సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు, నదీ జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా, ఇతర కేంద్ర మంత్రులతో చర్చించేందుకు నాలుగు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఎవరినీ కలవకుండానే హైదరాబాద్ తిరిగివెళ్లారు. ధాన్యం కొనుగోలు విషయంలో వార్షిక పరిమితిని ముందుగానే ప్రకటించే అంశంపై ప్రధానితో చర్చించాలని భావించినా ఆయన నిరీక్షణ ఫలించలేదు.
ఉత్తరప్రదేశ్‌లో అభివృధ్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, వ్యవసాయ చట్టాల రద్దు అంశాలపై కేబినెట్ భేటీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల సన్నద్ధత నేపథ్యంలో ప్రధానితో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నందున డిసెంబర్ రెండు లేక మూడో వారంలో ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ వచ్చి మోదీని కలిసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇక నదీ జలాల అంశం, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉన్నా, షెకావత్ రాజస్థాన్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వీలుపడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో సీఎం సమావేశమవుతారని భావించినా అలాంటిదేమీ జరగలేదు.
26న వచ్చే స్పష్టతను బట్టి కార్యాచరణ
ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు మాత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంత సానుకూలత వ్యక్తమయ్యింది. ఈ వానాకాల సీజన్‌కు సంబంధించి గతంలో నిర్ణయించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కన్నా కొంత అధికంగా సేకరించేందుకు ప్రయత్నిస్తామని గోయల్ చెప్పారు.
అదే సమయంలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేశారు. యాసంగిలో కొనే పంటలపై వ్యవసాయ శాఖతో చర్చించి 26 నాటికి స్పష్టత ఇస్తామని చెప్పిన నేపథ్యంలో.. దానిని బట్టి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖల మంత్రులతో గోయల్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తి, వినియోగం, కేంద్రం కొనుగోలు, వన్‌నేషన్–వన్‌రేషన్ అంశాలపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment