హరిత యజ్ఞం
- రూ.25కోట్ల వ్యయంతో మొక్కల పెంపకం
- ‘ఔటర్’ రైల్వే కారిడార్‌లో నర్సరీల ఏర్పాటు
- పర్యావరణ పరిరక్షణపై హెచ్‌ఎండీఏ దృష్టి
సాక్షి, సిటీబ్యూరో : మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని ఖాళీ స్థలాలు, రోడ్లు, పార్కులు, పారిశ్రామిక వాడల్లో పచ్చదనం పరవళ్లు తొక్కనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం హరిత యజ్ఞాన్ని చేపడుతోంది. మూడేళ్లలో 7 కోట్లకు పైగా మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాధ్యతను ‘మహా నగరాభివృద్ధి సంస్థ’కు అప్పగించింది. ఇందుకు అవసరమైన నర్సరీలను ఔటర్ రింగ్ రోడ్డులోని రైల్వే కారిడార్‌లో ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హరిత యజ్ఞాన్ని’ ప్రారంభిస్తోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వచ్చే 3ఏళ్లలో సుమారు 7 కోట్లకుపైగా మొక్కలను నాటి నగరాన్ని ‘హరిత హైదరాబాద్’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణాకు ‘హరిత హారం’ పథకం కింద హైదరాబాద్, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో గణనీయంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఎన్‌ఆర్‌ఈజీఏ స్కీం కింద కేంద్ర అందించే రూ.25కోట్ల నిధులను సద్వినియోగం చేసుకొని భాగ్యనగరాన్ని ‘వన దుర్గం’గా అభివృద్ధి చేయాలనుకొంటోంది.
ఈ బాధ్యతను ‘మహా నగరాభివృద్ధి సంస్థ’కు అప్పగిస్తూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ వెంటనే స్పందించి చర్యలకు ఉపక్రమించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఏడాదికి సుమారు 2.33కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం తన పరిధిలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులను రంగలోకి దించి కొత్త నర్సరీల ఏర్పాటుపై దృష్టి సారించారు.
భారీ నర్సరీలు...
ఔటర్ రింగ్ రోడ్డులోని రైల్వే కారిడార్‌లో సుమారు 60 కి.మీ. వరకు భూమి చదునుగా ఉన్న ప్రాంతం నర్సరీలకు అనువైనదిగా అధికారులు భావిస్తున్నారు. ఇందులో 25-30 వరకు భారీ నర్సరీలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యారు. వీటిల్లో 1కి.మీ.కు సుమారు 4 లక్షల చొప్పున మొత్తం 60కి.మీ. పరిధిలోని 2.40 కోట్ల మొక్కలు పెంచవచ్చని లెక్కతేల్చారు. ఇలా 3ఏళ్ల పాటు నర్సరీల ద్వారా 7కోట్లకు పైగా మొక్కలను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. నర్సరీల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నలుగురు రేంజి ఆఫీసర్లను నియమించనున్నారు.
నిజానికి ఔటర్ రింగ్‌రోడ్డులో పెద్దఅంబర్‌పేట నుంచి శామీర్‌పేట వరకు 125కి.మీ. దూరంలో అన్నిప్రాంతాలు నర్సరీలకు అనువుగా లేవు. రైల్వే కారిడార్‌లో కూడా భూమి సమతలంగా ఉన్న ప్రాంతాల్లో నీటి లభ్యత, భూసారం, విద్యుత్తు సదుపాయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకొంటూ కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో పెంపకాన్ని ప్రారంభించి వచ్చే ఏడాది నుంచి నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని హెచ్‌ఎండీఏ అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. కొత్త నర్సరీల పనులు సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక నందన వనాలే...
నగరంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో నందన వనాలను అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ఆసక్తి చూపుతోంది. దీనికి ఎన్‌ఆర్‌ఈజీఏ పథకం నిధులు వినియోగించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లో 20 శాతం మేర విస్తీర్ణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టింది. హెచ్‌ఎండీఏ నగరంలోని పలు ఉద్యాన వనాలు (పార్కులు), ప్రధాన మార్గాల్లో రోడ్ మీడియన్స్‌లో మొక్కలు నాటుతూ పచ్చదనం అభివృద్ధికి పాటుపడుతోంది. నగరంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలన్న సర్కార్ లక్ష్యాన్ని చేరుకునేందుకు చెరువులు, జలాశయాల వద్ద కూడా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టింది.