కాజీపేట మీదుగా ప్రత్యేక కారిడార్
సరుకు రవాణా కోసం అదనపు మార్గం
- వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో ఎంపిక?
- ప్రత్యేక రైల్వే లైను నిర్మాణానికి సన్నాహాలు
- హైస్పీడ్ సరుకు రవాణా రైళ్లకు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా దేశం నలుమూలలా సరుకు రవాణా రైల్వే కారిడార్ల నిర్మాణంలో కాజీపేట-విజయవాడ మార్గం కీలకం కాబోతోంది. ఈ రూట్‌లో సరుకు రవాణాకు ప్రత్యేకంగా అదనపు మార్గం నిర్మాణం కానుంది. దీనిపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రయాణికుల తరలింపునకు హై స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగానే, సరుకు రవాణా వేగంగా జరిగేలా, సమయపాలిత రైళ్లు పరుగుపెట్టేలా రూపకల్పన చేస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అంటే నాలుగో లైనా...
నిర్ధారిత సమయానికి సరుకు రవాణా రైలు బయలుదేరినా... ప్రయాణికుల రైళ్ల కోసం దాన్ని వీలైనన్ని ప్రాంతాల్లో నిలుపుతూ చాలా రోజుల తర్వాత గమ్యం చేరుస్తున్నారు. దీంతో ఆయా సంస్థలు రోడ్డు మార్గాన తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సరుకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పేరుతో పంజాబ్‌లోని లూథియానా నుంచి బెంగాల్‌లోని దన్‌కుని వరకు, ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పేర ముంబైలోని నెహ్రూ పోర్టు నుంచి యూపీలోని దాద్రి వరకు ప్రత్యేక మార్గాలను నిర్మిస్తున్నారు.
ఇలాగే నార్త్-సౌత్ కారిడార్, సౌత్-వెస్ట్ కారిడార్లను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో కాజీపేట మార్గం కీలకం కాబోతోంది. అయితే ఇక్కడే కొంత గందరగోళం కూడా నెలకొంది. ప్రత్యేకంగా సరుకు రవాణాకు మార్గం నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే ప్రయాణికుల రైళ్లు గరిష్ట పరిమితిని మించి నడుస్తున్నందున రైళ్ల ట్రాఫిక్ తీవ్రమైంది. దీన్ని నివారించేందుకు మూడో రైలు మార్గం నిర్మాణం చేపట్టారు. బల్లార్షా నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు దాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సరుకు రవాణాకు కూడా ప్రత్యేక మార్గం నిర్మించాలని నిర్ణయించినందున.. నాలుగో మార్గం కూడా అవసరమవుతుంది. మరి నాలుగో మార్గం నిర్మిస్తారా.. ప్రస్తుతం చేపట్టిన మూడో మార్గాన్నే దానికి కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది.
అందుబాటులోకి ప్రత్యేక వ్యాగన్లు...
ప్రస్తుతం మన గూడ్సు రైళ్లలోని ఒక్కో వ్యాగన్‌లో 20 నుంచి 22 మెట్రిక్ టన్నుల వరకు సరుకు రవాణా చేస్తున్నాయి. ప్రత్యేక కారిడార్లు వస్తే ఒక్కో వ్యాగన్‌కు దాదాపుగా 25 మెట్రిక్ టన్నుల నుంచి 30 మెట్రిక్ టన్ను ల వరకు సరుకు రవాణా చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యాగన్లను అందుబాటులోకి తేవటంతోపాటు వాటి సంఖ్యనూ భారీగా పెంచుతారు.ప్రయాణికుల రైళ్ల తరహాలో సరుకు రవాణా రైళ్లకు కూడా నిర్ధారిత వేళలతో నడుపుతారు. ఇది రైల్వేల ఆదాయాన్ని భారీగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు.