మానవ సంకల్పం ముందు శిఖరం తలొంచింది. పదిహేడు రోజులుగా కోట్లాదిమంది దేశ ప్రజానీకం మాత్రమే కాదు... దేశదేశాల పౌరులూ పడిన ఆరాటం, ఆత్రుత ఫలించాయి. ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగం కుప్పకూలటంతో 422 గంటలపాటు బందీలైన 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నిపుణులు మొదలుకొని వైద్య నిపుణుల వరకూ అందరికందరూ రాత్రింబగళ్లు సమన్వయంతో సాగించిన కృషి ఒక ఎత్తయితే...అత్యంత కష్టసాధ్యమైన ర్యాట్ హోల్ మైనింగ్‌లో నిపుణులైన కార్మికులు చివరి 12 మీటర్ల పొడవునా వున్న శిథిలాలను ఎంతో ఓపిగ్గా, జాగ్రత్తగా తొలగించటం మరో ఎత్తు.
వెరసి బందీలైనవారంతా క్షేమంగా బాహ్యప్రపంచాన్ని చూడగలిగారు. ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లో చిక్కుకున్నవారిలో సమూహ చేతన ఎంతమాత్రమూ సడలరాదన్నది మనస్తత్వ నిపుణుల మాట. బందీల్లో కనీసం ఒక్కరికైనా సద్యోజనిత నాయకత్వ లక్షణం వుంటే తప్ప ఇలాంటి సామూహిక చేతనకు అవకాశం వుండదు. 2010లో చిలీ రాగి గనుల్లో పదివారాలు చిక్కుకున్న కార్మికులైనా... మరో ఏడెనిమిదేళ్లకు ఉత్తర థాయ్‌లాండ్‌లోని కొండ గుహల్లోకి వరద నీరు ప్రవేశించటంతో పదకొండు రోజులపాటు చిక్కుకున్న ఫుట్‌బాల్ టీమ్ పిల్లలైనా క్షేమంగా బయటపడటానికి కారణం ఇదే అంటారు.
భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా నాలుగో రోజు వరకూ ప్రాణాలు నిలుపుకోగలిగితే మానసికంగా వారు దృఢంగా వున్నట్టేనని, ఆ తర్వాత వారు దేన్నయినా సునాయాసంగా అధిగమిస్తారని మనస్తత్వ నిపుణులు చెబుతారు. వెలుపలి ప్రపంచంలో కోట్లాదిమంది పడుతున్న తపనకు బందీలైన ఆ 41 మంది కార్మికుల దృఢచిత్తం తోడవటం వల్లనే ఇదంతా సవ్యంగా పూర్తయింది. ఆ కార్మిక కుటుంబాల మాటేమోగానీ... అశేష ప్రజానీకం ఆశానిరాశాల్లో ఊగిసలాడిన తీరు మాత్రం మరిచిపోలేనిది. మినుకు మినుకుమంటున్న ఆశలు, అంతలోనే గంపెడు నిరాశలో ముంచే పరిణామాలూ ఈ పదిహేడురోజులూ ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
ఆ కార్మికులు బయటికిరావటం నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని మంగళవారం సాయంత్రానికిగానీ ధ్రువపడలేదు. బందీలను విడిపించటానికి భారీ యంత్రాలను వినియోగించి కొండను తొలుస్తున్న క్రమంలో ఈనెల 16న సంభవించిన భూకంపం అన్ని రకాల ప్రయత్నాలపైనా నీళ్లుజల్లింది. ఒక దశలో పైపును అమరుస్తుండగా భారీ పగుళ్ల శబ్దాలు విన బడ్డాయి. ఈలోగా 25 టన్నుల భారీయంత్రమైన అగర్ మెషిన్‌తో తవ్వుతుండగా శిథిలాల్లో ఇరుక్కున్న ఇనుప రాడ్లు తగిలి దాని బ్లేడ్లు తెగిపడ్డాయి. ఇక ర్యాట్‌హోల్ మైనింగ్ నిపుణులు రంగంలో దిగితే తప్ప ఇది పూర్తికాదని నిర్ధారించుకుని మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి వారిని రప్పించారు.
అయితే ఈ ఆనందోత్సాహాల సందడిలో అసలు విషయం మరుగున పడకూడదు. అపార ఖనిజ సంపద వున్న దేశాలన్నిటా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకూ ప్రభుత్వాలు తపిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణానికి కలుగుతున్న చేటు సరే, మనుగడ కోసం మరేదీ చేయలేక ప్రాణాలకు తెగించి గనుల్లో పనిచేస్తున్న బడుగు జీవులు సమిధలవుతున్నారు. చాన్నాళ్ల క్రితమే ఎన్‌జీటీ నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ సిల్‌క్యారాలో కార్మికుల ప్రాణాలు కాపాడటానికి దోహదపడిన మాట నిజమే అయినా...ఇప్పటికీ చట్టవిరుద్ధంగా అలాంటి మైనింగ్ సాగుతున్నదని ఈ ఎపిసోడ్ నిరూపించింది.
కేవలం ఒక మనిషి పాకుకుంటూ వెళ్లగలిగేంత కంత తవ్వుకుంటూ భూగర్భం మూలల్లో వున్న బొగ్గు లేదా ఇతర ఖనిజాలనూ సేకరించటం ఈ కార్మికుల పని. ఈ క్రమంలో ఎక్కడైనా పైకప్పు కూలిందంటే వాళ్ల బతుకులు ముగిసినట్టే. గనుల పరిసర ప్రాంతాల్లో వుంటున్నవారికే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నప్పుడు నేరుగా అందులోకి ప్రవేశించి నిత్యం ఆ దుమ్మూ ధూళితో సావాసం చేసేవారికి ఎంత ముప్పు కలుగుతుందో వేరే చెప్పనవసరం లేదు.
ఇక భూమి కుంగిపోవటం, భూగర్భ జలాలు కలుషితం కావటంవంటి పర్యావరణ సమస్యలకు అంతే లేదు. ఇంతా చేసి ఇలాంటి కార్మికుల శ్రమంతా భారీ యంత్రపరికరాలపై పెట్టుబడులూ, అనుమతులు, రాయల్టీ చెల్లింపులూ లేకుండా చట్టవిరుద్ధంగా దోపిడీచేసే మైనింగ్ మాఫియాల పాలవుతోంది. కార్పొరేట్ల లాభార్జనకు దోహదపడుతోంది.
హిమశిఖరాలు ఆల్ప్ పర్వతశ్రేణిలా పురాతనమైనవి కాదు. అవి ఆరున్నరకోట్ల సంవత్సరా లనాటివైతే, హిమశిఖరాల వయసు నాలుగుకోట్ల సంవత్సరాలు మించదు. అందువల్లే వాటి భూగర్భంలో నిరంతర చలనం, ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత కొనసాగుతున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీతో సహా 51 శాతం నేల కుంగుబాటు ప్రాంతంలో వున్నదని జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్స్ పత్రిక చాన్నాళ్ల క్రితం తెలిపింది.
ఇక్కడి కొండల్లో మట్టి, రాళ్లు కలిసి వుండటం వల్ల ఈ కుంగుబాటు ప్రమాదం ఎక్కువ. గత కొన్నేళ్లుగా జోషీమuŠ‡ కుంగుబాటు, ఇతర ప్రాంతాల్లో సైతం భూమి నెర్రెలుబారటం ప్రమాదకర సంకేతాలందిస్తోంది. చార్‌ధామ్ యాత్రికులకూ, పర్యాటకులకూ అనుకూలంగా వుంటుందని 900 కిలోమీటర్ల మేర చార్‌ధామ్ హైవే నిర్మాణం చేపట్టారు. సిల్‌క్యారా సొరంగ నిర్మాణం దానిలో భాగమే. ఇవిగాక ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సిల్ క్యారా ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. అప్రమత్తం కావటం మనకే మంచిది.
సిల్‌క్యారా చేస్తున్న హెచ్చరిక
Published Thu, Nov 30 2023 12:30 AM | Last Updated on Thu, Nov 30 2023 4:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment