Delhi visit
-
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు(మంగళవారం) ఢిల్లీకి బయల్దేరారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్లుతున్నారు సీఎం రేవంత్. నేడు సీఎం రేవంత్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని స్వయంగా సీఎం రేవంత్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న (సోమవారం) రాజకీయ వ్యవహార కమిటీ (పీఏసీ) చేసిన తీర్మానం కాపీని మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు సీఎం రేవంత్ అందిస్తారు. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించనున్నారు. మంగళవారం రాత్రికి సీఎం రేవంత్ హైదరాబాద్‌కు తిరిగి పయనం కానున్నారు. చదవండి: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ రూట్లో ఇవాళ ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు -
ప్రత్యేక సాయం వర్తింప చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : నాడు–నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం.. శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేలా బడ్జెట్లో పొందుపరిచిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు–నేడు కింద రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తొలి దశ కింద 15,717 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ నాడు–నేడు కింద అనేక పనులు చేపట్టామని, విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు మొదలు టీచింగ్ ఆస్పత్రుల వరకు పనులు చేపట్టామని, ఇందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఈ ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించి స్పెషల్ అసిస్టెన్స్ వర్తింప చేయాలని కోరారు. జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలి 2014–15కు సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016–2019 మధ్య పరిమితికి మించి తీసుకున్న రుణాల కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021–22లో రుణాల పరిమితిపై సడలింపుల అంశాన్ని ఆర్థిక మంత్రితో చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.6,756.92 కోట్ల బకాయిల అంశాన్నీ ప్రస్తావించారు. ఈ అంశం పలుసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ జెన్కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ సొమ్ములు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. శనివారం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, వంగా గీతా విశ్వనాథ్, చింతా అనూరాధ, ఎన్.రెడ్డెప్ప, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గన్నవరం నుంచి ముఖ్యమంత్రి వెంట వచ్చారు. -
సీఎం జగన్ పెట్టిన పేరును పవన్ కల్యాణ్ సార్థకం చేస్తున్నాడా! కాకపోతే..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంలో వింతైన రాజకీయాలు సాగుతున్నాయి. ఒక నాయకుడేమో వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ అని అంటారు. మరో నాయకుడేమో 175 సీట్లలో వైసిపి ని ఓడించడం అని అంటారు. గమ్మత్తు ఏమిటంటే ఈ ఇద్దరు నేతలు కూడా తాము అధికారంలోకి వస్తామని చెప్పలేని దుస్థితి. తమకంటూ ఒక ఎజెండాలేని నిస్సహాయత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి సడన్ గా ఎందుకు వెళ్లినట్లు? అక్కడ రెండురోజుల పాటు పడిగాపులు పడడం తప్ప ఏమి సాధించినట్లు? టీడీపీని నమ్మని బీజేపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ కొందరు బిజెపి ప్రముఖులను కలిసినా, వారు ఆశించిన లక్ష్యం నెరవేరలేదన్న సంగతి ఇట్టే తెలిసిపోతోంది. బిజెపి అద్యక్షుడు జెపి నడ్డాను కలిసి బయటకు వచ్చిన తర్వాత పొత్తుల గురించి స్పష్టత ఇవ్వలేకపోయారు. ఆ ఒక్కటే కాదు. ఏ విషయంలోను నిర్దిష్టంగా మాట్లాడలేకపోయారు. నిజంగానే వారు ఆశించినట్లు తెలుగుదేశం తో కలవడానికి బిజెపి ఏ మాత్రం సుముఖత కనబరిచినా, వారి మొహంలో తేడా కనిపించేది. టిడిపి అదినేత చంద్రబాబు కళ్లలో వెలుగు చూడడం కోసం పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం ఉండడం లేదు. వైసిపి అదినేత, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు దత్తపుత్రుడు అని పేరు పెట్టినందుకు దానిని సార్దకం చేయడానికే పవన్ పని చేస్తున్నట్లుగా ఉంది. కాకపోతే ఇందుకు బిజెపి అడ్డుగోడగా మారింది. ప్రస్తుతానికి వారు తెలుగుదేశం పార్టీని నమ్మడం లేదు. బిజెపి నేతలు గుస్సా! టిడిపి అధినేత చంద్రబాబు చేతిలో తమకు ఎదురైన దారుణమైన అవమానాలను మర్చిపోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా టిడిపి నుంచి పరాభవ అనుభవాలు ఉన్నా, ఆయన పెద్దగా ఫీల్ కావడం లేదు. ఈ నేపద్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం దక్కడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్ది మాధవ్ కు మద్దతు ప్రకటించకపోవడంపై కేంద్ర బిజెపి నేతలు గుస్సా అయ్యారట. ఇదేమి మిత్రధర్మం అని ప్రశ్నించారట. దీనికి పవన్ వద్ద నీళ్లు నమలడం తప్ప సమాధానం సహజంగానే ఉండదు. అదేమంటే వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ అని అంటారు. ప్రతిపక్షాల ఓట్లు చీలరాదని చెబుతారు. అదెలా సాధ్యం. బిజెపితో పాటు కాంగ్రెస్, వామపక్షాలను కూడా ఆయన కలుపుకుంటారా? అసలు జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికే ఆయన తంటాలు పడుతున్నారన్న వైసిపి విమర్శలకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. గత పదేళ్లలో పలురకాలుగా పార్టీల కూటములను మార్చిన పవన్ ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో బీజేపీ గూటికి పవన్ 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన బిజెపి పెద్దల వద్దకు వెళ్లి బతిమలాడి మరీ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఎలా విడిపోవాలా అని తంటాలు పడుతున్నారు. దాంతో ఇదంతా చూస్తే, చంద్రబాబే ఆయనను 2019లో బిజెపి గూటికి పంపించారని ధ్రువపడుతోంది. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలిచే పరిస్థితి లేదని బిజెపి భావిస్తోందని చెబుతున్నారు. ఆ క్రమంలో బిజెపి, జనసేన కలిసి గట్టిగా పనిచేస్తే, 2029 నాటికి తెలుగుదేశంకు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని వారి భావన. కాని అంతవరకు పవన్ ఆగలేకపోతున్నారు. పైగా చంద్రబాబు ఒత్తిడి ఎటూ ఉంది. వచ్చే ఎన్నికలలో గెలవలేకపోతే టిడిపి ఉనికి ప్రశ్నార్దకం అవుతుందన్న సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన వ్యూహం ఆయనది. అందులో పవన్ ను ఒక పావును చేసి ఆడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కక్కలేక, మింగలేక అన్న చందంగా మారినట్లుగా ఉంది. అటు బిజెపికి విడాకులు ఇవ్వడానికి సాకులు వెతకలేక, ఇటు తెలుగుదేశంతో పెళ్లి చేసుకోవడం ఎలా అన్నది అర్ధం కాక ఆయన కిందా, మీద అవుతున్నారు. అందువల్లే టిడిపి, జనసేన కూటమి ఏర్పాటు ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుంది. మరో వైపు చంద్రబాబు నాయుడు కూడా 175 సీట్లలో ఓడించాలన్నదే తమ అభిప్రాయం అంటున్నారే తప్ప అన్ని సీట్లలో పోటీ చేస్తామని, అన్ని సీట్లలో తెలుగుదేశం గెలుస్తుందని నేరుగా చెప్పలేకపోతున్నారు. 175 సీట్లలో పోటీచేయండని వైసిపి సవాల్ చేయడం ఏమిటని అంటున్నారు. ఇంతవరకు తానే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధినని చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పడం లేదు. సాదారణంగా అయితే ఆయనే అవుతారు. పవన్ వర్సెస్ లోకేష్ కాని ఒక వైపు సొంతపుత్రుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మితే తానే సి.ఎమ్. అభ్యర్ది అవుతానని చెప్పి ఉండేవారు. చంద్రబాబు వయసు రీత్యా కాని, పార్టీలో ఇటీవలికాలంలో టిక్కెట్లు మొదలు పలు నిర్ణయాలు చేస్తున్న తీరు గమనిస్తే ఆయనే పార్టీపై పెత్తనం చేస్తున్నట్లు కనిపించే యత్నం చేస్తున్నారనిపిస్తుంది. తనే సి.ఎమ్. అభ్యర్ధి అని చెప్పుకుంటే నష్టం జరుగుతుందని లోకేష్ భయపడుతుండాలి. అదే సమయంలో పైకి చెప్పడం లేదు కాని అవకాశం వస్తే సి.ఎమ్. చైర్ పై ఆయనే ఖర్చీప్ వేస్తారన్న అభిప్రాయం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ను సి.ఎమ్. అభ్యర్ధి గా అంగీకరిస్తేనే టిడిపితో పొత్తు పెట్టుకోవాలన్న డిమాండ్ జనసేన కార్యకర్తలలో గట్టిగా ఉంది. వృద్ధ నేత చేగొండి హరి రామజోగయ్య ఆ సంగతి ఇప్పటికే చెప్పేశారు. పవన్ కళ్యాణ్ కు సి.ఎమ్ కోరిక ఉందన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఆయనపై ఆయనకే నమ్మకం లేదు. అది వేరే సంగతి. ఈ నేపధ్యంలో , లోకేష్ సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏ రకంగా పెట్టుకోవడం అన్నది చంద్రబాబుకు ఇంకా నిర్దారణ కాలేదు. పవన్ తోనే సి.ఎమ్. పదవి తనకు అక్కర్లేదని చంద్రబాబు చెప్పించినా ఆశ్చర్యం లేదన్నది కొందరి భావనగా ఉంది. అలా జరిగితే రాజకీయం ఒకరకంగా ఉంటుంది. అలాకాకుండా లోకేష్, పవన్ లు సి.ఎమ్. అభ్యర్ధిత్వానికి పోటీ పడితే చంద్రబాబుకు ఎటూ పాలుపోకపోవచ్చు. జనసేన ఏభైకి పైగా సీట్లను డిమాండ్ చేయడం చంద్రబాబుకు ఇరకాటమే. ఆ రకంగా చంద్రబాబు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు సతమతం! అందుకే ఆయన అన్ని సీట్లలో పోటీచేయమంటారేమిటని వైసిపిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తానే సి.ఎమ్. అభ్యర్ధినని చెప్పలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఆయనకు ఇలాటి పరిస్థితి రాలేదు. 1999, 2004లలో బిజెపితో జట్టు కట్టినా, 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో కూటమి కట్టినా, 2014లో బిజెపి, జనసేనలతో కలిసి పోటీచేసినా, ఆ కూటముల నుంచి ఎవరూ సి.ఎమ్. పదవికి చంద్రబాబుతో పోటీ పడలేదు. ఈసారి జనసేన అధికారంలో వాటా కోరుకుంటోంది. సి.ఎమ్. సీటును తమకు కూడా ఇవ్వాలని కోరుతోంది. ఒకవైపు లోకేష్, మరో వైపు పవన్ కళ్యాణ్ .. ఇంకోవైపు అసలు అధికారం దక్కదేమో అన్న దిగులు మధ్య చంద్రబాబు కూడా సతమతం అవుతున్నారు. తత్ఫలితంగానే ఆయన తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో పోటీచేస్తుందని చెప్పలేకపోతున్నారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని గట్టిగా అనలేకపోతున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ -
ప్రధాని సానుకూలంగా స్పందించారు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించా. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరాను. వీటిపై ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు’’ అని సీఎం వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్న సమయంలో సుమారు గంట పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విభజన చట్టంలో హామీలలో కీలకాంశాలు ఇంకా నెరవేరలేదని, త్వరగతిన వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారితో చర్చించడం జరిగింది. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు. pic.twitter.com/20WiwfSlXQ — YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2022 ఏపీకి ప్రత్యేక హోదా అంశం, కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంతో పాటు పెండింగ్ బకాయిల విడుదలలో జాప్యం, జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు, తెలంగాణ డిస్కం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు మెట్రో రైల్వే లైన్, కడప స్టీల్ ప్లాంట్ అంశాలను సైతం ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీటికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం ఢిల్లీ వెళ్లి ఏం తెచ్చారు?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం తెచ్చాడో చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు మూడు లక్షలు ఇస్తామన్నంటున్న కేసీఆర్... తెలంగాణలో చనిపోయిన వేల మంది రైతులకు ఏమివ్వడా అని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అమెరికా విభాగం కన్వీనర్ అభిలాశ్‌రావు పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిలాష్‌రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అన్నారు. రెండోసారి సీఎం అయినప్పటి నుండి 67 వేల మంది రైతులు చనిపోయారని ఆరోపించారు. పాలమూరు జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని, నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం కొల్లాపూర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏ అడ్డమీద చూసిన పాలమూరు బిడ్డలే ఉన్నారని, వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లు కావద్దా, బానిసలుగానే బతకాలా అని ప్రశ్నించారు. పూర్వ జిల్లాలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క కొల్లాపూర్‌నే కాదు మొత్తం పాలమూరునే కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుందన్నారు. పాలమూరు బిడ్డకి కాంగ్రెస్‌లో చట్టసభల్లోకి అవకాశం ఇచ్చిందే సోనియాగాంధీ అని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎవరెవరికో ఓట్లు వేశాం ఇప్పుడు కాంగ్రెస్‌కు వేద్దామని అన్నారు. గుడిని, గుడిలోని లింగాన్ని దోచేవాడు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అని, నోట్ల కట్టలు లేనిదే ఆయన ఏ పనీ చేయడని విమర్శించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27 , 28ల్లో ఇందిరాపార్క్‌లో చేపడుతున్న ‘వరి దీక్ష’కు రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన అభిలాష్ రావ్ మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతమే తన సిద్ధాంతమని, ప్రాణం పోయేవరకు కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని అపాయింట్మెంట్ కేసీఆర్ అడగలేదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలే దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే గత సెప్టెంబర్ 1వ తేదీన అపా యింట్మెంట్ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వడం, సీఎం కేసీఆర్ వారిని కలవడం జరిగిం దని గుర్తు చేశాయి. నీటి పంపకాలు, వరి ధాన్యం కొను గోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవ డానికి ఢిల్లీ వెళ్తామని, అవసరమైతే తాను ప్రధానిని కలు స్తానని గత శనివారం సీఎం విలేకరుల సమా వేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆ మరు సటి రోజే ఢిల్లీ బయ ల్దేరి వెళ్లిన సీఎం బుధవా రం సాయంత్రం హైదరా బాద్ తిరిగి చేరు కున్నారు. అయితే నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. మోదీని, అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చా యి. ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ తమకు ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాయి. -
సేద తీరేందుకే ఢిల్లీకి కేసీఆర్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత నెల రోజులుగా ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉందని రైతు కన్నీరు మున్నీరవుతుంటే రైతన్నను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహాసమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాజకీయ చదరంగంలో రైతును పావుగా చేసుకుని ఆటలాడుతున్నాయంటూ మండిపడ్డారు. ఆయా పార్టీలు ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తుంటే రైతన్న నిస్సహాయుడై దీనంగా చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతుల పరిస్థితి, రాజకీయ అంశాలపై బుధవారం తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎప్పుడో యాసంగి పంటకు సంబంధించిన సమస్యను ఇప్పటి వానాకాలం పంటకు ముడిపెట్టి తడిగుడ్డతో రైతు గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కల్లంలో రైతు కన్నీరు తుడవాల్సిన సీఎం.. ఇందిరా పార్కు వద్ద ఏసీ టెంటు కింద 2 గంటలు సేదతీరి, ఇప్పడు ఢిల్లీ వెళ్లి అక్కడా చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లడం వెనుక స్వీయ ప్రయోజనాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉత్తరమే వరి రైతు పాలిట ఉరి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంట కొనుగోలు విషయంలో గత ఆగస్టులోనే అన్ని రాష్ట్రాలతో ఎఫ్‌సీఐ సమావేశం పెట్టిందని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయని చెప్పారు. ప్రస్తుతం వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా యాసంగి గురించి పంచాయతీ ఏంటని ప్రశ్నించారు. మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వర్షంలో పంట తడిచి మొలకెత్తిందని, మొలకెత్తిన ధాన్యాన్ని కొనే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుతో పెట్టుకుంటే పాతరేస్తారన్న భయం పాలకుల్లో వచ్చిందని, అందుకే క్షమాపణలు చెప్పి మరీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. ఆ చట్టాలను సమర్థించిన కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మందికి పైగా అన్నదాతల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, అద్భుత సంకల్పాన్ని ప్రదర్శించిన రైతు జాతికి అభినందనలు చెబుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయిందని, కామారెడ్డి జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకుని ఈ విషయం చెబుతున్నానని రేవంత్ పేర్కొన్నారు. -
ఫలించని నిరీక్షణ.. ప్రధానితో ఖరారు కాని సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు, నదీ జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా, ఇతర కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నాలుగు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ తిరిగివెళ్లారు. ధాన్యం కొనుగోలు విషయంలో వార్షిక పరిమితిని ముందుగానే ప్రకటించే అంశంపై ప్రధానితో చర్చించాలని భావించినా ఆయన నిరీక్షణ ఫలించలేదు. ఉత్తరప్రదేశ్‌లో అభివృధ్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, వ్యవసాయ చట్టాల రద్దు అంశాలపై కేబినెట్ భేటీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల సన్నద్ధత నేపథ్యంలో ప్రధానితో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నందున డిసెంబర్ రెండు లేక మూడో వారంలో ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వచ్చి మోదీని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇక నదీ జలాల అంశం, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉన్నా, షెకావత్ రాజస్థాన్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వీలుపడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో సీఎం సమావేశమవుతారని భావించినా అలాంటిదేమీ జరగలేదు. 26న వచ్చే స్పష్టతను బట్టి కార్యాచరణ ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు మాత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంత సానుకూలత వ్యక్తమయ్యింది. ఈ వానాకాల సీజన్‌కు సంబంధించి గతంలో నిర్ణయించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కన్నా కొంత అధికంగా సేకరించేందుకు ప్రయత్నిస్తామని గోయల్ చెప్పారు. అదే సమయంలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేశారు. యాసంగిలో కొనే పంటలపై వ్యవసాయ శాఖతో చర్చించి 26 నాటికి స్పష్టత ఇస్తామని చెప్పిన నేపథ్యంలో.. దానిని బట్టి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖల మంత్రులతో గోయల్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తి, వినియోగం, కేంద్రం కొనుగోలు, వన్‌నేషన్–వన్రేషన్ అంశాలపై చర్చించనున్నారు. -
సీఎం సతీమణికి ఢిల్లీలో నేడు వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సతీమణి శోభ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కుమారుడు కేటీ ఆర్తో పాటు ఆమె ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ధాన్యం సేకరణ, నీటి వాటాలపై కేం ద్రంతో చర్చించేందుకు సీఎం కూడా ఆదివారం ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందే. కోవిడ్–19 మహమ్మారి బారినపడిన తర్వాత శోభ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. కేసీఆర్ సైతం తన సతీమణితో కలిసి ఆస్పత్రికి వెళ్లనున్నట్టు సమాచారం. -
కేంద్రంతో అమీతుమీ.. కేసీఆర్ రెండు రోజుల హస్తిన పర్యటన
వరిసాగుపై కేంద్రం ఎందుకో సరిగా స్పందించడం లేదు. అనురాధ కార్తె శుక్రవారం ప్రారంభమైంది. ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు అయోమయంలో ఉంటరు. ముందే చెబితే వేరే పంట వేసుకుందుం కదా.. యాళ్లకు నష్టపోయినం అనే మాట వస్తది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రైతులు ఏ పంట వేసుకోవాలో చెబుతాం రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలుపై మాట్లాడతామని, బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినట్లు మొన్న ఓ గాలివార్త వచ్చింది. ఇది అధికారికమా? కాదా? అడిగి తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్తున్నం. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని నిర్ణయించాం. ఆయా కుటుంబాలను కలిసి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల సాయం చొప్పున మొత్తం రూ. 22.5 కోట్లు అందిస్తాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణతోపాటు నీటి వాటాలు, ఇతర సమస్యలపై కేంద్రంతో తేల్చుకునేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో వెళ్లి.. ఢిల్లీ రైతుల ఉద్యమం, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ చట్టాలు తదితర అంశాలపై ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తామని వెల్లడించారు. రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని తేల్చుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్లో పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ధాన్యంపై ఉలుకూపలుకు లేదు.. ‘తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఎటువంటి సమాధానం వస్తలేదు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి సంవత్సరంలో ఎంత సేకరిస్తారో టార్గెట్ ఇవ్వమని అడుగుతున్నం. దాన్నిబట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మొన్న ధర్నా చేసిన రోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. ఏం మాట్లాడలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, ఎంపీల బృందంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల కార్యదర్శుల బృందంతో ఢిల్లీకి వెళ్తున్నం. కేంద్ర మంత్రులతో పాటు అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోరుతం. అవసరమైతే రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాం. ఆ తరువాత రైతులకు మా విధానం ఏంటో చెపుతం..’అని సీఎం వెల్లడించారు. కేసులు ఎత్తివేయాలి..వేధింపులు ఆపాలి ‘భద్రతా బలగాల నిర్బంధం, ఒత్తిళ్లు, కేసుల నడుమ 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటం అద్భుత విజయం సాధించింది. చట్టాలను వెనక్కు తీసుకోవడంతో రైతుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. ఈ ఉద్యమ సమయంలో రైతులపై దేశద్రోహం సహా వేలాది కేసులు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇలాంటి కేసులను వెంటనే ఎత్తివేసి, రైతులపై వేధింపులను ఆపివేయాలి. కేంద్రం అనుసరించిన దుర్మార్గ విధానాలతో సుమారు 750 మంది రైతులు పోరాటంలో భాగంగా ఆత్మార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం క్షమాపణలతో చేతులు దులుపుకోకుండా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఇచ్చి ప్రజాస్వామ్యం విలువలను కాపాడాలి. రైతులపై కేసుల ఎత్తివేత, రూ.25 లక్షల సాయంతో పాటు పంటలకు కనీస మద్దతు ధర చట్టం కోసం పార్లమెంటులో కొట్లాడుతం..’అని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కు తీసుకోవాలి ‘దళారులు, వ్యాపారుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధర కోసం దేశంలోని 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా సమయంలో ప్రధాని ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్’తరహాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఆత్మ కృషి నిర్భర్’పథకాన్ని తీసుకురావాలి. వ్యవసాయ చట్టాల తరహాలోనే పార్లమెంటులో పెట్టిన విద్యుత్ చట్టాన్ని కూడా కేంద్రం వెనక్కు తీసుకోవాలి. నూతన కరెంటు చట్టం పేరిట ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల మెడపై కత్తి పెట్టడంతో ప్రజలు, విద్యుత్ కార్మికులలో ఆందోళన నెలకొంది. మోటార్లకు మీటర్లు పెట్టాలనే నియంతృత్వ పోకడలకు వెళితే రైతులు రోడ్లెక్కుతారు..’అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ట్రిబ్యునల్ వేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకెవడు? ‘నదీజలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కొత్త రాష్ట్రానికి నీటి వాటాతో పాటు అనేక అంశాల్లో కేంద్రం తాత్సారం చేస్తోంది. 8 ఏళ్లుగా కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటా తేల్చకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకుంటున్న ప్రణాళికలు ఆలస్యమై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానిని, జలశక్తి మంత్రిని కలిసినప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కోరడంతో పాటు మూడు నాలుగు నెలల కాలవ్యవధిలో రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చాలని అడుగుతం. ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయడంలో కేంద్రానికి ఏం అడ్డం పడుతోంది. కేంద్రం రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కల కొడుకు ఎవడు? కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ఆందోళనకు దిగుతాం..’అని చెప్పారు. బీసీ కుల గణన జరపాలి ‘గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలపై ఇప్పటికే రాష్ట్ర శాసనసభ తీర్మానాలు చేసి పంపింది. దేశంలో బీసీ కులగణనను కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలే కులం సర్టిఫికెట్లు ఇస్తున్న నేపథ్యంలో కులాల లెక్కలు దాచిపెట్టుడెందుకు ? కుల గణన చేపట్టకుంటే పెద్ద వివాదానికి దారితీస్తుంది..’అని కేసీఆర్ పేర్కొన్నారు. పిచ్చిమాటలు వినొద్దు.. రైతులు ఆగం కావొద్దు ‘స్థానిక బీజేపీ నాయకులు పిచ్చిమాటలు కట్టిపెట్టాలి. మీ బండారం బయటపడింది. మీరు చేసిన తప్పులకు ప్రజల ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలి. చిల్లరగాళ్లు చెప్పే మాటలకు రైతులు ఆగం కావద్దు. ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చే క్రమంలో తొందరపడవద్దు. వానాకాలం ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు 6,600 కేంద్రాలు ఏర్పాటు చేసి డబ్బులు ఇస్తున్నం. వర్షాలు పడుతున్నందున కోతలు కోయనివారు రెండు మూడు రోజులు ఆగాలి. లేదంటే ధాన్యం రంగు మారి నష్టపోవలసి వస్తుంది. కోసిన వారు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. యాసంగిలోనూ రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు సిద్ధం చేస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఏ పంటలు వేసుకోవాలో రైతులకు చెపుతం..’అని అన్నారు. ఎన్నికలు ఉన్నందునే వ్యవసాయ చట్టాలు వెనక్కి ‘దేశంలోని ప్రజలకు ఆహారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే. దేశంలో బియ్యం తినే జనం ఎక్కువ. మన రాష్ట్రంలోనే పీడీఎస్ కింద 25 లక్షల టన్నుల బియ్యం అవసరం. 58.66 లక్షల ఎకరాల్లో వరి సాగైందని కేంద్రమే చెపుతోంది. కేంద్రంపై పోరాటంలో ఏ సమయంలో ఎవరిని కలుపుకొనిపోవాలో వారిని కలుపుకొనివెళతాం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారు. దేశంలో ఆయన్ను ఎవరూ నమ్మడం లేదు..’అని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు గవర్నర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
త్వరలో ఢిల్లీకి మమతా.. సోనియా గాంధీని కలువనుందా?
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలలో భాగంగా అపాంట్మెంట్ దొరికితే.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కొవింద్ను కలుస్తానని పేరొన్నారు. అదే విధంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి, పలువురు నేతలను కాలవనున్నాను’ అని మమతా బెనర్జీ గురువారం పేరొన్నారు. మమత ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 2024లో బీజేపీని ఎదుర్కొవడానికి పలు ప్రతిపక్ష పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమీలో ఆమె భాగస్వామ్యం కానున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మమతాబెనర్జీ జూలై 25న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వార్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్టు13 వరకు జరుగుతాయి. ఇటీవల బీజేపీ వ్యకతిరేక కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్సీపీ నేత శరద్ పవర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో మమత పర్యటనపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించారు. సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినిందని, రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయిందని, అందు వల్లే రాష్ట్రం అప్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉందని, లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. కరోనా చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పోలవరం సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం ప్రోగ్రెస్‌లో ఉందని పేర్కొన్నారు. చదవండి: వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్ -
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూనే సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సాగిందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పోలవరం, విభజన హామీలు, పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం ముందుంచారని స్పష్టం చేశారు. దీన్ని ఓ వర్గం మీడియా, విపక్షం వక్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షం ఎన్ని కుట్రలు చేసినా వికేంద్రీకరణ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం అధికారిక పర్యటన వల్ల సమస్యల పరిష్కారంలో మరింత చొరవ పెరిగే వీలుందన్నారు. రాష్ట్ర పురోగతిని వివరించి కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు సీఎం పర్యటన తోడ్పడుతుందన్నారు. కోవిడ్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కకావికలమైనా సీఎం జగన్ సంక్షేమ రథాన్ని ముందుకు నడిపారని చెప్పారు. ఎందుకీ కడుపు మంట? సీఎం ఢిల్లీ పర్యటనపై పనిగట్టుకుని ఎల్లో మీడియా రాద్దాంతం చేయడం విడ్డూరం. అసలెందుకీ కడుపు మంట? కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిస్తే ఒక ఏడుపు.. ఆయనకు పనులుండి కలవకపోతే మరో ఏడుపా? దీనిపై ఓ మీడియా హడావుడి అంతా ఇంతాకాదు. ఏవైనా పనులుండి మంత్రితో భేటీ కుదరకపోతే అదేమైనా పెద్ద తప్పా? కేసుల కోసమే ప్రతీసారీ ఢిల్లీ వెళితే... కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్రపూరితంగా సీఎం జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులు ఎప్పుడో కొట్టేసి ఉండాలి కదా? ఇవన్నీ తప్పుడు కేసులని ప్రజా న్యాయస్థానం అనేక సార్లు తిప్పికొట్టింది. అందుకే ప్రజలు కాంగ్రెస్, టీడీపీని భూస్థాపితం చేశారు. కేసుల కోసం ఎవరి పంచనో చేరే మనస్తత్వం జగన్‌ది కాదు. కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఆశయాన్ని వీడలేదని గుర్తుంచుకోవాలి. పోలవరాన్ని సాకారం చేస్తున్న సీఎం సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రయోజనాలను ఓ యజ్ఞంలా భావిస్తున్నారు. టీడీపీ, ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఢిల్లీలో సీఎం పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. పోలవరం తన ఘనతేనంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం సిగ్గుచేటు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే అన్నారు. ఆయన హయాంలో పనులే జరగలేదు. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక కోవిడ్ ఉన్నా పనుల్లో వేగం పెరిగింది. వచ్చే ఏడాది పోలవరం నీళ్లిస్తాం. పౌర సరఫరాల ద్వారా అందే ధాన్యాన్ని పెంచాలని కేంద్రాన్ని సీఎం కోరారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా 30 లక్షల ఇళ్లను రాష్ట్రం నిర్మిస్తోంది. 15 లక్షలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ పథకానికి సాయం చేయాలని నీతి ఆయోగ్‌ను కోరాం. మౌలిక సదుపాయాలకు రూ. 34 వేల కోట్లు కావాలని తెలిపాం. హోదాను కోరారు. మూడు రాజధానులు ఖాయం న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికార వికేంద్రీకరణ జరగడం ఖాయం. మూడు రాజధానులు ఏర్పడటం ఖాయం. ఇది ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టితో ప్రకటించారు. దీనికి కేంద్ర సహకారం ఉంటుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సాయం కోరారు. సీఎం పర్యటనలో ఏదీ వ్యక్తిగతం లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని కోరాం. ప్రత్యేక హోదా సాధించాలనే డిమాండ్‌ను బతికించేందుకే మా పార్టీ ప్రయత్నిస్తోంది. అవకాశం వచ్చినప్పుడు సాధించే దిశగా కృషి చేస్తున్నాం. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మేం బలహీనంగానే ఉన్నాం. వ్యవస్థల్లో తను వేసిన వట వృక్షాల ఆధారంగానే చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేయాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను దేవస్థానం బోర్డు ఘనంగా స్వాగతించింది. ప్రభుత్వం నుంచి మంత్రిని పంపలేదని రాజకీయం చేయడం సరికాదు. -
YS Jagan: ‘ఆహార భద్రత’లో లోపాలు సవరించాలి
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ ఆహార భద్రతా చట్టం కింద హేతుబద్ధతలేని పరిమితి కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, వీరందరి రేషన్భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాయని, అలాంటి రాష్ట్రాలకు కుటుంబాల ప్రాతిపదికన ఎక్కువ శాతం రేషన్ కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ హేతుబద్ధత లేని విధానం వల్ల తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని గణాంకాలతో సహా వివరించారు. ఈ విధానాన్ని సరిదిద్ది రాష్ట్రంలోని అర్హులైన 1.47 కోట్ల రేషన్‌కార్డులకు రేషన్ అందేలా చూడాలని కోరారు. ఉచిత రేషన్ బియ్యం కింద కేంద్రం.. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.3,229 కోట్లు వెంటనే చెల్లించాలని విన్నవించారు. శుక్రవారం ఆయన కేంద్ర రైల్వే, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో సుమారు గంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని తెలిపారు. రెండు నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంపై ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 2015 డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.29 కోట్ల రేషన్‌కార్డులకు 1,85,640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయించారని తెలిపారు. 2015 డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం కుటుంబాలకు.. పట్టణాలు, నగరాల్లో 41.14 శాతం కుటుంబాలకు మాత్రమే రేషన్ ఇస్తున్నారని చెప్పారు. దీనివల్ల కేవలం 91 లక్షల రేషన్ కార్డులకే బియ్యం పంపిణీని పరిమితం చేశారని తెలిపారు. తద్వారా కేటాయింపులు 1,85,640 మెట్రిక్ టన్నుల నుంచి 1,54,148కి తగ్గించారని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోç ఇంటింటా సర్వే చేసి పారదర్శక పద్దతిలో 1.47 కోట్ల రేషన్‌కార్డుదారులను గుర్తించామని, వీరందరూ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అమలయ్యే కార్యక్రమాలన్నింటికీ అర్హులని వివరించారు. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని కేటాయిస్తున్న ప్రాతిపదిక, రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించినదని.. తెలంగాణకు, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా అదే ప్రాతిపదికన బియ్యాన్ని కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. రేషన్‌కార్డులకు అర్హులైన వారిని గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, కార్డుదారుల వివరాలన్నీ డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు శుక్రవారం ఢిల్లీలో వేంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేస్తున్న సీఎం జగన్ ఎంఎస్పీతో ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అందుకు సంబంధించిన సొమ్ము సకాలంలో రైతులకు అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే.. బకాయిల విడుదల అత్యంత అవసరమని కేంద్ర మంత్రికి విన్నవించారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు సహకరించాలి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విషయాన్ని సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేం«ద్ర ప్రధాన్‌తో ఆయన సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలపై విస్తృతంగా చర్చించారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి హెచ్‌పీసీఎల్ – గెయిల్ సంస్థలు రూ.32,900 కోట్లు ఖర్చయ్యే మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేశాయని కేంద్రమంత్రికి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు సమకూర్చాలంటూ కేంద్రాన్ని కోరిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రసుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారం మోయలేదని తెలిపారు. ప్రాజెక్టు విధివిధానాలు చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్ గ్రూపు సభ్యులను నామినేట్ చేశామని, కేంద్రం చర్చలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్పొరేట్ పన్నును కేంద్రం 25 శాతం తగ్గించిందని, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో నిమిత్తం లేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించండి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వల్ల సుమారు 20 వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, వేలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమ సమయంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజల త్యాగాల పునాదుల మీద ఈ పరిశ్రమ వచ్చిందన్నారు. 2002 –2015 మధ్య స్టీల్‌ప్లాంట్ మంచి పనితీరును కనబరిచిందని, లాభాలు కూడా ఆర్జించిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 19,700 ఎకరాల భూమి ఉందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు పైనే ఉంటుందన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్.. విస్తరణ నిమిత్తం పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందని తెలిపారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమకు వచ్చిన గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014–15 నుంచే కష్టాలు వచ్చాయని వివరించారు. సొంత గనులు కేటాయించాలి సొంత గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిందని చెబుతూ, ప్లాంటు పునరుద్ధరణకు పలు ప్రత్యామ్నాయాలు కేంద్ర మంత్రికి సూచించారు. 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ 6.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పని చేస్తోందని చెప్పారు. డిసెంబర్ 2020 నుంచి నెలకు రూ.200 కోట్ల లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు. ఇదే పరిస్థితి రెండేళ్లపాటు కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. ఇనుప ఖనిజాన్ని ఎన్డీఎంఈ, బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు టన్ను సుమారు రూ.5,260తో కొనుగోలు చేస్తోందన్నారు. పోటీ సంస్థలు 60 శాతం ఇనుప ఖనిజాన్ని సొంత గనుల నుంచే పొందుతున్నాయని, మిగతా ఎన్ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయని వివరించారు. సెయిల్‌కు సొంతంగా 200 సంవత్సరాలకు సరిపడా నిల్వలున్న గనులు ఉన్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్ మార్కెట్ ధరకు ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేయడం వల్ల పరిశ్రమపై రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. ఒడిశాలో లభ్యమయ్యే ఇనుప ఖనిజ గనులు విశాఖ ప్లాంటుకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమకు రూ.22 వేల కోట్లు రుణాలు ఉన్నాయని, వీటిపై 14 శాతం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తున్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రుణాలు ఈక్విటీ రూపంలోకి మార్చాలని కోరారు. స్టాక్ ఎక్సేంజీలో నమోదు ద్వారా బ్యాంకులు తమ షేర్లు అమ్ముకొనే అవకాశాలు కూడా పరిశీలించాలన్నారు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన, రాష్ట్రానికి మకుటం లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకొనే విషయంలో సంబంధిత కేంద్ర శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరోనా రెండో వేవ్ సమయంలో 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ ఉక్కు పరిశ్రమ అందించి, లక్షల మంది ప్రాణాలు కాపాడిందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్ సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పెట్రోలియం శాఖ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విధివిధానాలు కూడా ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులతో సమావేశం సమయంలో సీఎం జగన్ వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, భరత్, రెడ్డెప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనా«థ్ దాస్ తదితరులు ఉన్నారు. కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి చేరుకున్నారు. ఏపీ సీఎంతో చర్చలు ఫలవంతం – కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చలు ఫలవంతమయ్యాయని కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. శుక్రవారం సీఎం జగన్‌తో ఆయన గంట సేపు సమావేశమయ్యారు. అనంతరం ‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు వేగవంతం చేయడం.. కేజీ బేసిన్, తూర్పుగోదావరి జిల్లాను ప్రధాన హైడ్రో కార్బన్ హబ్‌గా స్థాపించడంపై ఫలవంతమైన చర్చలు జరిపాం. రాష్ట్రంలో చమురు, గ్యాస్ ప్రాజెక్టులు అమలు చేయడంలో మద్దతిస్తున్న ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం కలిసి పని చేయడానికి అంగీకరించాం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ఆర్థికాభివృద్ధిలో నూతన శకానికి నాంది పలికినట్లు అయింది’ అని ఆయన ట్వీట్ చేశారు. అమిత్‌షాతో సీఎం డిన్నర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో గురువారం రాత్రి సుమారు గంటన్నరకుపైగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి సమావేశమైన విషయం విదితమే. అమిత్‌షా, సీఎం జగన్‌లు డిన్నర్ చేస్తూ ఆయా అంశాలు చర్చించారు. కాగా, శుక్రవారం సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్.. సీఎం జగన్మోహన్రెడ్డి కారు వద్దకు వచ్చి ఆల్ ద బెస్ట్ అంటూ వీడ్కోలు పలికారు. -
కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను కోరారు. 2020-21 రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న సీఎం జగన్.. సకాలంలో రైతులకు పేమెంట్లు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతుందని, బకాయిలు విడుదల అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీ బకాయిలు చెల్లించాలని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంచితే, కోవిడ్ వల్ల రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. 2015 డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌కార్డుదారులకు ప్రతినెల బియ్యం కేటాయిస్తున్నారని, 2015 డిసెంబర్ తర్వాత 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో 60.96% కుటుంబాలకు, పట్టణాల్లో 41.14% కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి బియ్యం ఇచ్చేలా సూత్రాన్ని అమలు చేస్తున్నారని పీయూష్ గోయల్‌కు తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం జగన్ తెలిపారు. ముందుగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ ఉన్నారు. చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం -
కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి వివరించారు. కాకినాడ ఎస్ఈజెడ్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై భారం లేకుండా చూడాలన్నారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ సీఎస్, పెట్రోలియం కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు వచ్చిందన్నారు. 2002-15 మధ్య స్టీల్‌ప్లాంట్ మంచి పనితీరు కనబరిచిందని కేంద్రమంత్రికి సీఎం జగన్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో 19,700 ఎకరాల భూమి ఉందని, స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉందని వివరించారు. గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014-15 నుంచి స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు. సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలను సీఎం సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలన్నారు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ ప్లాంట్‌కు కేటాయించాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో కేంద్ర శాఖలతో కలిసి పనిచేస్తామని సీఎం అన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను స్టీల్‌ప్లాంట్ అందించిందని.. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిందని కేంద్రమంత్రికి సీఎం వైఎస్ జగన్ వివరించారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ ఉన్నారు. చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం పోలవరం ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ -
రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్‌షా, జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. చదవండి: వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు సీఎం జగన్‌ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు -
టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారు..
సాక్షి, న్యూఢిల్లీ: నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ ఎంపీలపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారే వెళ్లి శాంతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఆలయాలపై దాడులకు పాల్పడింది ఎవరన్న విషయం ఆధారాలతో బహిర్గతం కావడంతో టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో గత్యంతరం లేక అమిత్ షా వద్ద సాష్టాంగ పడేందుకు ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. టీడీపీ ఎంపీల తీరుపై ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ.. తల్లిదండ్రులను కడతేర్చిన ఓ కసాయి కొడుకు కోర్టు బోనులో భోరున విలపిస్తూ.. 'తల్లితండ్రి లేని వాడిని', 'నన్ను శిక్షించకండి' అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. నిన్న అమిత్ షా వద్దకు వెళ్లిన టీడీపీ ఎంపీలు..ప్రవీణ్ చక్రవర్తికి సంబంధించిన పాత వీడియోను ఆయనకు చూపించి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, దీన్ని బట్టి దొంగలు ఎవరు, నేరం ఎవరిదనే విషయం స్పష్టమయ్యిందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఆరాచకాలపై పూర్తి సమాచారం కలిగిన అమిత్ షా ముందు వారి పప్పులు ఉడకలేదని, అందుకే నామమాత్రపు భేటీని ఆయన త్వరగా ముగించి సాగనంపారన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశలపై చర్చించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం నిధులు వంటి అంశాలపై మాత్రమే సీఎం జగన్ అమిత్ షాను కలుస్తారని వివరించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయటంపై ఆయన స్పందిస్తూ.. తాము బలహీనులము కాదని, అలాగే తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదని ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాజకీయ పార్టీగా తమకంటూ ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు కొడాలి నాని, దేవినేని ఉమ ఎపిసోడ్లో పూర్తి బాధ్యత టీడీపీదేనని పునరుద్ఘాటించారు. టీడీపీ నేతలు పదే పదే ఒకే అబద్దాన్ని చెప్పి దానిని నిజం చేయాలని చూస్తున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు తామేమాత్రం వెరవమని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో, రాష్ట్ర ప్రజలకు ఇదివరకే స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైకోర్టు విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాజధాని భూముల్లో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతుందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ఇందులో కిలారి రాజేష్ కేసు ఓ చిన్న విషయం మాత్రమేనని, త్వరలో పెద్ద తలకాయలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. -
‘రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ జాతీయ నాయకులు కేసీఆర్ అవినీతిపై మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు ఢిల్లీలో సీఎం పర్యటనలో దాగున్న రహస్యం ఎంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం తిట్టుకొని ఇప్పుడు రహస్య మంతనాలు ప్రజలు గమనించాలన్నారు. రైతులకు మద్దతుగా డిసెంబర్ 8న భారత్ బంద్‌లో టీఆర్ఎస్ కూడా పాల్గొందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులను పిలుచుకొని కేసీఆర్ ఢిల్లీ రైతులకు మద్దతుగా కలిసి దీక్షల శిబిరంలో పాల్గొనాలని సూచించారు. కేసీఆర్ కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తమ ఎంపీలు, శాఖ అధికారులు ఎందుకు లేరని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. చదవండి: అవినీతిలో ఆమెకు ఆమే సాటి ‘గత 15 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఎముకలు కొరికే చలిలో రైతులు నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ అమిత్‌షాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కేసీఆర్, అమిత్‌షా, మోదీ ,ఒవైసీ అంత ఒకటే. ఢిల్లీ పై పోరాటం చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ బీజేపీ నేతలను కలుస్తున్నారు. దేశంలో ఏ పార్టీ పైన అయిన సీబీఐ ,ఈడీ కేసులు చేస్తున్న బీజేపీ కేసీఆర్‌పై ఈగ కూడా వాలనివ్వడం లేదు. కేసీఆర్ అవినీతిపైన ఎందుకు విచారణ జరిపిస్తలేరు. వరదసాయం ఆడిగేతే దాని అంచనా ఏది.. అధికారులను ఎందుకు తీసుకుపోలేదు. మీరు వేయమంటేనే సన్న వడ్లు రైతులు వేశారు. అక్కడే ఉన్న ఢిల్లీ నేతలను సన్న వడ్లకు మద్దతు ధర కల్పించాలని అడగండి. బీజేపీ బెదిరింపులకు భయపడే ఢిల్లీ వెళ్లావు. తెలంగాణ ప్రయోజనాల కోసం అని కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ మీ పోరాటానికి అండగా ఉంటుంది. కానీ ఓ రహస్య ఎజెండా తో రాజకీయ లబ్ది కోసమే ఢిల్లీ వెళ్లారు.’ అని కేసీఆర్‌ను నిలదీశారు. చదవండి: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్ -
హస్తిన బాటలో..
అసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న ఆశావహులు ఢిల్లీకి చేరారు. ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న నేతలంతా హస్తిన బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమకు అనుకూలంగా నివేదికలు రూపొందించుకొని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే పాలమూరులోని కొన్ని స్థానాల కోసం కూటమి భాగస్వామ్య పార్టీ లైన టీడీపీ, టీజేఎస్‌లు పట్టుబడుతున్నాయి. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ తరఫున కూడా తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి మిత్రపక్షాలకు చెందిన వారు సైతం తమ స్థానాలను పదిలం చేసుకోవడం కోసం ఢిల్లీ బాట పట్టారు. తమకున్న పరిచయాలు, ఇతరత్రా అంశాలను ఉపయోగించుకుంటూ సీటు దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా సీట్ల కేటాయింపు, పొత్తులు రెండు, మూడు రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉండడంతో... పాలమూరు ప్రాంత రాజకీయా లు ఆసక్తికరంగా మారాయి. పోటాపోటీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగా ఉన్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో టికెట్ల కోసం పోటీ తీవ్రమవుతోంది. దీంతో ఏడాది కాలంగా పలువురు పార్టీ లో చేరుతున్నారు. ఫలితంగా పలు స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం మేరకు దరఖాస్తులు కూడా భారీగానే అందాయి. కొల్లాపూర్ వంటి కొన్ని చోట్ల పార్టీలో లేని వారు సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టి... ముగ్గురు చొప్పున పేర్లతో కూడిన జాబితాను పార్టీ హైకమాండ్‌కు పంపించింది. అయితే జిల్లాలో సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మాత్రమే ఎలాంటి పోటీ లేదు. దీంతో గద్వాల, కొడంగల్, అలంపూర్, వనపర్తి, కల్వకుర్తితో పాటు అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల విషయంలో ఇబ్బందులు తలెత్తడం లేదు. ఇక మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలకు కాస్త పోటీ నెలకొంది. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకునేందుకు హస్తిన బాట పట్టారు. జడ్చర్ల సీటు దక్కించుకునేందుకు పారిశ్రామికవేత్త జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం వద్ద మంతనాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన ఆశా వహులు కూడా వారం రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ ఆశావహులు భారీగా ఉన్న చోటనే మహాకూటమి మిత్ర పక్షాలు కూడా సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. దీంతో సీట్ల కేటాయింపు అంశం ఎటూ తేలక ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. కూటమి అభ్యర్థులు సైతం టీఆర్ఎస్ను గద్దె దింపడమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కలిసి మహాకూటమిగా జతకట్టాయి. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే పాలమూరు ఉమ్మడి జిల్లాలో టికెట్ల కేటాయింపుపై తకరారు నెలకొంది. జిల్లాలో టీడీపీ మూడు స్థానాల కోసం గట్టిగా పట్టుబడుతోంది. మహబూబ్‌నగర్, మక్తల్‌తో పాటు జడ్చర్ల లేదా దేవరకద్ర నియోజకవర్గాలను ఆశిస్తోంది. అయితే వీటిలో రెండు స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ మహబూబ్‌నగర్ స్థానం కోసం టీడీపీ గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలు స్తోంది. కానీ ఇదే స్థానం కోసం తెలంగాణ జన సమితి కూడా పట్టుబడుతోంది. ఈ మేరకు టీజేఎస్‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 స్థానాల్లో కేవలం ఒక్క మహబూబ్‌నగర్ టిక్కెట్టు ఇచ్చినా సరిపెట్టుకుంటామనే ప్రతిపాదనను కూటమి ఎదుట చేసినట్లు సమాచారం. ఇందుకోసం టీజేఎస్‌కు చెందిన ప్రతినిధులు కూడా ఢిల్లీలో గట్టి పైరవీ చేస్తూ... మహబూబ్‌నగర్ స్థానాన్ని ఖరారు చేసుకొవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇలా మొత్తం మీద ఎవరికి వారు టికెట్ల కో సం హస్తినలో మంతనాలు చేస్తున్నారు. -
ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్
నీతీ ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించనున్న ఆయన విధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ర్టాల్లో అమలుచేసే పథకాలపై నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందచేస్తారు. కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరి లను మంగళవారం కలవనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ర్టానికి నిధుల పెంపు, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా.. డిసెంబర్ 23 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆయుత మహా చండీ యాగం లో పాల్గొనాల్సిందిగా.. రాష్ట్ర పతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోడీలను ఆహ్వానించనున్నారు. సీఎం వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ వెళ్లనున్నారు. -
కృష్ణా జల వివాదంపై ఎటూ తేల్చని కేంద్రం
సమస్యను పట్టించుకోని కేంద్ర జలవనరుల శాఖ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో అపాయింట్మెంట్ ఇవ్వని మంత్రి ఉమాభారతి సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కృష్ణా నదీ జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా తన మౌనాన్ని వీడటం లేదు. వివాదంలో జోక్యం చేసుకునే అవకాశాలపై న్యాయ శాఖను సంప్రదించామని సమాచారం ఇచ్చిన కేంద్ర జల వనరుల శాఖ తదనంతర చర్యలపై మళ్లీ స్తబ్ధుగా మారిపోయింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి సమస్యను వివరించి సానుకూలంగా మలచుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగినా ఆమె అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిరాశపరిచారు. దీంతో కృష్ణానదిలో 119 టీఎంసీల నీటి లభ్యత ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మొదలైన వివాదం ప్రస్తుతం నీటి నిల్వలు 51 టీఎంసీలకు పడిపోయినా పరిష్కారం మాత్రం లభించలేదు. కృష్ణానదిలో నాగార్జునసాగర్ వరకు మొత్తంగా 616.37 టీఎంసీల నీటి లభ్యత ఉండగా అందులో 549.652 టీఎంసీల నీరు వాడుకునేందుకు ఇరు రాష్ట్రాలకు అవకాశం ఉంది. ఈ నీటిని తెలంగాణ, ఏపీలు 41.61శాతం, 58.39శాతం చొప్పున వాడుకోవాల్సి ఉంది. ఇందులో ఏపీకి దక్కే నిర్ణీత వాటా 320.94 టీఎంసీలను దాటి మరో 1.722 టీఎంసీలు అదనంగా వాడుకున్న అనంతరం తొలిసారి వివాదం రేగింది. వెంటనే అప్రమత్తమైన తెలంగాణ గత ఏడాది డిసెంబర్లోనే ఏపీ వైఖరిని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణాలో ఏపీ వాటా పూర్తయినందున లభ్యతగా ఉన్న 119 టీఎంసీల నీరు మొత్తం తమదేనని తేల్చిచెప్పింది. ఇక్కడినుంచి మొదలైన వివాదం ఇరు రాష్ట్రాల చర్చలు, బోర్డుకు వరుస లేఖలతో ముందుకు సాగినా ఫలితం తేలలేదు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి సహా, కేంద్ర అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి కేంద్ర జోక్యానికై విన్నవించారు. దీనిపై మొదట అంటీముట్టనట్టుగా వ్యవహరించిన కేంద్రం పెరుగుతున్న ఒత్తిళ్ల మేరకు తమ జోక్యం చేసుకునే పరిధిని తెలపాలంటూ కేంద్ర న్యాయ శాఖను సంప్రదించింది. అయితే న్యాయ శాఖ ఎలాంటి సూచనలు చేసింది.., దానిపై జల వనరుల శాఖ వైఖరేంటన్నదీ ఇప్పటివరకు వెల్లడికాలేదు. దీంతో మరోమారు కేంద్ర మంత్రిని కలసి సమస్యను వివరించాలని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. వివిధ కారణాలతో అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఉమాభారతిని కలవకుండానే సీఎం కేసీఆర్ వెనుదిరిగారు.