తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, ఖమ్మం : ప్రజల అభీష్టం మేరకే ఆనాడు పార్టీ మారవలసివచ్చిందని ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిడమర్తి రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. త్వరలో టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో సత్తుపల్లిలో సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యకర్తలు ఎన్నికలను నిర్లక్ష్యంగా తీసుకుంటే మరల రాబోయే కేబినేట్‌లో తను ఉండనని అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల వల్లే సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఆ విధంగా నడుచుకోవాలని సూచించారు. పదవులు కోరుకున్న నాయకులు అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు మట్ట దయానంద్‌తో కూడా చర్చలు జరిపామని చెప్పారు. తాను అవసరం కోసమో, అవకాశాల కోసమో రాజకీయాలను ఏనాడూ తార్పిడి చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలంటే మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే సత్తుపల్లి నియోజకవర్గానికి అధిక ప్రాముఖ్యత ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment