‘సబర్బన్’ పనులకు కేంద్రం ఆమోదం
► బెంగళూరు-మైసూరు మధ్య రైల్వే పనులు
► కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడి
► వివిధ అభివృద్ధి పనుకుల శంకుస్థాపన
► తీరిన కన్నడిగుల కల
► సిటీ రైల్వే స్టేషన్‌కు క్రాంతివీర సంగూళి రాయణ్ణ పేరు
బెంగళూరు (బనశంకరి) : బెంగళూరు-మైసూరు ఉపనగర మధ్య సబర్బన్ రైల్వే పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేసిందని కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. నగరంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలహంక- పెనుకొండ, అరిసికెరె-తుమకూరు, హుబ్లీ- చిక్కజాజూరు డబ్లింగ్ పనులు, కొప్పళ రైల్వేస్టేషన్ రోడ్డు ప్లైఓవర్ పనులకు ఆయన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులతో శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ పేరును లాంఛనంగా ‘క్రాంతివీర సంగొళ్లిరాయణ్ణ స్టేషన్’గా మార్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రాంతివీర సంగూళ్లి రాయణ్ణ పేరును నగర రైల్వే స్టేషన్‌కు పెట్టాలన్న కన్నడిగుల కోరిక నెరవేరిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో ముందుంజలో ఉంటుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందన్నారు. సబర్బన్ రైల్వేతో పాటు మెట్రోరైల్వే సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య దాదాపుగా తగ్గిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేశ్‌ప్రభు మాట్లాడుతూ... బెంగళూరు-మైసూరు, బెంగళూరు-హుబ్లీ మధ్య సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రారంభించే ఆలోచన ఉందని వెల్లడించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
బెంగళూరు నుంచి హుబ్లీ, మైసూరు మధ్య సెమీ హై స్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటుచేయడం వల్ల ఆయా ప్రాంతాల నుంచి ప్రతి రోజు బెంగళూరుకు వచ్చే ప్రజలకు ఉపయుక్తంగా ఉండటమే కాకుండా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యను కూడా తీరుతుందన్నారు. కేంద్ర ఎరువులు రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... బెంగళూరు- హుబ్లీ రైల్వే డబ్లింగ్ పనులను మూడేళ్లలోగా పూర్తి చేస్తే రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. పనులు పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణం 7 గంటల నుంచి నాలుగన్నర గంటకు తగ్గుతుందన్నారు.