శరవేగంగా రైల్వే సొరంగం పనులు
-
8 కిలోమీటర్లు పొడవు
-
రూ.470.29 కోట్ల వ్యయం
రాపూరు:
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి కడప జిల్లా ఓబులవారిపల్లి వరకు నిర్మించనున్న రైల్వే మార్గంలో భాగంగా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాధవయ్యపాళెం( రాపూరు సమీపంలోని వెలుగొండల్లో ) వద్ద రైల్వే సొరంగమార్గ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వెలుగొండల్లో అటువైపు వైఎస్సార్ జిల్లా ఇటు వైపు నెల్లూరు జిల్లా ఉండడం తెలిసిందే. ఇప్పటికే రెండు జిల్లాలను కలుపుతూ రాపూరు–చిట్వేలి మార్గమధ్యలో ఘాట్ రోడ్డు నిర్మించారు. నూతనంగా రైల్వే సొరంగ మార్గానికి ప్రభుత్వం రూ.470.29 కోట్లు కేటాయించడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్గం సుమారు 8 కిలోమీటర్ల పోడవు ఉంటుందని రైల్వే వికాస్ నిగామ్ లిమిటెడ్ అధికారులు తెలిపారు.
చెర్లోపల్లి వద్ద పనుల నిర్వహణ:
వైఎస్సార్ జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామ వెలుగొండల్లో రైల్వే సొరంగం మార్గ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు కిలో మీటరు, రాపూరు సమీప అడవుల్లో 750 మీటర్లు పూర్తయ్యాయి.
రెండేళ్లల్లో పూర్తికావచ్చు:
రాపూరు–చిట్వేలి మార్గ మధ్యలో నిర్మిస్తున్న సొరంగం సుమారు 2 సంవత్సరాల్లో పూర్తి కావచ్చని రైల్వే అధికారులు చెప్పారు. పనులు పూర్తయితే ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నంకు ఇనుపఖనిజం, ముగ్గురాళ్లు నేరుగా కృష్ణపట్నంకు తరలించవచ్చన్నారు.