Railway works
-
ఇక విద్యుత్ రైళ్ల పరుగు..వేగంగా గమ్యానికి!
భీమవరం (ప్రకాశంచౌక్) : దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన డబుల్‌లైన్, విద్యుదీకరణ పనులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో డబుల్‌లైన్, విద్యుదీకరణ అందుబాటులోకి వచ్చింది. కరెంటు ఇంజన్లు పరుగులు తీయనున్నాయి. దీంతో వేగంగా గమ్యానికి చేరుకోవచ్చు. జిల్లావాసుల ఏళ్ల నాటి కల సాకారమైంది. చివరగా 32.8 కిలోమీటర్లు ఆరవల్లి–నిడదవోలు మధ్య 32.8 కిలోమీటర్లు మేర డబుల్ లైన్ ట్రాక్ వేయడంతో పాటు విద్యుత్దీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో ఈనెల 14న ఆరవల్లి–నిడదవోలు విద్యుత్ లైన్‌ను రైల్వే అధికారులు ప్రారంభించారు. దీంతో ప్రాజెక్టు పనులు అన్నిదశల్లోనూ పూర్తయినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి పశ్చిమలో.. భీమవరం–నరసాపురం మధ్య 31 కిలోమీటర్లు మేర డబుల్ లైన్, విద్యుత్ లైన్ పనులు పూర్తికాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ లైనులో రైళ్లు నడుపుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో భీమవరం–నరసాపురం, ఆరవల్లి–నిడదవోలు లైన్లలో మొత్తం 63.8 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ల పనులు పూర్తయ్యాయి. 221 కిలోమీటర్ల మేర.. దక్షిణ మధ్య రైల్వే (రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్) ద్వారా విజయవాడ–గుడివాడ–భీమవరం–నరసా పురం, మచిలీపట్నం–గుడివాడ–భీమవరం–నిడదవోలు మధ్య మొత్తం 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణ పనులను రూ.3 వేల కోట్లతో ఐదు దశల్లో చేపట్టారు. 2012లో పనులు ప్రారంభమ య్యాయి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ఇది నిలిచింది. దీని వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లనుంది. ప్రాజెక్టుతో లాభాలెన్నో.. మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు సరు కు, ప్రయాణికుల రవాణా అభివృద్ధికి దోహదం. కొత్త డబుల్ లైన్ రైలు మార్గం రవాణా వ్యవస్థ మెరుగుదలతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చనుంది. అధిక సంఖ్యలో ప్యాసింజర్ రైళ్ల సేవలను ప్రారంభించడానికి అవకాశం ఉంది. నౌకాశ్రయ / నదీ తీర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం, ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ప్రోత్సాహంతో ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. విద్యుదీకరణ పనుల వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించడం, ఇంధన ఆదాతో పాటు వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. విజయవాడ–విశాఖపట్నం మధ్య కోస్టల్ రైలు కారిడార్‌కు ఇది ప్రత్యామ్నాయ రైలు మార్గంగా మారనుంది. క్లిష్టమైన ప్రాజెక్టు అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇన్చార్జి అరుణ్‌కుమార్‌జైన్ సంతృప్తి వ్యక్తం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. పనులు చిత్తశుద్ధితో, అంకితభావంతో పూర్తిచేసినందుకు జోనల్ హెడ్ క్వార్టర్స్ బృందం, విజయవాడ డివిజన్–ఆర్వీఎన్ఎల్ అధికారులను ప్రత్యేకంగా అభినందించినట్టు చెప్పారు. -
రైల్వే డబ్లింగ్ పనులను అడ్డుకున్న రైతులు
గుంటూరు,యడ్లపాడు(చిలకలూరిపేట): గుంటూరు– గుంతకల్లు రైల్వే డబ్లింగ్ నిర్మాణ పనులకు మరోమారు చెక్ పడింది. తమ భూముల్లో పనులను నిర్వహిస్తున్న అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడంపై రైతులు కన్నెర్ర జేశారు. పాలకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఎంతకూ పట్టించుకోకపోవడంతో సహనం కోల్పోయారు. దీంతో పలు గ్రామాల ప్రజలు శుక్రవారం గొరిజవోలు గ్రామంలోని రైల్వేట్రాక్‌పై నిర్వహిస్తున్న పనులను అడ్డుకున్నారు. రైతుల అభ్యంతరం మేరకు పనులు ఆపి, ట్రాక్ వద్ద నుంచి వారు వెళ్లిపోయాక తిరిగి పనులు ప్రారంభించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు పనులు నిలుపుదల చేయకతప్పలేదు. దీంతో రైల్వే డబుల్‌లైన్ పనులు మారోమారు నిలిచిపోయాయి. ఎంత భూమి తీసుకున్నదీ ఎందుకు చెప్పరు? నాదెండ్ల మండల పరిధిలోని గొరిజవోలు, చందవరం, సాతులూరు గ్రామాల్లో విజయవాడ ఐఆర్ఈఈఎస్ అధికా>రులు 2017 మేలో డబ్లింగ్ పనులను ప్రారంభించారు. డబుల్ లైన్ల ఏర్పాటుకు ఆయా గ్రామాల్లోని రైతుల భూములను సేకరించారు. రెండు ఫేజులుగా నిర్వహించే ఈ పనులకు భూములిచ్చిన రైతులకు ఎంతమేర భూమి సేకరిస్తున్నారో నోటీసులు సైతం అధికారులు ఇవ్వలేదు. ఈ విషయంపై బాధిత రైతులు జిల్లాస్థాయి అధికారులను అనేకమార్లు కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. గతేడాది డిశంబర్ 15వ తేదీ నాటికే నోటీసులను ఇచ్చి పరిహారం విషయం కూడా చర్చిస్తామని చెప్పారు. అయితే జనవరి 15 దాటినా తమకు ఎటువంటి సమాచారం అందకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బాధిత రైతులంతా కలిసి శుక్రవారం గ్రామంలోని రైల్వేట్రాక్ వద్దకు చేరుకున్నారు. నిర్మాణ పనులను అడ్డుకుని నిలుపుదల చేయించారు. తమకు నోటీసులు ఇచ్చి పరిహారం విషయం తేల్చేవరకు పనులను కొనసాగించేందుకు వీల్లేదంటూ పనులను ఆపించారు. గతనెల 24వ తేదీన ఇదే గ్రామంలోని ట్రాక్‌పై పనులు నిలుపుదల చేయడంతో అటు రెవెన్యూ, ఇటు రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు రైతులకు ఫోన్లు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి పనులు తిరిగి కొనసాగించారు. ఆ తర్వాత సుమారు నెల రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో రైతులు మళ్లీ పనులను అడ్డుకున్నారు. ప్రిలిమినరీ నోటీసులు పంపించాం రైల్వే డబుల్ లైన్ల పనులకు మండలంలోని గొరిజవోలులో 16 మంది రైతుల నుంచి 2.92 ఎకరాలను, సాతులూరులో 36 మంది రైతుల నుంచి 6.84 ఎకరాలను సేకరిస్తున్నట్టు ప్రతిపాదనలు గత నెలలోనే కలెక్టర్ కార్యాలయానికి పంపించాం. దీనిపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. –మేడిద శిరీష, తహసీల్దార్ -
పనుల్లో వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తలపెట్టిన రైల్వే పనుల్లో వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌కు ఎంపీలు విన్నవించారు. గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, లింగయ్య యాదవ్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆర్ఆర్ పాటిల్, మల్లారెడ్డి, బాల్కసుమన్, దత్తాత్రేయ, నంది ఎల్లయ్య హాజరయ్యారు. ఆయా ఎంపీల నియోజకవర్గాల్లో జరుగుతున్న రైల్వేపనుల పురోగతి, పెం డింగ్ పనులు, ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి)లు, ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి)లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, కొత్త లైన్ సర్వేలు, భూసేకరణ విషయాలపై చర్చించారు. అనంతరం చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. సంతృప్తికరమే: జితేందర్‌రెడ్డి సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. భూసేకరణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని జీఎంను కోరాం. షాద్‌నగర్ ఆర్వోబీ నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించాం. నడికుడి రైల్వే లైన్ చేపట్టండి: గుత్తా, లింగయ్య నల్లగొండలో రైల్వే ప్రాజెక్టుల పనులు సంతృప్తికరంగా లేవు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరాం. మాచర్ల–నల్లగొండ రైల్వే లైన్ 20 ఏళ్ల కింద అనుమతులొచ్చినా.. పక్కనపెట్టడం సరికాదు. ఆర్థికంగా ప్రయోజనకరమైన నడికుడి–బీబీనగర్ డబ్లింగ్ పనులను చేపట్టాలి. హాల్టింగులు పెంచాలి: బూర నర్సయ్య రాయగిరి స్టేషన్ పేరును యాదాద్రిగా మార్చాలని జీఎంను కోరాం. భువనగిరిలో శాతవాహన, నాందేడ్, విశాఖపట్నంతో పాటు పలు రైళ్లకు హాల్టింగ్‌లు ఇవ్వాలని లేఖ ఇచ్చాం. హైదరాబాద్–అమరావతి–మచిలీపట్నం వరకు సూపర్ ఫాస్ట్ హైస్పీడ్ ట్రైన్ వేయాలి. రైల్వే విధానం మారాలి: విశ్వేశ్వర్‌రెడ్డి రైల్వే విధానంలో మార్పు రావాలి. రైల్వే అన్ని వర్గాలకు అందుబాటులోకి రావాలి. సూపర్ ఫాస్ట్ పేరుతో చాలా రైళ్లను స్థానికంగా ఆపడం లేదు. కొత్త లైన్ వేయండి: ఆర్ఆర్ పాటిల్ జహీరాబాద్‌కు కొత్త రైళ్లు వేయాలని జీఎంను కోరాం. సిద్దిపేట–సంగారెడ్డి–పటాన్చెరు నుంచి సికింద్రాబాద్‌కు నేరుగా లైన్ వేయాలని విన్నవించాం. శివారు స్టేషన్లను అభివృద్ధి చేయండి: మల్లారెడ్డి చర్లపల్లి టెర్మినల్ పనులు మొదలుపెట్టాలి. సికింద్రాబాద్ స్టేషన్‌పై రద్దీ భారాన్ని తగ్గించేందుకు మల్కాజ్గిరి, మేడ్చల్ వంటి శివారు స్టేషన్లను అభివృద్ధి చేయాలి. కొత్త లైన్, రైళ్లు కావాలి: వినోద్ మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు రూ.500 కోట్లు కేటాయించారు. వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులివ్వాలని కోరాం. పాలమూరు నుంచి కాచిగూడ మేడ్చల్ నిజామాబాద్ వరకు కొత్త రైలు వేయాలని విన్నవించాం. సదుపాయాలు ఏర్పాటు చేయాలి: బాల్క పెద్దపల్లి నియోజవర్గంలోని రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాలలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు వీలైన సదుపాయాలు కల్పించాలని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే: దత్తాత్రేయ హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్–1, ఎంఎంటీఎస్–2 తెచ్చిన ఘనత బీజేపీదే. రైల్వే తరఫున పూర్తి నిధులు విడుదలయ్యేలా కేంద్రం కృషి చేసినా రాష్ట్రం వాటా అందకపోవడం వల్లే ఎంఎంటీఎస్–2 ప్రారంభం కావడం లేదు. సికింద్రాబాద్–యాదాద్రి, కాజీపేట–సికింద్రాబాద్ మూడో లైన్, చర్లపల్లి టెర్మినల్ పనులు మొదలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే కారణం.. సీఎం వివక్ష చూపిస్తున్నారు: నంది ఎల్లయ్య సమావేశం నుంచి నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య వాకౌట్ చేశారు. తన నియోజకవర్గంలోని రైల్వే ప్రాజెక్టుల కోసం సీఎం అనుమతి కోసం తిరుగుతున్నా అపాయింట్ మెంట్ దొరకడం లేదని, 12 లేఖలు రాసినా స్పందన లేదని వాపోయారు. గద్వాల్–వనపర్తి–నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేటలలో ప్రతిపాదిత రైలు మార్గానికి రైల్వే శాఖ ఓకే చెప్పినా సీఎం ఫైల్‌పై సంతకం చేయడం లేదన్నారు. ఆరు రెట్లు అధిక నిధులు: జీఎం వినోద్ 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.1,890 కోట్లు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాజెక్టులపై వెచ్చించిందని జీఎం వినోద్ కుమార్ చెప్పారు. చర్లపల్లి టెర్మినల్‌కు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. ‘తెలంగాణలో 100 కి.మీ. మేర డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు పూర్తయ్యాయి. ఎంఎంటీఎస్–2 పనులు వేగంగా నడుస్తున్నాయి. తెలంగాణ వాటా ఇంకా రూ.336 కోట్లు రావాల్సి ఉంది. అక్టోబర్ కల్లా తెలంగాణలో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్ ఉండవు. ఘట్కేసర్–యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి రైల్వే సిద్ధంగా ఉంది. ఇందుకు రాష్ట్రమే ముందుకురావాలి. మనోహరాబాద్–కొత్తపల్లి మార్గంలో భూసేకరణ వేగంగా జరుగుతోంది. కరీంనగర్–హసన్‌పర్తి రైల్వే లైన్ సర్వే వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తాం’అని ఆయన చెప్పారు. -
సహకరిస్తాం.. పనులు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో సమావేశమై చర్చించారు. తెలంగాణలోని వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చర్చలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను రైల్వే జీఎంతో చర్చించారు. - ఎంఎంటీఎస్ ఫేజ్–2లో భాగంగా చేపట్టిన తెల్లాపూర్–రామచంద్రాపురం లైన్‌ను వెంటనే ప్రారంభించాలని జీఎంను ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాల్సి ఉందని, అవి రాగానే ప్రారంభిస్తామని జీఎం చెప్పారు. - తెల్లాపూర్– బీహెచ్ఈఎల్ మార్గంలోని రైల్వే అండర్ పాస్ ఇరుగ్గా మారిందని, దీనిని విస్తరించాలని ఎంపీ కోరారు. ఇందుకోసం రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేయించేందుకు తాను సుముఖంగా ఉన్నానని ఎంపీ తెలిపారు. నిధులు విడుదల చేస్తే, పనులు మొదలుపెట్టేందుకు అభ్యంతరం లేదని జీఎం సమాధానమిచ్చారు. - కొల్లూరు సర్వీసు రోడ్డు వద్ద ఉన్న రైల్వేట్రాక్‌పై ఆర్వోబీ నిర్మించాలని కోరారు. ఈ ప్రాంతం హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. హెచ్ఎండీఏ– రైల్వే అధికారులకు ఈ విషయంలో సమన్వయం కొరవడిన కారణంగా ఈ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని కోరగా డీపీఆర్ సిద్ధమై నిధులు విడుదలైతే వెంటనే మొదలుపెడతామని జీఎం హామీనిచ్చారు. - ఈదుల నాగులపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. దీనికోసం అక్కడ 300 ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే అక్కడ 150 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉంది. ఇక మిగిలిన 150 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీఎంకు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై హెచ్ఎండీఏ– రైల్వే అధికారులు చీఫ్ సెక్రటరీ జోషీతో కలసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశానని ఎంపీ తెలిపారు. -
రైల్వే పనులకు పోటాపోటీగా టెండర్లు
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని యర్రగుంట్ల– నోస్సం మధ్య కొత్త రైలు మార్గంలో వంతెన నిర్మాణ పనులకు గాను సోమవారం నిర్వహించిన టెండర్లలో తెలుగుదేశం నేతలు, ఫ్యాక్షనిస్టులు తమ హవాను కొనసాగించారు. ముందుగానే గుంతకల్లు పట్టణానికి చేరుకున్న నాయకులు, ఫ్యాక్షనిస్టులు పలు లాడ్జీల్లో మకాం వేసి కాంట్రాక్టర్ల మధ్య సిండికేట్ చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ఈ పనులకు కాంట్రాక్టర్ల మధ్య సిండికేట్ కావడానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సురేష్ చౌదరి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి తనయుడు, తుంగభద్ర ప్రాజెక్ట్ హైలెవల్ కెనాల్ చైర్మన్ హనుమంతరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ల మధ్య జరిపిన చర్చలు విఫలం కావడంతో పోటాపోటీగా షెడ్యూళ్ల దాఖలు అయ్యాయి. యర్రగుంట్ల–నోస్సం మధ్య నూతన రైలు మార్గంలో దాదాపు 10 చోట్ల ఆర్ఓబీ (రోడ్డు అండర్ బ్రిడ్జి) పనులకు రూ.37,13 కోట్లతో టెండర్లు పిలువగా 09 షెడ్యూళ్లు దాఖలు చేశారు. డీఆర్ఎం కార్యాలయం వద్ద గుంపులుగా ఉన్న వారిని గుంతకల్లు వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు సిబ్బందితో చెదరగొట్టి ఎలాంటి ఘటనలు జరగకుండా చేశారు. -
7న కొత్తపల్లి–మనోహరాబాద్ రైలే ్వ లైనుకు శంకుస్థాపన
ఏడాది చివరి నాటికి భూసేకరణ పూర్తి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కరీంనగర్ సిటీ : కరీంనగర్–హైదరాబాద్‌లను కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైనుకు ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంఖుస్థాపన చేస్తారని ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల మీదుగా 151.36 కిలోమీటర్లతో ఈ లైను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 1260 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 60 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 900 ఎకరాల భూమి అవసరమన్నారు. మెదక్ జిల్లాలో 900 ఎకరాలు సేకరించామని, వరంగల్ జిల్లాలోని 60 ఎకరాలు సేకరించి పెగ్‌మార్కింగ్ చేపట్టామన్నారు. జిల్లాలో ఈ ఏడాది చివరివరకు భూసేకరణ పూర్తవుతుందన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నపుడు జిల్లా కేంద్రం, రాజధానిలను కలిపేందుకు ఈ లైనును ప్రతిపాదించారన్నారు. మూడవ వంతు రాష్ట్ర వాటా కింద అప్పటి ప్రభుత్వం అంగీకరించి, ఉచితంగా భూమిని ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. మొదటి ఐదు సంవత్సరాల్లో రైల్వే శాఖకు నష్టం వస్తే భరించాలనే ప్రతిపాదనకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. పెద్దపల్లి–కరీంనగర్–నిజామాబాద్ రైల్వే లైను 26 సంవత్సరాలైనా పూర్తి కాలేదని, ఈ కొత్తపల్లి–మనోహరాబాద్ లైన్ మాత్రం వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. సిరిసిల్లలో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కారిడార్ నిర్మించనున్నట్లు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త జిల్లాలు రెండే ఉంటాయన్నారు. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు పీపుల్స్ కాంటాక్ట్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జిల్లాలో విమానాశ్రయానికి బదులు ఎయిర్స్ ట్రిప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలగందుల, ఎల్ఎండీ ప్రాంతాలను ఇందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే బొడిగె శోభ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా రైల్వే సొరంగం పనులు
8 కిలోమీటర్లు పొడవు రూ.470.29 కోట్ల వ్యయం రాపూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి కడప జిల్లా ఓబులవారిపల్లి వరకు నిర్మించనున్న రైల్వే మార్గంలో భాగంగా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాధవయ్యపాళెం( రాపూరు సమీపంలోని వెలుగొండల్లో ) వద్ద రైల్వే సొరంగమార్గ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వెలుగొండల్లో అటువైపు వైఎస్సార్ జిల్లా ఇటు వైపు నెల్లూరు జిల్లా ఉండడం తెలిసిందే. ఇప్పటికే రెండు జిల్లాలను కలుపుతూ రాపూరు–చిట్వేలి మార్గమధ్యలో ఘాట్ రోడ్డు నిర్మించారు. నూతనంగా రైల్వే సొరంగ మార్గానికి ప్రభుత్వం రూ.470.29 కోట్లు కేటాయించడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్గం సుమారు 8 కిలోమీటర్ల పోడవు ఉంటుందని రైల్వే వికాస్ నిగామ్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. చెర్లోపల్లి వద్ద పనుల నిర్వహణ: వైఎస్సార్ జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామ వెలుగొండల్లో రైల్వే సొరంగం మార్గ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు కిలో మీటరు, రాపూరు సమీప అడవుల్లో 750 మీటర్లు పూర్తయ్యాయి. రెండేళ్లల్లో పూర్తికావచ్చు: రాపూరు–చిట్వేలి మార్గ మధ్యలో నిర్మిస్తున్న సొరంగం సుమారు 2 సంవత్సరాల్లో పూర్తి కావచ్చని రైల్వే అధికారులు చెప్పారు. పనులు పూర్తయితే ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నంకు ఇనుపఖనిజం, ముగ్గురాళ్లు నేరుగా కృష్ణపట్నంకు తరలించవచ్చన్నారు. -
‘సబర్బన్’ పనులకు కేంద్రం ఆమోదం
► బెంగళూరు-మైసూరు మధ్య రైల్వే పనులు ► కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడి ► వివిధ అభివృద్ధి పనుకుల శంకుస్థాపన ► తీరిన కన్నడిగుల కల ► సిటీ రైల్వే స్టేషన్‌కు క్రాంతివీర సంగూళి రాయణ్ణ పేరు బెంగళూరు (బనశంకరి) : బెంగళూరు-మైసూరు ఉపనగర మధ్య సబర్బన్ రైల్వే పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేసిందని కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. నగరంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలహంక- పెనుకొండ, అరిసికెరె-తుమకూరు, హుబ్లీ- చిక్కజాజూరు డబ్లింగ్ పనులు, కొప్పళ రైల్వేస్టేషన్ రోడ్డు ప్లైఓవర్ పనులకు ఆయన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులతో శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ పేరును లాంఛనంగా ‘క్రాంతివీర సంగొళ్లిరాయణ్ణ స్టేషన్’గా మార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రాంతివీర సంగూళ్లి రాయణ్ణ పేరును నగర రైల్వే స్టేషన్‌కు పెట్టాలన్న కన్నడిగుల కోరిక నెరవేరిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో ముందుంజలో ఉంటుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందన్నారు. సబర్బన్ రైల్వేతో పాటు మెట్రోరైల్వే సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య దాదాపుగా తగ్గిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేశ్‌ప్రభు మాట్లాడుతూ... బెంగళూరు-మైసూరు, బెంగళూరు-హుబ్లీ మధ్య సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రారంభించే ఆలోచన ఉందని వెల్లడించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బెంగళూరు నుంచి హుబ్లీ, మైసూరు మధ్య సెమీ హై స్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటుచేయడం వల్ల ఆయా ప్రాంతాల నుంచి ప్రతి రోజు బెంగళూరుకు వచ్చే ప్రజలకు ఉపయుక్తంగా ఉండటమే కాకుండా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యను కూడా తీరుతుందన్నారు. కేంద్ర ఎరువులు రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... బెంగళూరు- హుబ్లీ రైల్వే డబ్లింగ్ పనులను మూడేళ్లలోగా పూర్తి చేస్తే రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. పనులు పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణం 7 గంటల నుంచి నాలుగన్నర గంటకు తగ్గుతుందన్నారు. -
కరీంనగర్ జిల్లాలో పలు రైళ్లు రద్దు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సిర్పూర్, కాగజ్ నగర్, ఖాజీపేట మార్గంలో రైల్వే లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో కరీంనగర్-కుష్పుల్ ప్యాసింజర్, రామగిరి ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సింగరేణి, ఇంటర్సిటీ, కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంచిర్యాల వరకు మాత్రమే నడుపుచున్నారు. -
3 కొత్త మార్గాల్లో మెట్రో రైలు
- తాజా ప్రతిపాదనలు - కోయంబేడు నుంచి తొలిదశ - మొత్తం 42 రైళ్ల సేవలు చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరంలో మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు మరో రెండు కొత్త మార్గాల్లో ఈ సేవలను మెట్రో రైలు నడపాలని పాలక యంత్రాంగం నిర్ణరుుంచింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన మెట్రో రైలు నిర్మాణ తొలిదశ పనులు రూ.14,600 కోట్లతో సాగుతున్నాయి. ఇందుకు తోడుగా మరో మూడు కొత్త మార్గాలను ప్రయాణికుల వినియోగానికి సిద్ధం చేస్తున్నారు. చాకలిపేట నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్, అన్నాశాలై మీదుగా మీనంబాకం విమానాశ్రయానికి ఒక మార్గం, సెంట్రల్ మీదుగా పూందమల్లి, కోయంబేడు మీదుగా ఆలందూరు వరకు మరో రైలు మార్గం పనులు చేపట్టనున్నారు. వీటి మొత్తం దూరం 45.1 కిలోమీటర్లుగా ఉంది. ఈ రైలు మార్గంలోనే సొరంగం, బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రైలు మార్గాలను కలుపుకుని మొత్తం 42 రైళ్లు సేవలు అందించనున్నా రు. ఒక్కో రైలులో 4బోగీలు ఉంటాయి. బ్రెజిల్ నుంచి ఇప్పటికే 9 రైళ్లు చేరుకోగా, ఆంధ్రప్రదే శ్ సరిహద్దు తడలోని శ్రీసిటీ సెజ్ ద్వారా మరో ఐదు రైళ్లు తయారవుతున్నాయి. మొదటి దశగా కోయంబేడు నుంచి ఆలందూరు వరకు మెట్రోరైలును పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రెండో దశ పనులకు రూ.36 కోట్లను అంచనావేశారు. చెన్నై నగర విస్తీర్ణం 1189 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించగా 2016 నాటికి నగర జనాభా 1.25 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు పథకం అమలులో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మాధవరం నుంచి కలంగరైవిలక్కం (లైట్‌హౌస్) వరకు 17 కిలోమీటర్లు, కోయంబేడు నుంచి ఈజ్జంబాక్కం వరకు 27 కిలోమీటర్లు, మాధవరం నుంచి పెరుంబాక్కం వరకు 32 కిలోమీటర్ల దూరం వరకు మెట్రోరైలు సేవలకు సూత్రప్రాయంగా నిర్ణరుుంచారు. ఈ కొత్త మార్గాలకు సంబంధించి త్వరలో అధికారుల సర్వే ప్రారంభం కానుంది. ప్రాథమికంగా నిర్ణయించిన మార్గంలో కొన్ని మార్పులు, చేర్పులు అనివార్యమైనా కొత్త మార్గాల్లో మెట్రోరైలు పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కోయంబేడు- పరంగిమలై మధ్యన మెట్రోరైలు సేవలు ఈ ఏడాది అక్టోబరు నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ముఖ్యమంత్రి జయలలిత ట్రయల్న్‌క్రు పచ్చజెండా ఊపగా ఇప్పటికే అనేక సార్లు మెట్రోరైళ్లు ఇదే మార్గంలో పరుగులు పెట్టాయి. పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడగానే ఈ మార్గంలో మెట్రోరైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. -
ఆశల బండి ఆగేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వారం రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని పలు విజ్ఞాపనలు సమర్పించారు. అందులో జిల్లా అవసరాలను విన్నవించామని, ఇటీవల జిల్లాలో జరిగిన పలు సమావేశాలలో ఆమె పేర్కొన్నారు. గతంలో అనేకమార్లు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినా, జిల్లాకు వచ్చేసరికి నిధులు కేటాయింపు, అమలైన అంశాలు తక్కువే. ‘తెలంగాణ’ రాష్ట్రం ఏర్పా టు తర్వాత మొట్ట మొదటి సారిగా కేంద్రం రైల్వే బడ్జె ట్ ప్రవేశపెడుతున్నం దున మన ఎంపీలప్రతిపాదనలు ఏ మేరకు అందులో భాగమవుతాయోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా ఇందూరు వాసులకు నిరాశే రైల్వే బడ్జెట్ ప్రవేశపట్టిన ప్రతీసారి జిల్లావాసులు నిరాశ చెందుతున్నారు. ఇంతకు ముందున్న ఎంపీలు మధుయాష్కీ, సురేష్ శెట్కార్ అనేక ప్రతిపాదనలు చేసినట్లు పదే పదే ప్రకటించినా అమలుకు నోచుకున్న వాటికంటే బుట్టదాఖలైనవే ఎక్కువ. 2013-14 బడ్జెట్లో వీరు చేసిన ప్రతిపాదనలలో ఆర్మూర్ ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ, ఆ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు. కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వే స్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆధునీకరించిన దాఖలాలు లేవు. ఆదర్శంగా తీర్చిదిద్దటానికి తీసుకున్న చర్యలు కూడా లేవు. బోధన్-బీదర్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ లైన్లను మరచిపోయారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచారు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు ప్రతిసారి మొండిచెయ్యే చూపుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొత్తగా ఎంపికైన ఎంపీలు సభ్యులు కవిత, పాటిల్ తాజా ప్రతిపాదనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి కావాలి 2013-14 రైల్వే బడ్జెట్ కొంత మోదం.. మరికొంత ఖేదం మిగల్చగా, ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్రం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లా ఊసే లేదు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా, పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో 2014-15 రైల్వేబడ్జెట్ పైన జిల్లా ప్రజలకు ఆశలు పెట్టుకున్నారు. ఎంపీ కవిత ప్రతిపాదనలు ఫలిస్తే ఈసారి బడ్జెట్లో ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు. 2013-14 బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులతోనే సరిపుచ్చగా, ఈ సారి నిధుల పరిపుష్టి ఉంటుందంటున్నారు. అసంపూర్తిగా ఉన్న మోర్తాడ్-ఇందూరు రైల్వేలైన్ పనులు పూర్తి కోసం చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకుంటాయన్న ఆశలు ఉన్నాయి. ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ పనులు, జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ప్రధానమైన ఈ రెండు కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు తీసుకు రావాల్సి ఉందని భావిస్తున్నారు. నిజామాబాద్-ముంబయి వరకు వేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికీ ఆశాజనకంగా లేవు. జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, ఫ్లై ఓవర్, పుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రైల్వే అభివృద్ధి కోసం బడ్జెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
నత్తనడక
సాక్షి ప్రతినిధి, కడప: రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారి జిల్లా వాసులు ఆశగా ఎదురు చూడటం ఆ తర్వాత నిరాశకు గురికావడం మామూలైపోయింది. రెండు దశాబ్దాలుగా ఈ నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో రైల్వే అభివృద్ధి ఒక అడుగు ముందుకేస్తే ఆరడుగులు వెనక్కి పడుతోంది. కడప-బెంగళూరు రైల్వే పనులు శరవేగంగా ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వ వివక్షతతో కుంటినడకను అందుకున్నాయి. మరో రెండు వారాల్లో 2014-15 రైల్వే బడ్జెట్‌ను కేంద్రమంత్రి సదానందగౌడ్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యత అంశం చర్చనీయాంశమైంది. రైల్వే అభివృద్ధి పనులపై నీలినీడలు.. దశాబ్దాలుగా జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం జిల్లా పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. గత రైల్వే బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు మంజూరైన కొత్తమార్గాల్లో కడప-బెంగళూరు రైల్వేలైన్ అతి ముఖ్యమైంది. 255 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గం నిర్మాణం రూ.2,050 కోట్లతో చేపట్టారు. ఇప్పటివరకూ రూ.50కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2004లో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చినా నిధుల మంజూరులో వివక్షత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50శాతం వాటాగా నిధులు సమకూరిస్తే, కేంద్రప్రభుత్వం నిధులు విడుదలపై ఒత్తిడి పెంచవచ్చు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు లేకుండా పోయాయి. ఇప్పటి వరకూ కేటాయించిన నిధులు సర్వేలకే పరిమితమయ్యాయి. కడప నుంచి పెండ్లిమర్రి వరకూ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. అంతవరకూ వేగంగా కొనసాగిన పనులు ఆ తర్వాత మందకొడిగా సాగుతున్నాయి. ఈ రైల్వే పనులు పూర్తి అయితే కర్నాటక రాష్ట్రం నుంచి వాణిజ్య పరంగా జిల్లాకు చాలా లాభదాయకంగా ఉంటుందన్న విషయం నగ్నసత్యం. అలాగే 1996-97 సంవత్సరంలో కార్యరూపం దాల్చిన నంద్యాల-యర్రగుంట్ల రైల్వేలైన్ నేటికీ కొనసాగుతూనే ఉంది. 126 కిలోమీటర్లు ఉన్న ఆ రైల్వే మార్గం తొలుత రూ.164.36 కోట్లతో ప్రతిపాదించారు. ప్రస్తుతం రూ.883 కోట్లకు చేరుకుంది. పనులు ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఇప్పటికి రూ.558 కోట్లు ఖర్చు చేశారు. బనగానపల్లె వరకూ పూర్తయిన ఈ మార్గంలో ట్రయల్ రన్ కూడా చేపట్టారు. ఈమార్గం పూర్తయితే తిరుపతి-హైదరాబాద్ మధ్య దూరం కూడా తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా ఓబులవారిపల్లె-కష్ణపట్నం రైల్వేలైన్ రూ.930కోట్లతో రూపొందించారు. 114 కిలోమీటర్లు ఉన్న ఆ మార్గంలో ఇప్పటికి రూ.152కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గత బడ్జెట్లో నంద్యాల-యర్రగుంట్ల రైల్వేలైన్‌కు రూ.64కోట్లు కేటాయించగా, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం మార్గానికి కేవలం రూ.6కోట్లు మాత్రమే కేటాయించారు. ఇలా కేటాయింపులు ఉంటే ఇప్పట్లో ఈ మార్గాలు పూర్తయ్యే అవకాశం లేనట్లేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. కొత్తమార్గాలపై ఆశలు... జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్ల పనుల పూర్తితో పాటు కొత్త మార్గాలపై జిల్లా వాసులు ఆశలు పెంచుకున్నారు. 142 కిలోమీటర్లు ఉన్న ప్రొద్దుటూరు-కంభం కొత్త మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. ఐదేళ్ల క్రితమే ఈ మార్గానికి సర్వేలు నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్ లభించింది. అయినా ఇంత వరకూ ఎలాంటి ప్రగతి లేదు. గిద్దలూరు-భాకరాపేట ప్రతిపాదనలకే పరిమితమైంది. అలాగే కడప-విజయవాడ మధ్య కొత్త మార్గానికి సర్వేలు చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు సమాచారం. వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోగల్గితే జిల్లాకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తాం: వైఎస్ అవినాష్‌రెడ్డి జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పట్ల యూపీఏ ప్రభుత్వం పూర్తి వివక్షత ప్రదర్శించింది. జిల్లా అవసరాల రీత్యా కొత్త మార్గాలు, రైళ్ల పొడిగింపు, స్టాపింగ్స్ తదితర విషయాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్ దృష్టికి తీసుకెళ్తాం. రైల్వే బడ్జెట్‌కు మునుపే రాతపూర్వకంగా మా అభ్యర్థనను, జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరిస్తాం. రాజంపేట ఎంపీ పి. మిథున్‌రెడ్డితో కలిసి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం కృషి చేస్తాం. ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్లో జిల్లాకు ప్రాధాన్యత దక్కేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం.