ఆశల బండి ఆగేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వారం రోజుల క్రితం కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని పలు విజ్ఞాపనలు సమర్పించారు. అందులో జిల్లా అవసరాలను విన్నవించామని, ఇటీవల జిల్లాలో జరిగిన పలు సమావేశాలలో ఆమె పేర్కొన్నారు. గతంలో అనేకమార్లు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినా, జిల్లాకు వచ్చేసరికి నిధులు కేటాయింపు, అమలైన అంశాలు తక్కువే. ‘తెలంగాణ’ రాష్ట్రం ఏర్పా టు తర్వాత మొట్ట మొదటి సారిగా కేంద్రం రైల్వే బడ్జె ట్ ప్రవేశపెడుతున్నం దున మన ఎంపీలప్రతిపాదనలు ఏ మేరకు అందులో భాగమవుతాయోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
ఏళ్లుగా ఇందూరు వాసులకు నిరాశే
రైల్వే బడ్జెట్ ప్రవేశపట్టిన ప్రతీసారి జిల్లావాసులు నిరాశ చెందుతున్నారు. ఇంతకు ముందున్న ఎంపీలు మధుయాష్కీ, సురేష్ శెట్కార్ అనేక ప్రతిపాదనలు చేసినట్లు పదే పదే ప్రకటించినా అమలుకు నోచుకున్న వాటికంటే బుట్టదాఖలైనవే ఎక్కువ. 2013-14 బడ్జెట్‌లో వీరు చేసిన ప్రతిపాదనలలో ఆర్మూర్ ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ, ఆ బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించలేదు. కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది.
నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వే స్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆధునీకరించిన దాఖలాలు లేవు. ఆదర్శంగా తీర్చిదిద్దటానికి తీసుకున్న చర్యలు కూడా లేవు. బోధన్-బీదర్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ లైన్లను మరచిపోయారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచారు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు ప్రతిసారి మొండిచెయ్యే చూపుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొత్తగా ఎంపికైన ఎంపీలు సభ్యులు కవిత, పాటిల్ తాజా ప్రతిపాదనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కావాలి
2013-14 రైల్వే బడ్జెట్ కొంత మోదం.. మరికొంత ఖేదం మిగల్చగా, ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్రం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో జిల్లా ఊసే లేదు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా, పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో 2014-15 రైల్వేబడ్జెట్ పైన జిల్లా ప్రజలకు ఆశలు పెట్టుకున్నారు. ఎంపీ కవిత ప్రతిపాదనలు ఫలిస్తే ఈసారి బడ్జెట్‌లో ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు.
2013-14 బడ్జెట్‌లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులతోనే సరిపుచ్చగా, ఈ సారి నిధుల పరిపుష్టి ఉంటుందంటున్నారు. అసంపూర్తిగా ఉన్న మోర్తాడ్-ఇందూరు రైల్వేలైన్ పనులు పూర్తి కోసం చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకుంటాయన్న ఆశలు ఉన్నాయి. ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ పనులు, జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ప్రధానమైన ఈ రెండు కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు తీసుకు రావాల్సి ఉందని భావిస్తున్నారు. నిజామాబాద్-ముంబయి వరకు వేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికీ ఆశాజనకంగా లేవు. జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, ఫ్లై ఓవర్, పుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రైల్వే అభివృద్ధి కోసం బడ్జెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.