఉన్నారు.
3,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 244 గ్రామ పంచాయతీలు, 10 మండలాలతో జిల్లా చేయాలని.. అదనంగా గంగారం, మొద్దులగూడెం, లంకపల్లి, చెన్నూరు, కుర్నవల్లి, పట్వారిగూడెం, వినాయకపురం మండలాలుగా చేయాలని ఆ సమయంలోనే ఉద్యమించారు. ప్రజలకు జిల్లా కేంద్రం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారని ఈ ప్రాంతవాసులు గుర్తు చేస్తున్నారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ప్రకటించారని, అయితే ప్రస్తుతం తమ ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి చాలా దూరం ఉందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెంకు వెళ్లాలంటే 100 కిలోమీటర్ల దూరం ఉంది. సత్తుపల్లి నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మారుమూల ప్రాంతాల నుంచి 110 కిలోమీటర్ల దూరం ఉంది. సత్తుపల్లిని జిల్లా చేస్తే కేవలం 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకే దూరం ఉంటుందనే వాదనను వినిపిస్తున్నారు. అలాగే అశ్వారావుపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలోనే రిలే దీక్షలు..
నారాయణ్‌పేట్, ములుగు జిల్లాల ప్రకటనతో సత్తుపల్లి జిల్లా ప్రతిపాదనపై రాజకీయ పార్టీల స్వరం పెరిగింది. సత్తుపల్లిని జిల్లా చేయాలని 2016, అక్టోబర్ 29 నుంచి 2017, మార్చి 6వ తేదీ వరకు 129 రోజులపాటు 114 ప్రజా సంఘాలు రిలే నిరహార దీక్షలు చేపట్టాయి. సత్తుపల్లిలో 48 గంటల బంద్ పాటించారు. జిల్లా చేయాలని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దీక్షలకు సంఘీభావం తెలపడమే కాకుండా.. అసెంబ్లీలో ప్రస్తావించారు. మళ్లీ జిల్లాల పునర్విభజన చేపడితే సత్తుపల్లిని జిల్లా చేయిస్తామనే హామీతో దీక్షలను విరమించారు. అప్పటి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, జలగం ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు శిబిరాన్ని సందర్శించి.. సంఘీభావం ప్రకటించారు.
మళ్లీ తెరపైకి..
రెండోసారి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలోని ములుగు, నారాయణ్‌పేట్‌లను జిల్లాలుగా మార్చేందుకు అధికారిక కసరత్తు ప్రారంభించడంతో ఇక సత్తుపల్లి జిల్లాగా రూపాంతరం చెందే అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. సత్తుపల్లి జిల్లా కావాల్సిన ఆవశ్యకతపై అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై ఉండడం.. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి జిల్లా చేసేందుకు అవసరమైన జనాభా, భౌగోళిక పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో జిల్లా అయ్యే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment