పత్తాలేని ‘ప్రజా రవాణా’
- ‘ఔటర్’ చుట్టూ అమరని రైల్వే కారిడార్
- ప్రతిపాదనలే పట్టించుకోని రైల్వే శాఖ
- నిమ్మకు నీరెత్తినట్లుగా హెచ్‌ఎండీఏ
సాక్షి, సిటీబ్యూరో: నగరం చుట్టూ రూ. ఏడు వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)కు అదనపు హుంగుగా వెలసిల్లాల్సిన ప్రజా రవాణా వ్యవస్థ ప్రతిపాదన పత్తాలేకుండా పోయింది. ఫలితంగా ఔటర్‌కు సమీపంలోని 600 గ్రామాల ప్రజలకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం(పీటీఎస్) అందని ద్రాక్షలాగే మి గిలింది. ‘ఔటర్’కు అనుసంధానంగా 158 కి.మీ. మేర పీటీఎస్‌ను నిర్మించాలన్నది ఓఆర్‌ఆర్ ప్రణాళికలో భాగమే. ఇందుకు సంబంధించి 25 మీటర్ల వెడల్పులో ఓఆర్‌ఆర్ చుట్టూ స్థలాన్ని కూడా కేటాయించారు. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే కారిడార్ (ఎంఎంటీఎస్) పై మొదట్లో అధికారులు మొగ్గు చూపారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు.
స్పష్టత లేదు..
ఔటర్ చుట్టూ ఎంఎంటీఎస్, బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం(బీఆర్‌టీఎస్), లైట్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం(ఎల్‌ఆర్‌టీఎస్) వీటిలో ఏ వ్యవస్థను నిర్మించాలన్నదానిపై ఇంతవరకు హెచ్‌ఎండీఏకు స్పష్టత లేదు. ఔటర్‌ను పూర్తిచేయడంపైనే అధికారులు దృష్టి పెట్టారు తప్ప... పీటీఎస్ ఏర్పాటును గాలికొదిలేశారు. ఔటర్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాది పట్టనుంది. ఈలోగా ఔటర్ చుట్టూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టంను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే... ఇప్పుడు హెచ్‌ఎండీఏ దాని ఊసే పట్టించుకోక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఇది కీలకం...
గ్రేటర్ ముంబై తరహాలో ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ వెలిసే శాటిలైట్ నగరాలకు కోర్ ఏరియాతో ప్రధాన రవాణా సౌకర్యం రైల్వే కారిడార్ వల్లే సమకూరుతుంది. ఔటర్ సర్కిల్‌ను చేర్చి ఏర్పడే నివాస ప్రాంతాల్లోని ప్రజలు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం నగరానికి రావడానికి ఇదే ప్రధాన రవాణా మార్గం అవుతుంది. దీంతోపాటు రైల్వే ద్వారా సాగే ఎగుమతి, దిగుమతులకు ఈ కారిడార్ ఎంతో దోహదం చేస్తుంది. గ్రేటర్ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టుపై కొత్త సర్కార్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
బీఆర్‌టీఎస్‌పైనే గురి..
రైల్వే కారిడార్ ఇప్పట్లో మంజూరు కాదన్న నమ్మకం అధికారుల్లోనే పాతుకుపోయింది. ఎంఎంటీఎస్ బదులు బీఆర్‌టీఎస్ లేదా ఎల్‌ఆర్‌టీఎస్ వంటి వాటిపైనే హెచ్‌ఎండీఏ అధికారులు మొగ్గుచూపుతున్నారు. 158 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 25 మీటర్ల వరకు స్థలం వదిలినా, రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు ఎక్కడా కూడా స్థలం కేటాయించలేదు. ఔటర్ నిర్మాణం గ్రోత్ కారిడార్‌లో భాగమే. ఇది సమీకృత ప్రాజెక్టు. వివిధ శాఖల సమన్వయంతో ఏకకాలంలో అభివృద్ధి నిర్మాణాలు చేపట్టి ఉంటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు.