double line
-
ఇక విద్యుత్ రైళ్ల పరుగు..వేగంగా గమ్యానికి!
భీమవరం (ప్రకాశంచౌక్) : దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన డబుల్‌లైన్, విద్యుదీకరణ పనులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో డబుల్‌లైన్, విద్యుదీకరణ అందుబాటులోకి వచ్చింది. కరెంటు ఇంజన్లు పరుగులు తీయనున్నాయి. దీంతో వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు. జిల్లావాసుల ఏళ్ల నాటి కల సాకారమైంది. చివరగా 32.8 కిలోమీటర్లు ఆరవల్లి–నిడదవోలు మధ్య 32.8 కిలోమీటర్లు మేర డబుల్ లైన్ ట్రాక్ వేయడంతో పాటు విద్యుత్దీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో ఈనెల 14న ఆరవల్లి–నిడదవోలు విద్యుత్ లైన్‌ను రైల్వే అధికారులు ప్రారంభించారు. దీంతో ప్రాజెక్టు పనులు అన్నిదశల్లోనూ పూర్తయినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి పశ్చిమలో.. భీమవరం–నరసాపురం మధ్య 31 కిలోమీటర్లు మేర డబుల్ లైన్, విద్యుత్ లైన్ పనులు పూర్తికాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ లైనులో రైళ్లు నడుపుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో భీమవరం–నరసాపురం, ఆరవల్లి–నిడదవోలు లైన్లలో మొత్తం 63.8 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ల పనులు పూర్తయ్యాయి. 221 కిలోమీటర్ల మేర.. దక్షిణ మధ్య రైల్వే (రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్) ద్వారా విజయవాడ–గుడివాడ–భీమవరం–నరసా పురం, మచిలీపట్నం–గుడివాడ–భీమవరం–నిడదవోలు మధ్య మొత్తం 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణ పనులను రూ.3 వేల కోట్లతో ఐదు దశల్లో చేపట్టారు. 2012లో పనులు ప్రారంభమ య్యాయి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ఇది నిలిచింది. దీని వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లనుంది. ప్రాజెక్టుతో లాభాలెన్నో.. మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు సరు కు, ప్రయాణికుల రవాణా అభివృద్ధికి దోహదం. కొత్త డబుల్ లైన్ రైలు మార్గం రవాణా వ్యవస్థ మెరుగుదలతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చనుంది. అధిక సంఖ్యలో ప్యాసింజర్ రైళ్ల సేవలను ప్రారంభించడానికి అవకాశం ఉంది. నౌకాశ్రయ / నదీ తీర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ప్రోత్సాహంతో ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. విద్యుదీకరణ పనుల వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించడం, ఇంధన ఆదాతో పాటు వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. విజయవాడ–విశాఖపట్నం మధ్య కోస్టల్ రైలు కారిడార్‌కు ఇది ప్రత్యామ్నాయ రైలు మార్గంగా మారనుంది. క్లిష్టమైన ప్రాజెక్టు అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇన్చార్జి అరుణ్‌కుమార్‌జైన్ సంతృప్తి వ్యక్తం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. పనులు చిత్తశుద్ధితో, అంకితభావంతో పూర్తిచేసినందుకు జోనల్ హెడ్ క్వార్టర్స్ బృందం, విజయవాడ డివిజన్–ఆర్వీఎన్ఎల్ అధికారులను ప్రత్యేకంగా అభినందించినట్టు చెప్పారు. -
చార్ధామ్ హైవే ప్రాజెక్టుకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని వ్యూహాత్మక చార్ధామ్ హైవే ప్రాజెక్టు డబుల్‌లేన్ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. జాతీయ భద్రతకు ఇటీవలి కాలంలో పలు సవాళ్లు ఎదురయ్యాయని, సరిహద్దుల్లోకి వేగంగా సైనిక బలగాలను తరలించడానికి ఈ రహదారి విస్తరణ అవసరమని వ్యాఖ్యానించింది. సాయుధ బలగాలకు అవసరమైన మౌలి క సదుపాయాల విషయంలో న్యాయస్థానం మరో సారి సమీక్ష చేపట్టలేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రాజెక్టుపై నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక అందజేసేందుకు మాజీ జడ్జి జస్టిస్ సిక్రి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ప్రాజెక్ట్‌లో క్యారేజ్ వే వెడల్పు 5.5 మీట ర్లు ఉండేలా 2018 సర్క్యులర్‌ను అనుసరించా లంటూ 2020న సుప్రీం ఇచ్చిన ఆదేశాలను సవరించాలం టూ రోడ్డు రవాణా, రహదారుల శాఖ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ తీర్థయాత్రాస్థలాలను కలుపుతూ ఏడాదంతా రాకపోకలు సాగిం చేందుకు వీలుగా కేంద్రం రూ.12వేల కోట్ల ఖర్చు తో 900 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. -
ప్రయాణికులకు తీపికబురు.. ఉందానగర్– షాద్‌నగర్ రైల్వేలైన్ రెడీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ మార్గంలో చేపట్టిన రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఉందానగర్ నుంచి షాద్‌నగర్ వరకు కీలకమైన 29.7 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. దీంతో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కడప, తిరుపతి తదితర నగరాలకు రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉందానగర్ నుంచి షాద్‌నగర్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన సెక్షన్లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేష్ తెలిపారు. సికింద్రాబాద్–డోన్ సెక్షన్లో ప్రస్తుత సింగిల్ లైన్లో రద్దీ నివారణకు, సికింద్రాబాద్ నుంచి గొల్లపల్లి వరకు సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రవాణాకు ఈ లైన్ ఎంతో దోహదంచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గొల్లపల్లి–మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
డబుల్ లైన్‌కు పట్టాభిషేకం
సాక్షి, ఆకివీడు: ఇది ఎన్నాళ్లో వేచిన ఉదయం.. విజయవాడ–నరసాపురం బ్రాంచి మార్గంలో డబుల్ ట్రాక్ దశాబ్దాల కల.. అది ఈనాటికి సాకారమవుతోంది. తొలిదఫాగా ఆకివీడు– మోటూరు మధ్య డబుల్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి రెండు పట్టాలపై రైళ్లు దౌడుతీయనున్నాయి. నరసాపురం– విజయవాడ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఈ మార్గంలో తొలిదఫాగా ఆకివీడు– మోటూరు మధ్య డబుల్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. ఆశించిన మేరకు నిధులు విడుదల కావడంతో పనులు వేగవంతంగా జరిగాయి. గురువారం ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. దీంతో శుక్రవారం నుంచి రైళ్లను రెండో లైన్‌పైనా నడిపించనున్నారు. దీంతో విజయవాడ నుంచి భీమవరం వైపు వచ్చే రైళ్లు రెండో ట్రాక్‌పైన, భీమవరం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు పాత ట్రాక్‌పైనా వెళ్లనున్నాయి. నరసాపురం మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజుతోపాటు ప్రస్తుత వైఎస్సార్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ డబుల్ లైన్ కోసం ప్రత్యేక కృషి చేశారు. సందడే సందడి డబుల్ లైన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుండడంతో 38కిలోమీటర్ల మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్లలో సందడి వాతావరణం నెలకొంది. గురువారం ట్రయల్ రన్‌ను ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భారీగా తరలివచ్చి తిలకించారు. 8 దశాబ్దాల చరిత్రగల బ్రాంచి లైన్ నరసాపురం– విజయవాడ బ్రాంచి రైల్వే లైన్‌కు 8 దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలోనే విజయవాడ నుంచి నరసాపురం బ్రాంచి రైల్వేలైన్ ఏర్పడింది. సముద్ర తీరంలో ఉన్న నర్సాపురం ప్రాంతం నుంచి రైలు మార్గం కోసం బ్రాంచి లైన్‌ను మొదట మీటర్‌గేజ్‌గా నిర్మించారు. స్వాతంత్య్రానంతరం బ్రాడ్‌గేజ్‌గా అభివద్ధి చేశారు. అప్పటి నుంచి బ్రాంచి రైల్వే లైన్ అభివద్ధి అంగుళం కూడా కదల్లేదు. చెక్క స్లీపర్లపై పట్టాలను ఏర్పాటుచేసి రైళ్లు నడిపారు. దశాబ్దాలుగా బొగ్గు రైళ్లను ఈ ప్రాంతంలో నడిపారు. 1990లో బ్రాంచి రైల్వే లైన్లో డీజిల్ ఇంజిన్లతో రైళ్ళను నడిపారు. బ్రాంచి లైన్లో మొట్టమొదటిగా కాకినాడ–మద్రాసు సర్కార్ఎక్స్ప్రెస్ను నడిపారు. బొగ్గుతో నడిచే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఈ లైన్లో కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లేది. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రాంతంలో కొంత చరిత్ర కూడా ఉంది. జై ఆంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులు సర్కార్ ఎక్స్‌ప్రెస్ చక్రాల్ని పీకేసి, పట్టాని కూడా ఊడబీకి, పక్కనే ఉన్న రైల్వే కొలిమిలో పారవేశారు. కోస్తాలో బ్రాంచి రైల్వే లైన్లు కోస్తా ప్రాంతాల్ని అభివద్ధి చేయడంలో భాగంగా 1936–38 ప్రాంతంలో విజయవాడ నుంచి ఆయా మార్గాలకు రైలు సౌకర్యాన్ని కల్పించారు. మొట్టమొదటిగా విజయవాడు–నరసాపురం లైన్ నిర్మించారు. ఆ తరువాత విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–గుడివాడ, భీమవరం–నిడదవోలు బ్రాంచి రైల్వే లైన్లను మీటర్ గేజ్‌లో ఏర్పాటు చేశారు.2013లో కేంద్ర ప్రభుత్వం బ్రాంచి రైల్వేలైన్ల ఆధునికీకరణకు రూ.1,850 కోట్లు కేటాయించింది. నాలుగు విభాగాలుగా టెండర్లు బ్రాంచి రైల్వే లైన్లు విద్యుదీకరణ, డబులింగ్ పనులను ముక్కలుగా విభజించి టెండర్లు పిలిచారు. మొదట్లో విజయవాడ–గుడివాడ, గుడివాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు, విజయవాడ–మచిలీపట్నం, భీమవరం–నరసాపురం ప్రాంతాల అభివద్ధికి నిధులు కేటాయించి, టెండర్లు పిలిచారు. తొలుత విజయవాడ–గుడివాడ, గుడివాడ–నరసాపురం మధ్య పనులు మొదలుపెట్టారు. అయితే కాంట్రాక్టర్ కొంతమేర పనులు చేసి చేతులెత్తేయడంతో మళ్లీ పనులు స్తంభించిపోయాయి. ఆ తరువాత మళ్లీ టెండర్లు పిలవడంతో గుడివాడ–భీమవరం మధ్య నాగార్జున కనస్ట్రక్షన్ పనులు దక్కించుకుని వేగవంతం చేసింది. హౌరాకు రైలు నడపాలి బ్రాంచి రైల్వేలైన్ ఆధునికీకరణ చేయడంతో కొత్త రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధికి రైల్వే దోహదపడాలి. హౌరా, బెంగళూరు ప్రాంతాలకు కొత్త రైళ్లను నడపాలి. డబులింగ్, విద్యుదీకరణతో రైళ్ల వేగం పెరిగి, కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంది. – సిహెచ్.నాగరాజు, ఆకివీడు ఆనందదాయకం బ్రాంచి రైల్వే లైన్ అభివృద్ధిలో ఆకివీడు–మోటూరు వరకూ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరగడం హర్షదాయకం. ఈ ప్రాంతానికి చెందిన అప్పటి ఎంపీ కనుమూరి బాపిరాజు కృషి వల్ల డబులింగ్, విద్యుదీకరణ పనులకు నిధులు మంజూరయ్యాయి. – నేరెళ్ల పెదబాబు, రైల్వే బోర్డు సభ్యుడు, ఆకివీడు -
పాలమూరు రైల్వే ప్రాజెక్టులకు నిదులు
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కరుణించింది. గతేడాది తరహాలోనే మునీరాబాద్ రైల్వేలైన్‌కు రూ.275కోట్లు కేటాయించగా.. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు మరో రూ.200 కోట్లు కేటాయించినట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరోవైపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మాచర్ల–గద్వాల రైల్వేలైన్‌తో పాటు మహబూబ్‌నగర్ ఆదర్శ రైల్వేస్టేషన్‌కు ఈ ఏడాది కూడా మోక్షం కలగలేదు. ఇటీవలే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల వివరాలను గురువారం దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. బడ్జెట్లో మహబూబ్‌నగర్– మునీరాబాద్ రైల్వే, సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధిక నిధులు వెచ్చించారు. మునీరాబాద్‌కు గతేడాది రూ.275 కోట్లు కేటాయించగా ఈసారి కూడా రూ.275 రావడం విశేషం. అలాగే డబ్లింగ్ లైన్‌కు రూ.200 కోట్లు విడుదల చేశారు. రెండేళ్ల నుంచి అధికం.. దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు గత రెండేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఉందానగర్ నుంచి ప్రారంభమైన డబ్లింగ్ రైల్వే పనులు జిల్లా పరిధిలో చురుగ్గా సాగుతున్నాయి. ఈ రైల్వే లైన్ పూర్తిపై ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 9 మేజర్, 92 మైనర్ బ్రిడ్జిల నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయి. ఏడాదిలోపు డబ్లింగ్ లైన్ పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. తగ్గనున్న దూరభారం సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ లైన్ పూర్తయితే జిల్లా ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. మహబూబ్‌నగర్ నుంచి వంద కి.మీ. దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ప్యాసింజర్‌కు 3 గంటలు, ఎక్స్‌ప్రెస్‌కు 2.30 గంటల సమయం పడుతుంది. డబ్లింగ్ లైన్ పూర్తయితే గంట సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. పురోగతిలో మునీరాబాద్ మహబూబ్‌నగర్– మునీరాబాద్ రైల్వేలైన్ 246 కి.మీ. నిర్మాణానికి 1997– 98లో ఆమోద ముద్ర లభించింది. రూ.645 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టగా ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో రూ.275 కోట్లు కేటాయించారు. గతేడాది సైతం ఇదే స్థాయిలో నిధులు వచ్చాయి. ఈ లైన్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 29 కి.మీ. మేర పూర్తయ్యాయి. దేవరకద్ర– జక్లేర్ మధ్య లైన్ పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని కృష్ణాతో పాటు కర్ణాటక రాష్ట్రం మునీరాబాద్ పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయి. సర్వేల్లోనే గద్వాల– మాచర్ల గద్వాల– మాచర్ల రైల్వేలైన్ నిర్మాణం కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఆమోదమే లభించలేదు. దీని కోసం మూడు సార్లు సర్వే పూర్తయినా రైల్వేలైన్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభకాకపోవడం ఈ ప్రాంత ప్రయణికులను ఆవేదనకు గురిచేస్తోంది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా మార్చాలన్న డిమాండ్ కూడా నెరవేరడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేటి నుంచి రైళ్ల దారి మళ్లింపు
ఆదోని అగ్రికల్చర్: గురువారం నుంచి 4వ తేదీ వరకు 4రైళ్లు దారిమళ్లించి నడుపుతున్నట్లు ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ పరశురామ్ బుధవారం విలేకరులకు తెలిపారు. వాడి, రాయచూరు ప్రాంతాల్లో డబుల్ లైన్ పనులు జరుగుతుండడం వల్ల పూణె నుంచి రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ట్రైన్ నం.16381 ముంబయి–కన్యాకుమారి రెండు రోజులు, నం.11013 కుర్ల ఎక్స్‌ప్రెస్ మూడు రోజులు, నం.12164 చెన్నై ఎక్స్‌ప్రెస్ రెండు రోజులు, నం.16382 కన్యాకుమారి–ముంబయి ట్రైన్లు పూణె నుంచి మేరేజ్, బళ్లారి, గుంతకల్ మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.