
భౌగోళికంగానే కాదు... సంస్కృతి, నాగరికతల్లోనూ శతాబ్దాలుగా సన్నిహితమైన రెండు దేశాల మధ్య సహకారం సహజం. ఉమ్మడి ప్రయోజనాలూ అనేకం. ప్రయాణ, వాణిజ్యాలు చిరకాలంగా ఉన్నా, ఇప్పటి దాకా ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడ్డ భారత, ఇండొనేసియాలు దాన్ని చక్కదిద్దుకొనే పనిలో పడ్డాయి. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 4 రోజులు భారత్‌లో పర్యటించి, భారత 76వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం బలమైన బంధానికి పునరంకితమయ్యే వీలు కల్పించింది. అన్నీ సాకల్యంగా చర్చించు కొనే విలువైన అవకాశం వచ్చింది. మొత్తం 55 పేరాల తాజా ఉమ్మడి ప్రకటనలో ఇరుపక్షాలూ విస్తృత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారంపై ఏకస్వరంతో మాట్లాడడం అందుకు నిదర్శనం.
భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారత్‌తో ఇండొనేసియా అను బంధం బలమైనది. చిత్రమేమిటంటే చిరకాలంగా బలమైన బంధమున్నా అది భారీ స్థాయిలో ప్రతి ఫలించినట్లు కనిపించదు. అగ్రరాజ్యాల అధికార రాజకీయాలకు వ్యతిరేకతతో, అలీనోద్యమంతో ఆది నుంచి ముడిపడిన ఈ ఉభయ దేశాలూ వలస పాలనానంతర ఆసియా ఖండంలో ద్వైపాక్షికంగానూ, నాయకత్వంలోనూ కలసి అడుగేయాల్సింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఢిల్లీ, జకార్తాలు దూరం జరిగాయి.
ఈ నేపథ్యంలో ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తాజా ఢిల్లీ పర్యటన ఆశావహ పరిణామం. ఉభయదేశాల మధ్య అనుబంధానికి అవసరమైన వ్యూహాత్మక ప్రేరణను ఈ పర్యటన అందించింది. భారత గణతంత్ర దినోత్సవ కవాతుకు ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షులు హాజరవడం ఇది నాలుగోసారి. భారత్ తొలిసారి జరుపుకొన్న రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో సైతం ఇండొనేసియా అధ్యక్షుడే (సుకర్ణో) ముఖ్య అతిథి. ఆపైన సుసిలో బమ్‌బాగ్ యుధొయోనో (2011), జోకో విడోడో (2018), ఇప్పుడు సుబియాంటో!
గమనిస్తే, ఆగ్నేయాసియా దేశాలతో బలమైన స్నేహం 1990ల నుంచి భారత ప్రయత్నం.అందులో భాగంగా జకార్తా, ఢిల్లీల మధ్య దూరం క్రమంగా తగ్గసాగింది. చైనా వ్యూహాత్మక ప్రాబల్యానికి పగ్గం వేసేలా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ ‘ప్రాచ్యానికి ప్రాధాన్య విధానం’ (యాక్ట్ ఈస్ట్ పాలసీ) చేపట్టింది. ఇండో – పసిఫిక్ ప్రాంతం కీలకమని గుర్తించింది. అయినా, ఇరు దేశాల భాగస్వామ్యం ఉండాల్సినంత లేదు. సుమత్రా, జావా... ఇలా 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండొనేసియా 28 కోట్లకు పైగా ప్రజలతో జనసంఖ్యలో ప్రపంచంలో నాలుగోది.
దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థతో వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి ఉరకలు వేస్తోంది. ఈ దేశ వేలాది ద్వీపాలు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల మధ్య వారధుల లాంటివి. ఇండొనేసియా సముద్ర జలాలు భారత్ సహా ఈ ప్రాంతంలో పలు దేశాల ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ అతి పెద్ద ద్వీపసమూహ దేశంతో బంధం భారత ఆర్థికప్రగతికి కీలకమనీ, బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటున్నది అందుకే!
అధ్యక్షుడి తాజా పర్యటనలో ఆరోగ్యం, సాంప్రదాయిక వైద్యం, సముద్రయాన భద్రత, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక సహకారంపై 5 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుది రాయి. అలాగే, రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న మాట ఉమ్మడి ప్రకటనలోనూ ప్రస్తావించారు. అయితే, భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఇండొనేసియా కొననున్నదంటూ పర్యట నకు ముందు వార్తలు గుప్పుమన్నా, ఆ రకమైన ఒప్పందమేదీ జరగలేదు.
ఇండో– పసిఫిక్‌లో అమెరికా– చైనా శత్రుత్వం, దక్షిణ– తూర్పు చైనా సముద్రాల్లో చైనా బిగిస్తున్న పట్టు లాంటి సున్నిత అంశాలు, వాటి భౌగోళిక రాజకీయ ప్రభావాలు చర్చకు వచ్చిందీ, లేనిదీ తెలియలేదు. ఆర్థికాభివృద్ధిలోనూ ఇరుపక్షాలూ చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లే ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ద్విగుణం, బహుళం చేయాలి. రెంటి మధ్య రాకపోకలు, ఆదానప్రదానాల పెంపుదల, పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంచుకోవాలి. అధ్యక్షుడి వెంట దాదాపు 100 మంది సభ్యుల వ్యాపార బృందం వచ్చినందున ఆ రంగంలో పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు.
ఇండో–పసిఫిక్ ప్రపంచ వివాదానికి కేంద్రమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ద్వైపాక్షిక,ప్రాంతీయ సహకారానికి ఉభయ దేశాలూ నడుంకట్టాలి. గత అక్టోబర్‌లో ఇండొనేసియా అధ్యక్షు డిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఆ దేశంలో అమితమైన ప్రాచుర్యం ఉన్న సుబియాంటో గద్దెనెక్కిన కొద్దికాలానికే భారత్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉత్ప్రేరకమే. ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా, భాగస్వాములుగా కొనసాగాలని ఆయన అభిలషించడం గమనార్హం.
‘ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య’కు మూలస్తంభమైన ఇండొనేసియా ప్రాంతీయ ఆర్థిక సమన్వయానికి, రాజకీయ, భద్రతా అంశాలకూ ముఖ్యమైనది. ఆ సంగతి భారత్ గమనంలో ఉంచుకోవాలి. బీజింగ్ కళ్ళతో, భౌగోళిక రాజకీయాల కోణం నుంచే జకార్తాతో బంధాన్ని చూడరాదు. ఇండొనేసియా సైతం ఆది నుంచీ అగ్ర దేశాలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ సంగతి గుర్తించి, ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారం వెల్లివిరిసేలా భారత్ కృషి చేయాలి. ఆసియాలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. పర్యటనతో రాజకీయ నాయకత్వం చొరవ చూపినందున ఇప్పుడిక అధికార యంత్రాంగం, దౌత్యవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు ఆచరణలో ముందుకు తీసుకుపోవాలి.
Comments
Please login to add a commentAdd a comment