నత్తనడక
సాక్షి ప్రతినిధి, కడప: రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారి జిల్లా వాసులు ఆశగా ఎదురు చూడటం ఆ తర్వాత నిరాశకు గురికావడం మామూలైపోయింది. రెండు దశాబ్దాలుగా ఈ నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో రైల్వే అభివృద్ధి ఒక అడుగు ముందుకేస్తే ఆరడుగులు వెనక్కి పడుతోంది. కడప-బెంగళూరు రైల్వే పనులు శరవేగంగా ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వ వివక్షతతో కుంటినడకను అందుకున్నాయి. మరో రెండు వారాల్లో 2014-15 రైల్వే బడ్జెట్‌ను కేంద్రమంత్రి సదానందగౌడ్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యత అంశం చర్చనీయాంశమైంది.
రైల్వే అభివృద్ధి పనులపై నీలినీడలు..
దశాబ్దాలుగా జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం జిల్లా పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. గత రైల్వే బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు మంజూరైన కొత్తమార్గాల్లో కడప-బెంగళూరు రైల్వేలైన్ అతి ముఖ్యమైంది. 255 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గం నిర్మాణం రూ.2,050 కోట్లతో చేపట్టారు. ఇప్పటివరకూ రూ.50కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2004లో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చినా నిధుల మంజూరులో వివక్షత చూపుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 50శాతం వాటాగా నిధులు సమకూరిస్తే, కేంద్రప్రభుత్వం నిధులు విడుదలపై ఒత్తిడి పెంచవచ్చు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు లేకుండా పోయాయి. ఇప్పటి వరకూ కేటాయించిన నిధులు సర్వేలకే పరిమితమయ్యాయి. కడప నుంచి పెండ్లిమర్రి వరకూ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. అంతవరకూ వేగంగా కొనసాగిన పనులు ఆ తర్వాత మందకొడిగా సాగుతున్నాయి. ఈ రైల్వే పనులు పూర్తి అయితే కర్నాటక రాష్ట్రం నుంచి వాణిజ్య పరంగా జిల్లాకు చాలా లాభదాయకంగా ఉంటుందన్న విషయం నగ్నసత్యం.
అలాగే 1996-97 సంవత్సరంలో కార్యరూపం దాల్చిన నంద్యాల-యర్రగుంట్ల రైల్వేలైన్ నేటికీ కొనసాగుతూనే ఉంది. 126 కిలోమీటర్లు ఉన్న ఆ రైల్వే మార్గం తొలుత రూ.164.36 కోట్లతో ప్రతిపాదించారు. ప్రస్తుతం రూ.883 కోట్లకు చేరుకుంది. పనులు ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఇప్పటికి రూ.558 కోట్లు ఖర్చు చేశారు. బనగానపల్లె వరకూ పూర్తయిన ఈ మార్గంలో ట్రయల్ రన్ కూడా చేపట్టారు. ఈమార్గం పూర్తయితే తిరుపతి-హైదరాబాద్ మధ్య దూరం కూడా తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా ఓబులవారిపల్లె-కష్ణపట్నం రైల్వేలైన్ రూ.930కోట్లతో రూపొందించారు. 114 కిలోమీటర్లు ఉన్న ఆ మార్గంలో ఇప్పటికి రూ.152కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గత బడ్జెట్‌లో నంద్యాల-యర్రగుంట్ల రైల్వేలైన్‌కు రూ.64కోట్లు కేటాయించగా, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం మార్గానికి కేవలం రూ.6కోట్లు మాత్రమే కేటాయించారు. ఇలా కేటాయింపులు ఉంటే ఇప్పట్లో ఈ మార్గాలు పూర్తయ్యే అవకాశం లేనట్లేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.
కొత్తమార్గాలపై ఆశలు...
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్ల పనుల పూర్తితో పాటు కొత్త మార్గాలపై జిల్లా వాసులు ఆశలు పెంచుకున్నారు. 142 కిలోమీటర్లు ఉన్న ప్రొద్దుటూరు-కంభం కొత్త మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. ఐదేళ్ల క్రితమే ఈ మార్గానికి సర్వేలు నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్ లభించింది. అయినా ఇంత వరకూ ఎలాంటి ప్రగతి లేదు. గిద్దలూరు-భాకరాపేట ప్రతిపాదనలకే పరిమితమైంది. అలాగే కడప-విజయవాడ మధ్య కొత్త మార్గానికి సర్వేలు చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు సమాచారం. వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోగల్గితే జిల్లాకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం.
కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తాం: వైఎస్ అవినాష్‌రెడ్డి
జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పనుల పట్ల యూపీఏ ప్రభుత్వం పూర్తి వివక్షత ప్రదర్శించింది. జిల్లా అవసరాల రీత్యా కొత్త మార్గాలు, రైళ్ల పొడిగింపు, స్టాపింగ్స్ తదితర విషయాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్ దృష్టికి తీసుకెళ్తాం. రైల్వే బడ్జెట్‌కు మునుపే రాతపూర్వకంగా మా అభ్యర్థనను, జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరిస్తాం. రాజంపేట ఎంపీ పి. మిథున్‌రెడ్డితో కలిసి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం కృషి చేస్తాం. ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యత దక్కేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం.