సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం(జనవరి26) జరిగిన సెమినార్‌లో కవిత మాట్లాడారు.‘నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు.
ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా.ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని. కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు.. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి.
కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్‌లో మతకల్లోలాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదు... ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు’అని కవిత ఫైరయ్యారు.
కాగా, శనివారం కరీంనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై ఇందిరమ్మ బొమ్మ పెడితే కేంద్రం నుంచి ఇళ్లు ఇవ్వమని, ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇదీ చదవండి: బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment