Railway corridor
-
భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే కారిడార్‌ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇదే. లారీలకు ప్రత్యామ్నాయంగా.. సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్‌కాస్ట్‌ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు. మొత్తం మూడు స్టేషన్లు ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్స్‌కు సంబంధించి సైడింగ్ స్టేషన్ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్‌యూబీలు, 7 ఆర్ఓబీలు నిర్మించారు. రోజుకు ఐదారు రేక్‌ల బొగ్గు తరలింపు రోజుకు ఐదారు రేక్ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్‌ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్‌ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది. -
హైదరాబాద్ వరకు హైస్పీడ్ కారిడార్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు నూతన హైస్పీడ్ రైల్ కారిడార్లను ఎంపిక చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. అందులో ముంబై నుంచి పుణే మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వరకు ఈ హైస్పీడ్ కారిడార్‌ను ఎంపిక చేశామని లోక్‌సభలో ఎంపీ జ్ఞానతి రవియం అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎంపిక చేసిన ఏడు నూతన హై స్పీడ్ రైల్ కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు భారతీయ రైల్వేకు బాధ్యతలు అప్పగించామని, అయితే ఇప్పటివరకు ఏ కారిడార్ డీపీఆర్ పూర్తి కాలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. డీపీఆర్‌లోని అంశాల ఆధారంగా ఒక్కో కారిడార్‌కు ఆమోదం తెలుపుతామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మరో 8 సైనిక్ స్కూళ్లు.. దేశంలో మొత్తం 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయని, మరో 8 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క సైనిక్ స్కూల్ లేకపోవడంతో, వరంగల్ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు రక్షణ శాఖ 2017 మార్చి 2న సూత్రప్రాయ ఆమోదం తెలిపి, ఒప్పందం చేసుకుందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. -
కాజీపేట మీదుగా ప్రత్యేక కారిడార్
సరుకు రవాణా కోసం అదనపు మార్గం - వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో ఎంపిక? - ప్రత్యేక రైల్వే లైను నిర్మాణానికి సన్నాహాలు - హైస్పీడ్ సరుకు రవాణా రైళ్లకు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా దేశం నలుమూలలా సరుకు రవాణా రైల్వే కారిడార్ల నిర్మాణంలో కాజీపేట-విజయవాడ మార్గం కీలకం కాబోతోంది. ఈ రూట్లో సరుకు రవాణాకు ప్రత్యేకంగా అదనపు మార్గం నిర్మాణం కానుంది. దీనిపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రయాణికుల తరలింపునకు హై స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగానే, సరుకు రవాణా వేగంగా జరిగేలా, సమయపాలిత రైళ్లు పరుగుపెట్టేలా రూపకల్పన చేస్తున్నారు. వచ్చే బడ్జెట్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంటే నాలుగో లైనా... నిర్ధారిత సమయానికి సరుకు రవాణా రైలు బయలుదేరినా... ప్రయాణికుల రైళ్ల కోసం దాన్ని వీలైనన్ని ప్రాంతాల్లో నిలుపుతూ చాలా రోజుల తర్వాత గమ్యం చేరుస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు రోడ్డు మార్గాన తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సరుకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పేరుతో పంజాబ్‌లోని లూథియానా నుంచి బెంగాల్‌లోని దన్కుని వరకు, ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పేర ముంబైలోని నెహ్రూ పోర్టు నుంచి యూపీలోని దాద్రి వరకు ప్రత్యేక మార్గాలను నిర్మిస్తున్నారు. ఇలాగే నార్త్-సౌత్ కారిడార్, సౌత్-వెస్ట్ కారిడార్లను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో కాజీపేట మార్గం కీలకం కాబోతోంది. అయితే ఇక్కడే కొంత గందరగోళం కూడా నెలకొంది. ప్రత్యేకంగా సరుకు రవాణాకు మార్గం నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే ప్రయాణికుల రైళ్లు గరిష్ట పరిమితిని మించి నడుస్తున్నందున రైళ్ల ట్రాఫిక్ తీవ్రమైంది. దీన్ని నివారించేందుకు మూడో రైలు మార్గం నిర్మాణం చేపట్టారు. బల్లార్షా నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు దాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సరుకు రవాణాకు కూడా ప్రత్యేక మార్గం నిర్మించాలని నిర్ణయించినందున.. నాలుగో మార్గం కూడా అవసరమవుతుంది. మరి నాలుగో మార్గం నిర్మిస్తారా.. ప్రస్తుతం చేపట్టిన మూడో మార్గాన్నే దానికి కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. అందుబాటులోకి ప్రత్యేక వ్యాగన్లు... ప్రస్తుతం మన గూడ్సు రైళ్లలోని ఒక్కో వ్యాగన్లో 20 నుంచి 22 మెట్రిక్ టన్నుల వరకు సరుకు రవాణా చేస్తున్నాయి. ప్రత్యేక కారిడార్లు వస్తే ఒక్కో వ్యాగన్‌కు దాదాపుగా 25 మెట్రిక్ టన్నుల నుంచి 30 మెట్రిక్ టన్ను ల వరకు సరుకు రవాణా చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యాగన్లను అందుబాటులోకి తేవటంతోపాటు వాటి సంఖ్యనూ భారీగా పెంచుతారు.ప్రయాణికుల రైళ్ల తరహాలో సరుకు రవాణా రైళ్లకు కూడా నిర్ధారిత వేళలతో నడుపుతారు. ఇది రైల్వేల ఆదాయాన్ని భారీగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు. -
హరిత యజ్ఞం
రూ.25కోట్ల వ్యయంతో మొక్కల పెంపకం ‘ఔటర్’ రైల్వే కారిడార్‌లో నర్సరీల ఏర్పాటు పర్యావరణ పరిరక్షణపై హెచ్ఎండీఏ దృష్టి సాక్షి, సిటీబ్యూరో : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని ఖాళీ స్థలాలు, రోడ్లు, పార్కులు, పారిశ్రామిక వాడల్లో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం హరిత యజ్ఞాన్ని చేపడుతోంది. మూడేళ్లలో 7 కోట్లకు పైగా మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాధ్యతను ‘మహా నగరాభివృద్ధి సంస్థ’కు అప్పగించింది. ఇందుకు అవసరమైన నర్సరీలను ఔటర్ రింగ్ రోడ్డులోని రైల్వే కారిడార్‌లో ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హరిత యజ్ఞాన్ని’ ప్రారంభిస్తోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వచ్చే 3ఏళ్లలో సుమారు 7 కోట్లకుపైగా మొక్కలను నాటి నగరాన్ని ‘హరిత హైదరాబాద్’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణాకు ‘హరిత హారం’ పథకం కింద హైదరాబాద్, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో గణనీయంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఎన్ఆర్ఈజీఏ స్కీం కింద కేంద్ర అందించే రూ.25కోట్ల నిధులను సద్వినియోగం చేసుకొని భాగ్యనగరాన్ని ‘వన దుర్గం’గా అభివృద్ధి చేయాలనుకొంటోంది. ఈ బాధ్యతను ‘మహా నగరాభివృద్ధి సంస్థ’కు అప్పగిస్తూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ వెంటనే స్పందించి చర్యలకు ఉపక్రమించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఏడాదికి సుమారు 2.33కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం తన పరిధిలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులను రంగలోకి దించి కొత్త నర్సరీల ఏర్పాటుపై దృష్టి సారించారు. భారీ నర్సరీలు... ఔటర్ రింగ్ రోడ్డులోని రైల్వే కారిడార్‌లో సుమారు 60 కి.మీ. వరకు భూమి చదునుగా ఉన్న ప్రాంతం నర్సరీలకు అనువైనదిగా అధికారులు భావిస్తున్నారు. ఇందులో 25-30 వరకు భారీ నర్సరీలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యారు. వీటిల్లో 1కి.మీ.కు సుమారు 4 లక్షల చొప్పున మొత్తం 60కి.మీ. పరిధిలోని 2.40 కోట్ల మొక్కలు పెంచవచ్చని లెక్కతేల్చారు. ఇలా 3ఏళ్ల పాటు నర్సరీల ద్వారా 7కోట్లకు పైగా మొక్కలను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. నర్సరీల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నలుగురు రేంజి ఆఫీసర్లను నియమించనున్నారు. నిజానికి ఔటర్ రింగ్‌రోడ్డులో పెద్దఅంబర్‌పేట నుంచి శామీర్‌పేట వరకు 125కి.మీ. దూరంలో అన్నిప్రాంతాలు నర్సరీలకు అనువుగా లేవు. రైల్వే కారిడార్‌లో కూడా భూమి సమతలంగా ఉన్న ప్రాంతాల్లో నీటి లభ్యత, భూసారం, విద్యుత్తు సదుపాయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొంటూ కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్లో పెంపకాన్ని ప్రారంభించి వచ్చే ఏడాది నుంచి నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. కొత్త నర్సరీల పనులు సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నందన వనాలే... నగరంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో నందన వనాలను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ఆసక్తి చూపుతోంది. దీనికి ఎన్ఆర్ఈజీఏ పథకం నిధులు వినియోగించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో 20 శాతం మేర విస్తీర్ణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టింది. హెచ్ఎండీఏ నగరంలోని పలు ఉద్యాన వనాలు (పార్కులు), ప్రధాన మార్గాల్లో రోడ్ మీడియన్స్‌లో మొక్కలు నాటుతూ పచ్చదనం అభివృద్ధికి పాటుపడుతోంది. నగరంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలన్న సర్కార్ లక్ష్యాన్ని చేరుకునేందుకు చెరువులు, జలాశయాల వద్ద కూడా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టింది. -
పత్తాలేని ‘ప్రజా రవాణా’
‘ఔటర్’ చుట్టూ అమరని రైల్వే కారిడార్ ప్రతిపాదనలే పట్టించుకోని రైల్వే శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో: నగరం చుట్టూ రూ. ఏడు వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు అదనపు హుంగుగా వెలసిల్లాల్సిన ప్రజా రవాణా వ్యవస్థ ప్రతిపాదన పత్తాలేకుండా పోయింది. ఫలితంగా ఔటర్‌కు సమీపంలోని 600 గ్రామాల ప్రజలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టం(పీటీఎస్) అందని ద్రాక్షలాగే మి గిలింది. ‘ఔటర్’కు అనుసంధానంగా 158 కి.మీ. మేర పీటీఎస్ను నిర్మించాలన్నది ఓఆర్ఆర్ ప్రణాళికలో భాగమే. ఇందుకు సంబంధించి 25 మీటర్ల వెడల్పులో ఓఆర్ఆర్ చుట్టూ స్థలాన్ని కూడా కేటాయించారు. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే కారిడార్ (ఎంఎంటీఎస్) పై మొదట్లో అధికారులు మొగ్గు చూపారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. స్పష్టత లేదు.. ఔటర్ చుట్టూ ఎంఎంటీఎస్, బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం(బీఆర్టీఎస్), లైట్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం(ఎల్ఆర్టీఎస్) వీటిలో ఏ వ్యవస్థను నిర్మించాలన్నదానిపై ఇంతవరకు హెచ్ఎండీఏకు స్పష్టత లేదు. ఔటర్‌ను పూర్తిచేయడంపైనే అధికారులు దృష్టి పెట్టారు తప్ప... పీటీఎస్ ఏర్పాటును గాలికొదిలేశారు. ఔటర్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాది పట్టనుంది. ఈలోగా ఔటర్ చుట్టూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టంను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే... ఇప్పుడు హెచ్ఎండీఏ దాని ఊసే పట్టించుకోక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇది కీలకం... గ్రేటర్ ముంబై తరహాలో ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ వెలిసే శాటిలైట్ నగరాలకు కోర్ ఏరియాతో ప్రధాన రవాణా సౌకర్యం రైల్వే కారిడార్ వల్లే సమకూరుతుంది. ఔటర్ సర్కిల్‌ను చేర్చి ఏర్పడే నివాస ప్రాంతాల్లోని ప్రజలు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం నగరానికి రావడానికి ఇదే ప్రధాన రవాణా మార్గం అవుతుంది. దీంతోపాటు రైల్వే ద్వారా సాగే ఎగుమతి, దిగుమతులకు ఈ కారిడార్ ఎంతో దోహదం చేస్తుంది. గ్రేటర్ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టుపై కొత్త సర్కార్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బీఆర్టీఎస్పైనే గురి.. రైల్వే కారిడార్ ఇప్పట్లో మంజూరు కాదన్న నమ్మకం అధికారుల్లోనే పాతుకుపోయింది. ఎంఎంటీఎస్ బదులు బీఆర్టీఎస్ లేదా ఎల్ఆర్టీఎస్ వంటి వాటిపైనే హెచ్ఎండీఏ అధికారులు మొగ్గుచూపుతున్నారు. 158 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 25 మీటర్ల వరకు స్థలం వదిలినా, రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు ఎక్కడా కూడా స్థలం కేటాయించలేదు. ఔటర్ నిర్మాణం గ్రోత్ కారిడార్‌లో భాగమే. ఇది సమీకృత ప్రాజెక్టు. వివిధ శాఖల సమన్వయంతో ఏకకాలంలో అభివృద్ధి నిర్మాణాలు చేపట్టి ఉంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు.