సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం సరికాదన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏ రాష్ట్రంలోనైనా రూ.21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా?. నిరూపిస్తే మేమంతా వచ్చి క్షమాపణలు చెబుతాం అంటూ కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
‘‘సమస్యను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత. కేసీఆర్ ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను పోషించారా?. ఒక్కరోజైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేశారా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిదేనా?. మేం ఓడిపోయినా మళ్లీ ప్రజా తీర్పు కోరినాం. గెలిస్తే ఉప్పొంగడం.. ఓడితే కుంగిపోవడం మంచిదేనా?. కేసీఆర్ ఓ గాలి బ్యాచ్‌ను జతచేశారు. పరిశ్రమలు తెస్తామంటే, ఫార్మాసిటీ కడతాం అంటే, రోడ్లు వేస్తామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే మీరు వద్దు అంటున్నారు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? అంటూ రేవంత్ దుయ్యబట్టారు.
పరీక్షలు పెట్టొద్దు.. ఉద్యోగాలు ఇవ్వొద్దంటే తెలంగాణకు మంచిదేనా?. 1200 మంది ప్రాణ త్యాగం చేసింది మీ ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు చేయడానికా?. జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబరు 7కు అంతే ప్రాధాన్యత ఉంది. తొలి దశ ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేశారు. మలిదశ ఉద్యమకాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశాడు. తొలి, మలిదశ ఉద్యమంలో నల్లగొండ గడ్డ ప్రాధాన్యత ఎంతో గొప్పది. నల్లగొండ గడ్డపై కాలు పెడితే నిజాంలను తమిరికొట్టిన ఉద్యమ స్పూర్తి వస్తుంది. ఫ్లోరైడ్ కారణంగా కన్నపిల్లలను కూడా తాళ్లతో కట్టేసి పనికిపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది’’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment