భీమవరం (ప్రకాశంచౌక్) : దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన డబుల్‌లైన్, విద్యుదీకరణ పనులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో డబుల్‌లైన్, విద్యుదీకరణ అందుబాటులోకి వచ్చింది. కరెంటు ఇంజన్లు పరుగులు తీయనున్నాయి. దీంతో వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు. జిల్లావాసుల ఏళ్ల నాటి కల సాకారమైంది.
చివరగా 32.8 కిలోమీటర్లు
ఆరవల్లి–నిడదవోలు మధ్య 32.8 కిలోమీటర్లు మేర డబుల్ లైన్ ట్రాక్ వేయడంతో పాటు విద్యుత్‌దీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో ఈనెల 14న ఆరవల్లి–నిడదవోలు విద్యుత్ లైన్‌ను రైల్వే అధికారులు ప్రారంభించారు. దీంతో ప్రాజెక్టు పనులు అన్నిదశల్లోనూ పూర్తయినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఉమ్మడి పశ్చిమలో..
భీమవరం–నరసాపురం మధ్య 31 కిలోమీటర్లు మేర డబుల్ లైన్, విద్యుత్ లైన్ పనులు పూర్తికాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ లైనులో రైళ్లు నడుపుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో భీమవరం–నరసాపురం, ఆరవల్లి–నిడదవోలు లైన్లలో మొత్తం 63.8 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ల పనులు పూర్తయ్యాయి.
221 కిలోమీటర్ల మేర.. దక్షిణ మధ్య రైల్వే (రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్) ద్వారా విజయవాడ–గుడివాడ–భీమవరం–నరసా పురం, మచిలీపట్నం–గుడివాడ–భీమవరం–నిడదవోలు మధ్య మొత్తం 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణ పనులను రూ.3 వేల కోట్లతో ఐదు దశల్లో చేపట్టారు. 2012లో పనులు ప్రారంభమ య్యాయి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ఇది నిలిచింది. దీని వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లనుంది.
ప్రాజెక్టుతో లాభాలెన్నో..
మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు సరు కు, ప్రయాణికుల రవాణా అభివృద్ధికి దోహదం.
కొత్త డబుల్ లైన్ రైలు మార్గం రవాణా వ్యవస్థ మెరుగుదలతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చనుంది.
అధిక సంఖ్యలో ప్యాసింజర్ రైళ్ల సేవలను ప్రారంభించడానికి అవకాశం ఉంది.
నౌకాశ్రయ / నదీ తీర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ప్రోత్సాహంతో ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది.
విద్యుదీకరణ పనుల వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించడం, ఇంధన ఆదాతో పాటు వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
విజయవాడ–విశాఖపట్నం మధ్య కోస్టల్ రైలు కారిడార్‌కు ఇది ప్రత్యామ్నాయ రైలు మార్గంగా మారనుంది.
క్లిష్టమైన ప్రాజెక్టు
అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇన్‌చార్జి అరుణ్‌కుమార్‌జైన్ సంతృప్తి వ్యక్తం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. పనులు చిత్తశుద్ధితో, అంకితభావంతో పూర్తిచేసినందుకు జోనల్ హెడ్ క్వార్టర్స్ బృందం, విజయవాడ డివిజన్–ఆర్‌వీఎన్‌ఎల్ అధికారులను ప్రత్యేకంగా అభినందించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment