
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో ఇరుక్కున్న ఎనిమిది రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్, హైడ్రా, సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్లొన్నారు.
సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సొరంగం పైనుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక, నిరంతరం ఆక్సిజన్ పంపింగ్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
టన్నెల్ వద్దకు మంత్రి కోమటిరెడ్డి..
మరోవైపు.. తాజాగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద పనులను పరిశీలించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. టన్నెల్ వద్ద ప్రమాద సహాయకచర్యలు పూర్తి అయ్యేంత వరకు మంత్రి అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షించనున్నారు.
మరో 50 మీటర్లే..
ఇక, టన్నెల్‌లోని 13.5 కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది. ఫిషింగ్ బోట్లు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలానికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేంద్ తెలిపారు. సహాయక చర్యల కోసం నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది.

ఆందోళనలో బాధితుల కుటుంబ సభ్యులు..
టన్నెల్‌లోకి చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. టన్నెల్ లోపల ఉన్నది వీరే.. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్‌ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్‌సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్‌సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల చిక్కుకు పోయారు.
Comments
Please login to add a commentAdd a comment